Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : టామీ – మంచి కథే కానీ..!

Tommy

విడుదల తేదీ : 13 మార్చి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : రాజా వన్నెం రెడ్డి

నిర్మాత : హరిరామ్ జోగయ్య

సంగీతం : చక్రి

నటీనటులు : రాజేంద్రప్రసాద్, సీత తదితరులు..


ఒకప్పుడు సున్నితమైన హాస్య చిత్రాల ద్వారా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, ఇప్పుడు పూర్తి స్థాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఈ క్యారెక్టర్ పాత్రలతో పాటు అప్పుడప్పుడు సున్నితమైన భావోద్వేగాలున్న, పూర్తి స్థాయి ఆఫ్ బీట్ సినిమాల్లో హీరోగానూ నటిస్తున్నారు. ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘ఓనమాలు’ లాంటి సినిమాలు ఆ కోవలోనివే. ఇప్పుడదే కోవలో ‘టామీ’ అన్న పేరుతో మనిషికి, మూగ జీవికి మధ్యనుండే బంధాన్ని తెరకెక్కించారు. నేడు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

సత్యం మాష్టారు (రాజేంద్ర ప్రసాద్) భీమవరంలో మంచి పేరున్న ప్రొఫెసర్. రోజూ భీమవరం నుంచి నర్సాపూర్ కాలేజ్ వెళ్ళొచ్చే సమయంలో రైల్వేస్టేషన్‌లో ఓ కుక్క కనబడుతుంది. ‘టామీ’ అనే పేరుతో దాన్ని పెంచుకుంటాడు. మొదట్లో టామీని ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకోని అతడి భార్య (సీత).. ఆ తర్వాత సరేనంటుంది. ఈమధ్యలోనే టామీకి, సత్యంలకు మధ్య ఒక అద్భుతమైన బంధం ఏర్పడుతుంది. అతికొద్ది కాలంలోనే టామీ ఇంట్లో వ్యక్తిగా మారిపోతుంది. హ్యాపీగా నడుస్తున్న ఈ ఫ్యామిలీ ప్రపంచంలో అనుకోకుండా ఒక పెద్ద కుదుపు వస్తుంది? ఆ కుటుంబంలో ఆ కుదుపు తీసుకొచ్చిన కష్టాలేంటీ ? చివరికి ఏం జరిగింది ? అన్నది తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రానికి ప్రధాన ప్లస్‌ పాయింట్‌ గా చెప్పుకోవాల్సింది కథ గురించే. 1920, 30 ప్రాంతంలో హ్యాచికో అనే ఓ కుక్క తన యజమాని కోసం తొమ్మిది సంవత్సరాలు ఎదురు చూసి చనిపోయింది. ఇదే ఇతివృత్తాన్ని తీసుకొని ‘హ్యాచీ – ఏ డాగ్స్ టేల్’ పేరుతో 2009లో ఒక హాలీవుడ్‌ సినిమా రూపొందింది. ఆ సినిమాకి ప్రేరణే ఈ ‘టామీ’గా చెప్పుకోవచ్చు. ఇతివృత్తం బలమైనదే అయినా, మధ్యలో ఎలాంటి ట్విస్టులు ఉండకపోవడం, చాలా స్లోగా సాగిపోయే ఇలాంటి చిత్రాలకు నటీనటులే ప్రాణం పోయాలి. ఆ విషయంలో రాజేంద్ర ప్రసాద్ మంచి మార్కులే సాధించారు. తనకెలాంటి పాత్రనిచ్చినా అందులో ఒదిగిపోగలనని మరోసారి నిరూపించాడు. ఇక మిగతా నటీనటులూ తమ తమ పరిధిమేర బాగానే నటించారు. టామీగా చేసిన కుక్క అందరినీ ఆకట్టుకుంటుంది. టామీని సినిమాకి రాజేంద్రప్రసాద్‌తో పాటు మరో ప్రధాన బలంగా చెప్పుకోవాలి. ఒక ఆఫ్ బీట్ సినిమాని కూడా అందరినీ ఆకట్టుకునేలా తీయాలన్న ప్రయత్నంలో కొంతవరకు సఫలమయ్యారనే చెప్పుకోవాలి.

మైనస్ పాయింట్స్ :

కేవలం కదిలించే ఒక బలమైన కథతో సినిమాని నడపలేమన్నది మనం గుర్తించాలి. అందుకు తగ్గ కథనం, సన్నివేశాల్లో బలం ఉండాలి. ఈ సినిమాలో చాలా సన్నివేశాల్లో ఆ బలం లేదు. సినిమాలోని ప్రధాన ట్విస్ట్ తర్వాతే అసలైన కథ మొదలవుతుంది. సినిమాకిచ్చే జస్టిఫికేషన్ కూడా ఆ కొన్ని సన్నివేశాల్లోనే చెప్పగలగాలి. ఆ విషయంలో మాత్రం ఈ సినిమా ఫెయిలయింది. ఇక అక్కణ్ణుంచి జరిగేదంతా అతి సాధారణంగా చూపించడంతో సినిమా ఎక్కడైతే నిలబడాలో, అక్కడే కూలబడినట్లయింది. చాలా సన్నివేశాలను ‘హ్యాచీ’ సినిమాలోనివే పట్టుకొచ్చినా, అందులోని ఫీల్‌ని మాత్రం తెరపై ఆవిష్కరించలేకపోయారు. ఇంతమంచి సున్నితమైన ఎమోషనల్ సినిమాలో అనవసరంగా వచ్చే పాటలు, కొన్ని అనవసర సన్నివేశాలు సినిమా మూడ్‌ని చెడగొడతాయి. ఫస్టాఫ్ వరకూ ఎమోషనల్‌గా నడపగలిగారు కానీ, సెకండాఫ్‌లో మొదలయ్యే ఇంకా తీవ్రమైన ఎమోషన్‌ను చూపించడంలో చేతులెత్తేశారు.

సాంకేతిక విభాగం :

ఇలాంటి సినిమాను తెరకెక్కించాలన్న ఆలోచనను అభినందించాల్సిందే. దర్శకుడు రాజా వన్నెం రెడ్డి కథను తెలుగు నేటివిటీ మేరకు అడాప్ట్ చేసుకున్నా స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం ఫెయిలయ్యారు. సినిమాలోని అసలైన భావోద్వేగాన్ని తెరకెక్కించి ఉంటే ఒక మంచి చిత్రంగా మిగిలి ఉండేది. మ్యూజిక్ ఫర్వాలేదనిపించేలా ఉంది. ఈ సినిమాకు పల్లెటూరు నేపథ్యం ఎంచుకోవడం బాగుంది. దాన్ని తెరపై చాలా బాగా ఆవిష్కరించిన సినిమాటోగ్రాఫర్‌ కి క్రెడిట్ ఇవ్వాలి. కొన్ని చోట్ల దర్శకత్వ మెరుపులు చూడొచ్చు. ఎడిటింగ్ ఫర్వాలేదనిపించేలా ఉంది.

తీర్పు :

ఇక చివరగా.. ఒక చక్కటి కథ, సున్నితమైన భావోద్వేగాలు, కథకు న్యాయం చేసే పాత్రధారులు సినిమాకి అనుకూలించే అంశాలు. కాగా.. స్క్రీన్‌ప్లేలో తేలిపోవడం, అక్కడక్కడా అనవసర సన్నివేశాలు, సెకండాఫ్‌లో భావోద్వేగ గాఢత తగ్గడం ప్రతికూల అంశాలు. ఆఫ్‌బీట్ సినిమాని కూడా ఫ్యామిలీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెరకెక్కించడం మూలంగా ఎమోషనల్ సినిమాలు కోరుకునే వారికి బాగా నచ్చుతుంది. ‘టామీ’ మంచి కథే కానీ ఆడియన్స్ కి నచ్చేలా తీయలేకపోయారు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW


సంబంధిత సమాచారం :