సమీక్ష : రారా కృష్ణయ్య – యూత్ కి నచ్చే కృష్ణయ్య.!

Ra-Ra-Krishnayya-review విడుదల తేదీ : 4 జూలై 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం :మహేష్ బాబు.పి
నిర్మాత : వంశీకృష్ణ శ్రీనివాస్
సంగీతం : అచ్చు
నటీనటులు : సందీప్ కిషన్, రెజీన, జగపతి బాబు, కళ్యాణి..

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా సక్సెస్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘రారా కృష్ణయ్య’. సందీప్ తో ఓ హిట్ పెయిర్ అనిపించుకున్న రెజీన కసాండ్రా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, కళ్యాణి కీలక పాత్రల్లో నటించారు. పి. మహేష్ బాబు డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ పెయిర్ అనిపించుకున్న సందీప్ కిషన్ – రెజీన మరోసారి హిట్ అందుకున్నారా? లేదా? అలాగే జగపతిబాబు స్పెషల్ రోల్ ఎంతవరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంది? అన్నది ఇప్పుడు చూద్దాం.

కథ :

కిట్టు(సందీప్ కిషన్) నిజాయితీగా బతకాలనుకునే ఓ కుర్రాడు. కిట్టు చెన్నైలో మాణిక్యం మొదలియార్(తనికెళ్ళ భరణి) దగ్గర ఓ కారు రెంట్ కి తీసుకొని డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. కిట్టు రూపాయి రూపాయి కూడబెట్టి 6 లక్షల అమౌంట్ ని మాణిక్యం దగ్గర దాచి పెడతాడు. కిట్టు సొంతంగా కారు కొనుక్కోవాలని మాణిక్యంని తన డబ్బు తిరిగి ఇమ్మని అడిగితే మాణిక్యం డబ్బు ఇవ్వలేదని మోసం చేస్తాడు. అప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాని కిట్టు మాణిక్యం కూతురు నందీశ్వరి అలియాస్ నందు(రెజీన కసాండ్రా)ని తన పెళ్లి జరుగుతున్న సమయంలో కిడ్నాప్ చేస్తాడు.

తన డబ్బు తనకి ఇచ్చి తన కూతుర్ని తీసుకెళ్ళమని కిట్టు మాణిక్యం కి వార్నింగ్ ఇస్తాడు. అలా మొదలైన కిట్టు – నందుల జర్నీ పలు మలుపులు తిరుగుతున్న సమయంలో జగ్గూ భాయ్(జగపతి బాబు) నందుని కిడ్నాప్ చేస్తాడు. కట్ చేస్తే కిట్టుకి – జగ్గు భాయ్ కి మధ్య ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? జగ్గూ భాయ్ కి – కిట్టుకి ఉన్న రిలేషన్ ఏంటి? అసలు జగ్గూ భాయ్ నందుని ఎందుకు కిడ్నాప్ చేసాడు? చివరికి కిట్టు నందుని మాణిక్యంకి అప్పగించాడా? లేదా? ఈ కిడ్నాప్ జర్నీలో నందు – కిట్టులు ఏమన్నా ప్రేమలో పడ్డారా? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ఉన్న స్పెషల్ అట్రాక్షన్స్ లో ఒకరు రెజీన కసాండ్రా.. ఈ సినిమాకి రెజీన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. డైరెక్టర్ రాసుకున్న రెజీన పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. డైరెక్టర్ అనుకున్న దానికంటే ఎక్కువగా రెజీన పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. దానికి కారణం రెజీన పెర్ఫార్మన్స్. నటనలో ఈజ్, బ్యూటిఫుల్ లుక్ మరియు పాటల్లో గ్లామరస్ టచ్ ఈ మూడు కలబోసిన రెజీన ఈ సినిమా పరంగా ఫుల్ మార్క్స్ కొట్టేసి, సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది. సందీప్ కిషన్ ఎప్పటిలానే తనకి ఇచ్చిన పాత్రకి న్యాయం చేసాడు. కొన్ని చోట్ల కామెడీ సీన్స్ బాగా చేసి నవ్వించినా, ఎమోషనల్ సీన్స్ చెయ్యడంలో ఇంకా బెటర్ అవ్వాల్సి ఉంది. సందీప్ కిషన్ ఈ సినిమాలో డాన్సులు బాగా వేశాడు.

ఇక చెప్పుకోవాల్సింది జగ్గూ భాయ్ అదేనండి జగపతి బాబు గురించి. తన మాస్ గెటప్, పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ బాగా చేసాడు. కళ్యాణి ఉన్నది తక్కువసేపు అయినా బాగా చేసింది. ఫస్ట్ హాఫ్ లో తాగుబోతు రమేష్ ఓ తాగుబోతు లవర్ గా బాగా నవ్వించాడు. అలాగే ఫస్ట్ హాఫ్ కూడా పలు అందమైన లోకేషన్స్ లో అలా కాస్త ఎంటర్టైనింగ్ సాగిపోతుంది. ‘సత్యం’ రాజేష్ కూడా ఉన్న రెండు సీన్స్ లో నవ్విస్తాడు. సినిమా మొత్తంగా అక్కడక్కడా కొన్ని సీన్స్ బాగున్నాయి, క్లైమాక్స్ కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి చెప్పదగిన మైనస్ పాయింట్ అంటే అది సెకండాఫ్ అనే చెప్పాలి. అందులో మొదటి మైనస్ జగపతి బాబు పాత్ర డిజైన్. పైన చెప్పినట్టు జగపతి బాబు పెర్ఫార్మన్స్ బాగుంది కానీ ఆ పాత్రలో ఉండాల్సిన డెప్త్, స్ట్రాంగ్ నెస్ మరియు ఎలివేషన్ పూర్తిగా మిస్సింగ్. సెకండాఫ్ చూస్తున్నంత సేపూ జగపతి బాబు పాత్రలో ఏదో మిస్ అవుతోంది అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. నో ఎంటర్టైన్మెంట్ ఇన్ సెకండాఫ్. అలాగే రవిబాబు సెటప్ అంతా సినిమాకి పెద్ద ఉపయోగపడకపోగా సినిమా నిడివిని పెంచేసింది. ఇకపోతే సెకండాఫ్ లో ఉండాల్సిన మేజర్ పాయింట్ ఎమోషన్ బాండింగ్, అది సందీప్ – రెజీన మధ్య అయినా చూపించాలి లేదా జగపతి బాబు – సందీప్ మధ్య అయినా చూపించాలి. కానీ ఆ ఎమోషన్ బాండింగ్ అనేది పూర్తిగా మిస్ బాలెన్స్ అయ్యింది. దాంతో ఎమోషన్స్ పెద్దగా కనెక్ట్ కావు.

