సమీక్ష : ఒక కాలేజ్ స్టొరీ – రాగింగ్ కి పరాకాష్ట..

సమీక్ష : ఒక కాలేజ్ స్టొరీ – రాగింగ్ కి పరాకాష్ట..

Published on Apr 14, 2013 3:45 AM IST
Oka-College-Love1 విడుదల తేదీ : 13 ఏప్రిల్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.25/5
దర్శకుడు : టి. ప్రభాకర్
నిర్మాత : టి. రాజారం రెడ్డి, కిరణ్ తోట
సంగీతం : టి. ప్రభాకర్
నటీనటులు : శ్రావణ్, మోనాల్ గజ్జర్…

చాలా కాలం క్రితమే సినిమా మొత్తం పూర్తయినప్పటికీ కొన్ని రోజులు ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల, కొన్ని రోజులు విడుదలకి సరైన సందర్భం లేదని వాయిదా వేసుకుంటూ వచ్చిన ‘ ఒక కాలేజ్ స్టొరీ’ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రావణ్ హీరోగా, మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా పరిచయమైన (అదృష్టవశాత్తు ఈ సినిమా తర్వాత మోనాల్ గజ్జర్ చేసిన సినిమాలు దీనికంటే ముందే విడుదలై కాస్త గుర్తింపు తెచ్చాయి) ఈ సినిమాకి టి. ప్రభాకర్ దర్శకుడు. టి. రాజారం రెడ్డి, కిరణ్ తోట నిర్మించారు. ఇంతకీ డైరెక్టర్ ఈ కాలేజ్ స్టొరీ ద్వారా ఏం చెప్పాలనుకున్నాడా అనేది ఇప్పుడు చూద్దాం….

కథ :

ఓపెన్ చేస్తే సి.ఎం.ఆర్ మెడికల్ కాలేజ్. డాక్టర్లు అయిపోదామని ఎన్నో ఆశలతో కాలేజీలోకి ప్రెషర్స్ అడుగుపెట్టారు. అలా చేరిన వారిలో సూర్య(శ్రావణ్), సింధు(మోనాల్ గజ్జర్), మస్కా రామచంద్ర మూర్తి, కామేష్, రాజేష్, రమ, రాజ్ కుమార్ ఫ్రెండ్స్ అవుతారు. అన్ని కాలేజీల్లో లాగానే ఈ కాలీజ్ లో కూడా సీనియర్స్ జూనియర్స్ ని రాగింగ్ చేస్తుంటారు. కానీ ఇదే కాలేజీలో మినిస్టర్ కొడుకు మనోహర్ చదువుతుంటాడు. అతను జూనియర్స్ ని ఒక రేంజ్ లో టార్చర్ పెడుతుంటాడు. మనోహర్ నాన్నకి బయపడి మనోహర్ పై కాలేజ్ యాజమాన్యం ఎలాంటి యాక్షన్ తీసుకోదు. మనోహర్ పై సూర్య యాంటీగా కంప్లైంట్ ఇచ్చాడని ఒకరోజు మనోహర్ సూర్య పై అటాక్ చేస్తాడు కానీ రివర్స్ లో సూర్యనే మనోహర్ ని, అతని గ్యాంగ్ ని కొడతాడు.

అలా దెబ్బతిన్న మనోహర్ సూర్యని, అతనికి కావాల్సిన వాళ్ళని దారుణంగా అవమానపరచాలి, అవసరమైతే చంపేయాలని అనుకుంటాడు. అందులో భాగంగానే సూర్య ప్రేమించే సింధుని కిడ్నాప్ చేస్తాడు? అలా కిడ్నాప్ చేసిన సింధుని మనోహర్ ఏం చేసాడు? సూర్య సింధుని రక్షించాడా? లేదా? చివరికి ఆ కాలేజ్ లో రాగింగ్ పై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు? అనేదే మిగిలిన కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

