సమీక్ష : వాసుకి – పర్వాలేదనిపించిన రివెంజ్ డ్రామా

Vasuki movie review

విడుదల తేదీ : జూలై 28, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ఏకే. సాజన్

నిర్మాత : ఎస్. ఆర్ మోహన్

సంగీతం : గోపి సుందర్

నటీనటులు : నయనతార, మమ్ముట్

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పుతియ నియమం’ తెలుగులో ‘వాసుకి’ పేరుతో డబ్ అయి ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాటో భర్త (మమ్ముట్టి), కూతురితో కలిసి సంతోషంగా జీవించే మహిళ వాసుకి (నయనతార) అందరితోను చాలా మంచిగా ఉంటుంది. అలాంటి ఆమెకు అనుకొకుండా ఒకరోజు పెద్ద కష్టమే ఎదురై ఆ బాధతో ప్రతిరోజూ కృశించి పోతుంటుంది. అలా మానసిక వ్యథలో ఉన్న ఆమెకు ఒక సహాయం దొరుకుతుంది.

ఆ సహాయం ద్వారా తన బాధకు కారణమైన వారి మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది వాసుకి. అసలు వాసుకికి ఎదురైన కష్టం ఏమిటి ? దాని కారకులెవరు ? వాళ్ళ మీద ఆమె ఎలా పగ తీర్చుకుంది ? ఆమెకు సహాయపడినవారెవరు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్స్ అంటే అది రెండవ అర్థ భాగమే. దర్శకుడు ఏకే. సాజన్ ఈ భాగాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇంటర్వెల్ తో మొదలైన సినిమా అసలు కథ సెకండాఫ్ నుండి రసవత్తరంగా మారుతుంది. ఆ కథనంలోని ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా, కొత్తగా ఉంటుంది. ఒక మహిళ తన పై ఎలాంటి పోలీస్ కేసులు రాకుండా తన బాధకు కారణమైన వాళ్ళను శిక్షించే తీరును, ఆమెకు సహాయం చేసే వ్యక్తి (ఇదే సినిమాలో కీలకమైం పాయింట్. అందుకే ఆ పాత్రను రివీల్ చేయడం లేదు) వేసే ప్లాన్స్ లాజిక్స్ కు దగ్గరగా, రీజనబుల్ గా, కొత్త తరహాలో ఉంటాయి.

ఇక సినిమాలో మమ్ముట్టి వంటి పెద్ద స్టార్ ను పెట్టుకుని అతని మేజ్ కు తగిన సన్నివేశాలు లేవే అనుకునే సమయంలో దర్శకుడు తన స్క్రీన్ ప్లే ప్రతిభతో మమ్ముట్టినే అసలు హీరోని చేయడం చాలా బాగుంది. దీని వలన సగటు ప్రేక్షకుడికి సినిమా పట్ల పూర్తి స్థాయి సంతృప్తి కలుగుతుంది. ఇక ప్రధాన పాత్ర దారి నయనతార నటన అద్భుతమని చెప్పాలి. కొందరి చేత బాధింపబడ్డ ఒక సాధారణ మహిళ బాధ ఎలా ఉంటుంది, ఆమె ప్రతీకారం తీర్చుకోదలుచుకుంటే అది ఎంత తీవ్రంగా ఉంటుంది అనే అంశాల్ని తన నటన ద్వారా తెరపై ఆవిష్కరించందామె. ఇక సినిమా ద్వారా దర్శకుడు ఆడవాళ్లు అన్యాయాం జరిగే ఎదురుతిరిగి పోరాడాలికానీ మౌనంగా ఉండకూడదు అని ప్రస్తుత సమాజానికి అవసరమైన గొప్ప మెసేజ్ ను కూడా అందించాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్ ఫస్టాఫ్ కథనమే. కథలో ప్రధాన పాత్రధారి కష్టం కలిగింది, దానికి ఆమె పగ తీర్చుకోవాలనుకుంటోంది అని చెప్పాడని సినిమాలో సగభాగాన్ని వాడుకోవడం మరీ ఓవర్ గా అనిపించింది. అది కూడా ఎలాంటి ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ లేకుండా తీయడంతో మరీ బోరింగా తయారైంది. దీని వలన సెకండాఫ్ గొప్పగా ఉన్నా పూర్తి సినిమా ఫలితం మీద బాగా దెబ్బ పడింది.

అంతేగాక ఫస్టాఫ్లో అనవసరమైన సన్నివేశాలు, సంభాషణలు చాలానే ఉండటం, అసలు కథేమిటో ఇంటర్వెల్ వరకు రివీల్ కాకాపోవడంతో సినిమా ఎటు పోతుందో క్లారిటీ లేక తీవ్ర నిరుత్సాహం ఏర్పడింది. ఇక సినిమాలో రొమాంటిక్ ట్రాక్, పాటలు, కామెడీ వంటివి లోపించడం కూడా కొంతమంది ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఏకే. సాజన్ సినిమా ఫస్టాఫ్ ను ఏమాత్రం ఆకట్టుకునే విధంగా తీయలేకపోయినా సెకండాఫ్లో మొదలయ్యే రివెంజ్ డ్రామాను మాత్రం పూర్తిగా కొత్త తరహాలో తీసి స్క్రీన్ ప్లే, టేకింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేశాడు.

ఇక రోబి వర్గేశే రాజ్ సినిమాటోగ్రఫీ సహజంగా ఉండి బాగుంది. కీలక సన్నివేశాల్లో గోపి సుందర్ అందించిన నైపథ్య సంగీతం ఆకట్టుకుంది. వివేక్ హర్షన్ తన ఎడిటింగ్ ద్వారా ఫస్టాఫ్లోని కొన్ని సన్నివేశాలని తొలగించాల్సింది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ ‘వాసుకి’ చిత్రంలో సెకండాఫ్ చాలా బాగుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ భాగంలో నయనతార పగ తీర్చుకునే విధానం కొత్తగా ఉంది. దర్శకుడు ఈ భాగాన్ని డీల్ చేసిన విధానం ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యే విధంగా ఉంది. ఈ పార్ట్ మాత్రమే సినిమాను నిలబెట్టేదిగా ఉంది. కానీ ఫస్టాఫ్ మాత్రం మరీ బోరింగా, నీరసంగా సాగుతూ ఇంటర్వెల్ ముందు వరకు ఉసూరుమనేలా చేసింది. మొత్తం మీద చెప్పాలంటే రివెంజ్ డ్రామాలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

 
Like us on Facebook