ఓవరాల్ గా సెకండాఫ్ ని సాగదీసినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ లో వచ్చే పాటలు కూడా స్లో సినిమాకి స్పీడ్ బ్రేకర్స్ లా అనిపిస్తాయి. అలాగే సినిమా స్క్రీన్ ప్లేలో ఏ మాత్రం దమ్ములేదు. ఎందుకంటే ఒక 20 నిమిషాల నుంచి తదుపరి ఏం జరుగుతుందా అనేదాన్ని ఆడియన్స్ ఈజీగా చెప్పేయగలరు. ముందు ఏం జరుగుతుందో తెలియడం వల్ల ఆడియన్స్ కి పెద్దగా కిక్కు ఉండదు. అలాగే ఈ సినిమా బాలీవుడ్ మూవీ ‘తేరే నాల్ లవ్ హోగయా’ సినిమాకి రీమేక్. కానీ అధికారిక రీమేక్ మాత్రం కాదు. కానీ సినిమాని మాత్రం పర్ఫెక్ట్ గా దించేసారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ది బెస్ట్ అని చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ.. శ్రీ రామ్ ఈ సినిమాలో తనకు ఇచ్చిన ప్రతి లొకేషన్ ని చాలా బాగా చూపించాడు. చాలా చోట్ల సీన్స్ బోర్ కొడుతున్నా తన విజువల్స్ మన చూపుని పక్కకి తిప్పుకోనివ్వవు. అంతలా తన విజువల్స్ తో ఆకట్టుకున్నాడు. అచ్చు అందించిన పాటలు యావరేజ్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దానికన్నా బెటర్ గా ఉంది. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మాత్రం సినిమాపై కూసింత శ్రద్ధ చూపి కాస్త బోరింగ్ గా అనిపిస్తున్న సీన్స్ కి కత్తెర వేసి ఉంటే బాగుండేది.

ఇక డైరెక్టర్ గా పరిచయమైన మహేష్ బాబు.పి మొదటి సినిమాకే 4 డిపార్ట్మెంట్స్ డీల్ చేసాడు. ఆ విశేషాల్లోకి వెళితే కథ – రీమేక్ అని చెప్పానుగా, కావున కథ విషయంలో ఏదో చిన్న చిన్న మార్పుల కోసం తప్ప పెద్దగా శ్రమ పడలేదు. కథనం – దీపక్ రాజ్ తో కలిసి స్క్రీన్ ప్లే రాసుకున్నా ఊహాజనితంగా ఉండడం వల్ల సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. మాటలు – చెప్పుకోదగ్గ రేంజ్ లో లేవు. దర్శకత్వం – నటీనటుల నుంచి అనుకున్న పాత్రలకి అనుకున్న రీతిలో నటనని రాబట్టుకున్నాడు. కానీ ఆడియన్స్ కి మాత్రం అనుకున్న రేంజ్ లో కనెక్ట్ చేయలేకపోయాడు. నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా తర్వాత కూసింత అంచనాల నడుమ వచ్చిన సందీప్ కిషన్ ‘రారా కృష్ణయ్య’ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇదొక రీమేక్ సినిమా కాన్సెప్ట్ దానికి తోడూ పెద్దగా ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ వాల్యూస్ జత చేయకపోవడం వలన ఈ కృష్ణయ్య ఓవరాల్ గా జస్ట్ యావరేజ్ అనిపించుకున్నాడు. జగపతి బాబు, సందీప్ కిషన్, రెజీన పెర్ఫార్మన్స్ మరియు ఫస్ట్ హాఫ్ సినిమాకి ప్లస్ అయితే ఏ ఎమోషన్ ని పూర్తిగా ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యని సెకండాఫ్ సినిమాకి పెద్ద మైనస్. ఈ సినిమాలో ఓవరాల్ గా కొన్ని పార్ట్స్ ని ఎంజాయ్ చేయవచ్చు, అందులోనూ ఫస్ట్ హాఫ్ ని కాస్త ఎక్కువగా ఎంజాయ్ చేయవచ్చు.ప్రస్తుతానికి బాక్స్ ఆఫీసు వద్ద చూడదగ్గ సినిమా ఏదీ లేకపోవడం, అలాగే ఓపెనింగ్స్ ఈ సినిమాకి బాగా రావడం వల్ల ఫస్ట్ వీక్ కలెక్షన్స్ బాగా వచ్చే అవకాశం ఉంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

 
Like us on Facebook