మోనాల్ గజ్జర్ చూడటానికి నాచురల్ గా, అందంగా ఉంది. అలాగే పాత్రకి తగ్గట్టు ఆమె నటన కూడా బాగుంది. మస్కా రామచంద్ర మూర్తి చేసిన రెడ్డప్ప కామెడీ ట్రాక్, రాజేష్ – కామేష్ – రాగిణిల మధ్య జరిగే సీనియర్ – జూనియర్ లవ్ ట్రాక్ ప్రేక్షకులని నవ్విస్తుంది. డైరెక్టర్ స్టొరీ కోసం ఎంచుకున్న థీం లైన్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరో పాత్ర పోషించిన శ్రావణ్ చాలా పెద్ద మైనస్. సినిమాలో కామెడీ, లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని సన్నివేశాల్లోనూ 90% ఒకే ఒక్క ఎక్స్ ప్రెషన్ తో లాగించేసాడు. అది ప్రేక్షకులకి చిరాకు తెప్పిస్తుంది. అలాగే అతనిలో హీరోలో ఉండాల్సినంత ఎనర్జీ లెవల్స్ లేవు. సినిమాలో డాన్సులు వేయడానికి బాగానే కష్టపడ్డాడు, కొన్ని స్టెప్స్ బాగున్నాయి కానీ పేస్ లో మాత్రం సేమ్ ఎక్స్ ప్రెషన్ ఉండడంతో ఆ స్టెప్స్ అంతగా ఆకట్టుకోలేదు. అలాగే హీరోని బట్టి ఫైట్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి కానీ మన హీరో కొడితే ఎగిరెగిరి పడుతుంటారు ఆ ఫైట్స్ ఆకట్టుకునే విధంగా లేవు.

ఈ మధ్యకాలంలో సినిమాలో మొదటి నుంచి చివరి వరకూ భూతు చూపించడం, లేక హింస చూపించడం చివర్లో అలా చెయ్యకూడదు అనే రెండు డైలాగ్స్ పెట్టేసి సినిమాలు తీసేస్తున్నారు. కానీ అవి చూడగలిగేలా ఉన్నప్పుడు అందరూ మంచి మెసేజ్ సినిమా తీసారని, బాగుందని మెచ్చుకుంటారు లేదంటే బండబూతులు తిడతారు. అదే కోవలోనే ఈ సినిమా డైరెక్టర్ కూడా ‘దేశం మొత్తం అన్ని కాలేజీల్లోనూ రాగింగ్ అనేది మంచిది కాదు, సీనియర్స్ – జూనియర్స్ కలిసి ఫ్రెండ్లీగా ఉండాలి’ అనే లైన్ ని థీంగా ఎంచుకున్నాడు.

అలా ఎంచుకున్న డైరెక్టర్ కి ఏమైంది ఏమో తెలియదు గానీ సినిమా మొదటి నుంచి చివరి వరకూ రాగింగ్ రాగింగ్ రాగింగ్ .. సీనియర్స్ జూనియర్స్ ని కొట్టడం, టార్చర్ పెట్టడం, చాన్స్ దొరికినప్పుడు జూనియస్ సీనియర్స్ ని కొట్టడం, మళ్ళీ సీనియర్స్ జూనియర్స్ ని మాటేసి కొట్టడం సినిమా అంతా ఇదే.

కానీ కొన్ని సందర్భాల్లో రాగింగ్ ని కాస్తా పర్సనల్ పగగా మార్చేసి చాలా దారుణంగా చూపించాడు ఎలా ఉంటుందంటే ఒక టెర్రరిస్ట్ వేరే దేశం వాన్ని ఎలా టార్చర్ పెడతాడో, ఒక పోలీస్ తీవ్రవాదికి థర్డ్ డిగ్రీ టార్చర్ ఎలా ఉంటదో ఆ రేంజ్ లో ఉంటది ఇలా చూపించాల్సింది అంతా చూపించడమే కాకుండా చివర్లో తెలుగు ఆడియన్స్ జీర్ణించుకోలేని ఒక ట్రాజిడీతో, రెండు నీతి డైలాగ్స్ చెప్పి కథని ముగించడంతో ప్రేక్షకుడికి ఆగ్రహానికి అవధుల్లెకుండా పోతాయి.

సినిమా మొదటి నుంచి చాలా నిదానంగా సాగుతుంది, ఇంటర్వల్ బ్లాక్ లో మాస్ ఆడియన్స్ ని కాస్త ఆకట్టుకునేలా తీసినా సెకండాఫ్ మొదలయ్యి మళ్ళీ స్లోగా ముందుకుపోవడంతో ఆ ఫీల్ కాస్తా పోతోంది. ఎక్కడైనా ప్రేక్షకుడు ఉత్కంఠతకి లోనయ్యే విధంగా ఉంటే అదీ లేదు. సినిమాలో ఒక్క చోట చిన్న ట్విస్ట్ పెట్టాడు, కానీ అక్కడి నుండి సినిమాని చాలా సేపు సాగదీయడంతో ఆ ట్విస్ట్ రివీల్ చేసే లోపే ప్రేక్షకులకి అర్థమైపోతుంది. ఎంచుకున్న కథని సరిగ్గా డెవలప్ చేసుకోలేకపోయారు, అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా వీక్ గా ఉంది.

సినిమాలోని రెండు మూడు పాటలు సందర్భం లేకుండా వచ్చి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడమే కాదా అప్పటికే స్లో గా నడుస్తున్న సినిమాని ఇంకాస్త స్లో చేస్తాయి. అలాగే టైటిల్ కాలేజ్ స్టొరీ అని పెట్టాడు మన కాలేజ్ దేశ ని గుర్తుకు తెస్తుంది అనుకోని మాత్రం సినిమాకి వెళ్ళకండి అలా వెళితే మీ కాలేజ్ దేశ గుర్తుకు రాగాపోగా చిరాకొస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో చెప్పదగినది ఒక్క సినిమాటోగ్రఫీ మాత్రమే. తనకి ఇచ్చిన లోకేషన్స్ ని వీలైననత వరకూ బాగా చూపించడానికి ప్రయత్నించాడు. ఎడిటర్ ఇంకాస్త మనసు పెట్టి కత్తిరించాల్సింది. డైలాగ్స్ వెరీ పూర్ అండ్ రొటీన్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు పరవాలేదు. కథ – థీం లైన్ బాగుంది కానీ డెవలప్ చేసుకున్న విధానం అస్సలు బాలేదు. డైరెక్షన్ – కథ, స్క్రీన్ ప్లే సరిగ్గా కుదరకపోతే కాస్తో కూస్తో డైరెక్షన్ లోనే మానేజ్ చెయ్యాలి కానీ డైరెక్టర్ టి ప్రభాకర్ మానేజ్ చెయ్యలేకపోయాడు. అలాగే హీరో, కొంతమంది ఆర్టిస్టుల నుంచి సరైన ఎక్స్ ప్రెషన్స్ రాబట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా హీరోని చూపించడంలో, ఎక్స్ ప్రెషన్స్ రాబట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు.

ఇక చివరిగా సంగీతం – ఈ సినిమాకి సంగీతం కూడా డైరెక్టరే అందించడం విశేషం. పాటలు పరవాలేధనిపిస్తాయి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ ఓ విషయం చెప్పాలి డైరెక్టర్ ఈ సినిమాలోని ఆరు పాటల్లో ఏ ఒక్క పాటైనా వేరే ట్యూన్స్ కి కాపీ అనిపిస్తే పాటకి లక్ష రూపాయలు ఇస్తామన్నాడు అదే నిజమైతే పాటలు విన్న ప్రతి ఒక్కరికీ, సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ రెండు మూడు లక్షలివ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటున్నానో మీకు అర్థమయ్యిందనుకుంటున్నా…

తీర్పు :

ఒక కాలేజ్ స్టొరీ – పగ ప్రతీకారాలతో సీనియర్స్ – జూనియర్స్ మధ్య నడిచే కథ. మోనాల్ నటన, రెండు కామెడీ ట్రాక్స్, థీమ్ లైన్ తప్ప ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. హీరో నటన, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎబ్బెట్టుగా అనిపించే రాగింగ్ సీన్స్, తెలుగు ఆడియన్స్ జీర్ణించుకోలేని ట్రాజిడీ క్లైమాక్స్ ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. వేసవిలో హాయిగా సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకుడికి నచ్చే ఒక్క అంశం కూడా ఇందులో లేదు. ఈ కాలేజ్ స్టొరీ రాగింగ్ కి పరాకాష్ట.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.25/5

రాఘవ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు