సమీక్ష : సౌఖ్యం – పరమ బోరింగ్ సినిమా!!

సమీక్ష : సౌఖ్యం – పరమ బోరింగ్ సినిమా!!

Published on Dec 27, 2015 2:00 PM IST
Soukhyam telugu review

విడుదల తేదీ : 24 డిసెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : కెఎస్ రవికుమార్ చౌదరి

నిర్మాత : వి.ఆనంద్ ప్రసాద్

సంగీతం : అనూప్ రూబెన్స్

నటీనటులు : గోపీచంద్, రెజీన..

‘లౌక్యం’, ‘జిల్’ సినిమాలతో డీసెంట్ హిట్స్ అందుకున్న మాచో హీరో గోపీచంద్ హీరోగా నటించిన మరో ఫామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సౌఖ్యం’. యజ్ఞం తర్వాత మరోసారి గోపీచంద్ కెఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో చేసిన ఈ సినిమాలో రెజీన హీరోయిన్ గా నటించింది. కామెడీని హైలైట్ చేస్తూ యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కలిపి చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సౌఖ్యం సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం..

కథ :

కుటుంబ విలువలతో పాటు, డబ్బు కూడా ఉన్న మంచి ఫ్యామిలీ,, ఆ ఫ్యామిలీకి వారసుడు మన హీరో శ్రీను (గోపీచంద్). ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగే ఈ శ్రీను ఓ ట్రైన్ జర్నీలో హీరోయిన్ శైలజ(రెజీన)ని చూసి ప్రేమలో పడతాడు. అదే ప్రేమని శ్రీని శైలజకి చెప్తే మొదట నో అంటుంది, కానీ ఫైనల్ గా ఓ రోజు ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఓ రోజు శైలజని ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. స్వతహాగా గొడవలకి దూరంగా ఉండమని చెప్పే శ్రీను ఫాదర్ కృష్ణారావు(ముఖేష్ రుషి) కోరిక మేరకు శ్రీను శైలజని వెతకడం మానేస్తాడు. కానీ శ్రీను గతంలో పెట్టుకున్న గొడవల వలన భావూజీ(ప్రదీప్ రావత్) మనుషులు అతన్ని చంపాలనుకుంటారు. కానీ అది కుదరదు.

దాంతో భావూజీ తెలివిగా దెబ్బ కొట్టాలని ఓ ప్లాన్ వేసి కలకత్తాలో కింగ్ మేకర్ అయిన పిఆర్(దేవన్) కూతుర్ని లేపుకు రమ్మని చెప్తాడు. శ్రీను ఉన్న పరిస్థితుల వల్ల భావూజీ మాట మేరకు కలకత్తా వెళ్తాడు. అక్కడే అసలైన ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి? అక్కడి నుంచి కథ ఎలా జరిగింది? భావూజీ శ్రీనుని కిడ్నాప్ చేసుకురమ్మన్న అమ్మాయి ఎవరు? భావూజీ శ్రీనుని పిఆర్ దగ్గర ఇరికించడానికి గల కారణం ఏంటి? ఫైనల్ గా శ్రీను ఇవన్నీ దాటుకొని ఎలా తన ఫ్యామిలీని, శైలజ ప్రేమని కాపాడుకున్నారు అన్నదే మీరు చూసి తెలుసుకోవాల్సిన కథ.

ప్లస్ పాయింట్స్ :

మాచో హీరో గోపీచంద్ ఈ సినిమాలో కొత్త తరహా పాత్ర చేసాడని చెప్పలేం కానీ తనకి ఇచ్చిన పాత్రకి మాత్రం న్యాయం చేసాడు. కాస్త కొత్తగా కనిపించడం కోసం సినిమాలో తన లుక్ పై కేర్ తీసుకొని బాగా స్టైలిష్ గా కనిపించాడు. ఇక ఎప్పటిలానే కామెడీ, యాక్షన్ అంశాల్లో తన స్టైల్ లో ఆకట్టుకున్నాడు. రెజీన ఈ సినిమాలో పక్కింటి అమ్మాయిలా బాగా చేసింది. కొన్ని కామెడీ సీన్స్ లో కామెడీ టచ్ బాగానే ఇచ్చింది. ఇక గ్లామర్ పరంగా పాటల్లో బాగానే అందాలు ఆరబోసింది. వీరిద్దరి తర్వాత ఫస్ట్ హాఫ్ లో ట్రైన్ సీన్ లో శావుకార్ జానకి కూసింత నవ్విస్తుంది. ఇక శివాజీ రాజా, రఘు బాబు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ మీద రాసుకున్న కామెడీ కొన్ని చోట్ల బాగానే పేలింది.

ముఖ్య పాత్రల్లో కనిపించిన ముఖేష్ ఋషి, ప్రగతి, సత్య కృష్ణ, సురేఖ వానిలు తమ పాత్రల్లో బాగా చేసారు. ఇకపోతే శ్వత భరద్వాజ్ ఓ ఐటెం సాంగ్ లో కనిపించి సినిమాకి గ్లామర్ అట్రాక్షన్ గా మారింది. ఇక సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో అక్కడకక్కడా కామెడీ పరవాలేదనిపిస్తుంది, అలాగే ఇంటర్వల్ బ్లాక్ ని, ప్రీ ఇంటర్వల్ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసుకున్న విధానం బాగుంది. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

సౌఖ్యం సినిమాకి చెప్పే మొదటి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ దాదాపు అందరికీ తెలిసిందే..అదే సినిమా కథ. ఇప్పటి వరకూ కోన వెంకట్ – గోపి మోహన్ ల నుంచి వచ్చిన చాలా చాలా సినిమాల కథలను మిక్స్ చేసి ఆయన శిష్యుడు శ్రీధర్ సీపాన ఈ కథ రాసాడు. కావున కథలో మీరు ఎక్కడా సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్, అరే ఈ ట్విస్ట్ ఏదో బాగుందే అనుకునేలా ఏమీ ఉండదు. సెకండాఫ్ అయితే మళ్ళీ మరీ మరీ బోరింగ్. అందరినీ ఓ ప్లేస్ కి చేర్చి హీరో వేసిన మస్కా ప్లాన్ ని అమలు చేసే విధానం బాగా రెగ్యులర్ గానే కాకుండా చాలా ఊహాజనితంగా అనిపిస్తుంది. కథ పాతది అవడం వలన, కోన వెంకట్ – గోపి మోహన్ లు కథనంతో మేజిక్ చేయలేకపోయారు. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే అయితే మరీ బోరింగ్ గా అనిపిస్తుంది.

కథ కథనంలతో పాటు దర్శకత్వం కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్..రవికుమార్ చౌదరి పేపర్ మీద రాసుకున్న సీన్స్ ని కూడా సరిగా స్క్రీన్ పైకి తీసుకురాలేకపోయాడు. దాంతో సినిమాలో కామెడీ అనేది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సినిమా అమొట్టం మీద నవ్వుకునే సీన్స్ ఓ నాలుగైదు ఉంటాయేమో. ఇక హీరో పాత్రని బాగా స్ట్రాంగ్ గా చూపించినప్పటికీ తనకి ఎదురయ్యే విలన్ పాత్రలని సీరియస్ గా చూపకుండా వారిని కూడా కామెడీ చేసెయ్యాలని చెప్పి సినిమాలో గ్రిప్ లేకుండా చేసేసారు. ఇక రొటీన్ కథ అవ్వడం వలన రన్ టైం కూడా బాగా ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. అలాగే పాటలు కూడా తెలుగు సినిమా అంటే ఐదు పాటలుండాలి అన్నట్లుగా వరుసగా వస్తుంటాయి.

కామెడీ కోసం చాలా మంది కమెడియన్స్.. అనగా బ్రహ్మానందం, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, తదితరులను పెట్టుకున్నారు. కానీ వీరెవ్వరూ నవ్వించలేకపోయారు. మెయిన్ గా ప్రీ క్లైమాక్స్ లో బ్రహ్మానందం ఎపిసోడ్ నవ్వించకపోగా సినిమాని బాగా సాగాదీసేస్తుంది. చెప్పాలంటే కొన్ని చోట్ల ఆడియన్స్ తమ సహనాన్ని కోల్పోయేలా నాశిరకమైన కామెడీని రాసారు.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ టీంలో ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ గా చెప్పాల్సింది ప్రసాద్ మురేళ్ళ సినిమాటోగ్రఫీ గురించి.. ప్రతి ఫ్రేం చాలా కలర్ఫుల్ గా, గ్రాండ్ గా ఉండేలా ఆయన తీసుకున్న కేర్ ప్లస్ అయ్యింది. అలాగే నటీనటుల్ని ప్రజంట్ చేసిన తీరు కూడా బాగుంది. ఇక అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ బాగుంది, వాటికి విజువల్స్ తోడయ్యాక ఆన్ స్క్రీన్ చూడటానికి బాగున్నాయి. ఇక అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఒక్క హీరోయిజం ఉన్న సీన్స్ కి రీ రికార్డింగ్ బాగుంది. గౌతంరాజు ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో పరవాలేదనిపించినా సెకండాఫ్ లో మాత్రం బాగా సాగదీసినట్టు ఉంటుంది. వివేక్ అన్నామలై ఆర్ట్ వర్క్ బాగుంది. వెంకట్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.

శ్రీధర్ సీపాన అందించిన కథలో కొత్తదనం లేదు, కోన వెంకట్ – గోపి మోహన్ ల నుంచి వచ్చిన చాలా సూపర్ హిట్ సినిమాల ఫార్ములా కథనే మళ్ళీ రాసాడు, కానీ వారి కథల్లో కామెడీ ప్లస్ అయ్యింది కానీ ఇక్కడ అస్సలు అవ్వలేదు. ఇక శ్రీధర్ సీపాన కుప్పలు తెప్పలుగా పంచ్ లు ఉండే ప్రాస డైలాగ్స్ రాసాడు. అందులో కొన్ని బాగానే అనిపించినా, కొన్ని సందర్భానికి సింక్ అవ్వలేదు. ఇక కోన వెంకట్ – గోపి మోహన్ లు రాసిన కథనం ఫస్ట్ హాఫ్ ని కొంతలో కొంత పరవాలేధనిపించేలా చేయగలిగినా సెకండాఫ్ ని మాత్రం సేవ్ చేయలేకపోయారు. వీరి స్క్రీన్ ప్లే కూడా సినిమాకి మైనస్. ఇక డైరెక్టర్ గా ఎఎస్ రవికుమార్ చౌదరి రెగ్యులర్ కథని ఎంటర్టైనింగ్ గా చెప్పేసి సక్సెస్ కొట్టేయాలని చూసాడు. కానీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేదే అస్సలు వర్కౌట్ కాకపోవడం వలన తన అంచనా బోల్తా పడింది. ఫైనల్ గా రవికుమార్ చౌదరి ఒక డీసెంట్ ఫిల్మ్ ని కూడా అందించలేకపోయాడు. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

గోపీచంద్ నుంచి వచ్చిన ‘సౌఖ్యం’ సినిమా కూడా గతంలో వచ్చిన లౌక్యం సినిమా తరహాలో సాగే కథే. కానీ ఆ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణం అందులో కామెడీ వర్కౌట్ అవ్వడం కానీ ఇందులో ఆ కామెడీ అనేది వర్కౌట్ అవ్వలేదు. అందుకే సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. గోపీచంద్ – రెజీనలా కాంబినేషన్, కొన్ని కొన్ని కామెడీ సీన్స్, ఇంటర్వల్ ఎపిసోడ్స్ సినిమాకి ప్లస్ అయితే పరమ రొటీన్ కథ, బోరింగ్ స్క్రీన్ ప్లే, సెకండాఫ్, సినిమాని మరీ సాగదీయడం, సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేది కొరవడడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే.. కొత్తదనం కోరుకునే వారికి అస్సలు నచ్చని సినిమా, అలాగే రెగ్యులర్ మూస ఫార్ములా సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కి కూడా కావాల్సిన అంశాలను అందించలేని బోరింగ్ సినిమా ‘సౌఖ్యం’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు