సమీక్ష : వీడికి దూకుడెక్కువ – అర్థం పర్థం లేని దూకుడిది..!

Veediki Dookudekkuva-review

విడుదల తేదీ : 4 డిసెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : సత్యనారాయణ ద్వారపూడి

నిర్మాత : బెల్లం రామకృష్ణారెడ్డి

సంగీతం : చక్రి

నటీనటులు : శ్రీకాంత్‌, కామ్న జఠ్మలాని, చంద్ర మోహన్, కృష్ణ భగవాన్..

శ్రీకాంత్, కామ్న జఠ్మలాని హీరో హీరోయిన్లుగా సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వీడికి దూకుడెక్కువ’. పుష్యమి ఫిలిం మేకర్స్‌ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొద్దికాలంగా ఎక్కువగా మేజర్ లీడ్‌గా కాకుండా ఇతర ప్రధాన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తూ వస్తోన్న శ్రీకాంత్ పూర్తి స్థాయి హీరోగా నటించిన ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

క్రాంతి (శ్రీకాంత్) ఓ దూకుడు మనస్థత్వం ఉన్న పోలీసాఫీసర్. అన్యాయాన్ని ఎదిరించడానికి ఎంతకైనా వెనుకాడని క్రాంతి, పలు కిరాతక ముఠాలను కూడా తనదైన స్టైల్లో అంతమొందిస్తూ ఉంటాడు. ఇక క్రాంతి అన్యాయాల పనిపడుతూండే ఈ క్రమంలోనే, అతడికి చాముండేశ్వరి (కామ్న జఠ్మలాని) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తన చిన్ననాటి మిత్రురాలు కూడా అయిన చాముండేశ్వరితో క్రాంతి పరిచయం ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ దాకా దారితీస్తుంది.

కాగా దేవాలయాలపై పరిశోధన చేసే పనిపై మలేషియా వెళ్ళిన చాముండేశ్వరిని అక్కడ కొందరు దుండగులు కిడ్నాప్ చేస్తారు. అమ్మాయిలను అమ్మకానికి పెట్టే అక్కడి ఓ ముఠా ఈ కిడ్నాప్‌కు పాల్పడుతుంది. క్రాంతి మలేషియా వెళ్ళి ఆ దుండగులను ఎలా కనిపెట్టాడు? వాళ్ళ అంతు ఎలా చూశాడు? చివరకు చాముండేశ్వరిని ఎలా కాపాడాడు? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమా పరంగా చూస్తే.. ఈ సినిమాలో కనిపించే అతికొద్ది ప్లస్ పాయింట్స్‌లో శ్రీకాంత్, చంద్రమోహన్, కృష్ణ భగవాన్‌ల కాంబినేషన్‌లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాల గురించి చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్‌లో ప్రీ ఇంటర్వెల్ వరకూ ఈ కామెడీ ఉన్నంతలో మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇకపోతే ప్రీ క్లైమాక్స్‌లో అమ్మాయిలను అమ్మకానికి పెట్టే నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా బాగున్నాయి అనొచ్చు. సినిమా కథకు ఏమాత్రం సంబంధం లేకున్నా ఎమ్మెస్ నారాయణ కామెడీ ట్రాక్ కాస్తోకూస్తో ఫర్వాలేదనిపించేలా ఉంది.

హీరోగా నటించిన శ్రీకాంత్ తనదైన స్టైల్లో డైలాగుల పరంగా, యాక్టింగ్‌ పరంగా ఆకట్టుకున్నాడు. ఒక కథంటూ సరిగ్గా లేని సినిమాను శ్రీకాంత్ వీలైనంత మేర తన శక్తిమేర నడిపించే ప్రయత్నం చేశాడు. ఇక కామ్నా జఠ్మలాని ఫర్వాలేదనిపించింది. కృష్ణ భగవాన్, చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ నవ్వించే ప్రయత్నం చేశారు. అజయ్ ఉన్నంతలో బాగా చేశాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టే ఉంది. ముందుగా ఇలాంటి ఒక అతి సాదాసీదా కథను, ఏమాత్రం ఆకట్టుకోలేని కథనంతో రెండున్నర గంటల సినిమాగా చెప్పాలనుకున్న దర్శక నిర్మాతల సాహసాన్ని ఏమనాలో అర్థం కాదు. సినిమాలో ప్లస్ పాయింట్స్‌లో చెప్పుకొచ్చిన పై విషయాలను పక్కనబెడితే వేరే ఏ ఇతర సన్నివేశానికీ ఓ క్లారిటీ లేదు. చాలా సన్నివేశాలు ఎందుకొస్తున్నాయో కూడా తెలియకుండా వచ్చిపోతుంటాయి. ఇక పాటల గురించి చెప్పనవసరం లేదు. సినిమా నిడివి పెంచి విసిగించడమే తప్ప పాటలుండి చేసిందేమీ లేదు.

ఇకపోతే సూపర్ హిట్ ‘దూకుడు’ సినిమాలోని హీరో మహేష్ స్టైల్‌ను శ్రీకాంత్‌కు అచ్చుగుద్దినట్లు దింపేశారు. చాలావరకు డైలాగ్స్ కూడా అదే ఫార్మాట్లో ఉన్నాయి. అయితే అవేవీ ఆకట్టుకునేలా లేకపోవడమే ఇక్కడ అసలైన పాయింట్. శ్రీకాంత్-కామ్న జఠ్మలానీల కెమిస్ట్రీ కూడా ఆకట్టుకునేలా లేదు. సెకండాఫ్‌లో సినిమా మలేషియా షిఫ్ట్ అయ్యాక, కథలో చెప్పాల్సిన విషయం లేక, అనవసరమైన సన్నివేశాలతో క్లైమాక్స్ వరకూ అర్థం పర్థం లేకుండా సినిమాను నడిపించడం విసుగు తెప్పిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూసుకుంటే.. దర్శక, రచయిత సత్యనారాయణ ద్వారపూడి సినిమాలో ఒక్కచోట కూడా ప్రతిభ చాటుకోలేకపోవడం నిరాశ పరుస్తుంది. ఎంచుకున్న కథ, దానికి అల్లిన కథనం, రాసుకున్న సన్నివేశాలు, వాటిని చిత్రీకరించిన విధానం ఇలా ఎక్కడా సత్యనారాయణ పనితనం గురించి చెప్పుకోలేం. అయితే ప్రీ క్లైమాక్స్‌లో మాత్రం కొంత ఎమోషన్‌ను సరిగ్గా పట్టుకున్నాడని చెప్పొచ్చు.

ఇక స్వర్గస్థుడైన చక్రి అందించిన పాటలు కొన్ని మాస్‌కి నచ్చేలా ఉన్నాయన్న ఫీల్ కలిగించేలా ఉన్నా, అవి వచ్చే సందర్భాలకు అర్థం లేకపోవడంతో అవి వృథా అయ్యాయనే చెప్పొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగోలేదు. ఎడిటింగ్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. సినిమా ఒక సన్నివేశం నుంచి ఇంకో సన్నివేశానికి ఎప్పుడు, ఎలా మారిందో అర్థం కానంత నాసిరకంగా ఎడిటింగ్ ఉంది. ఇక సాంకేతికంగా ఉన్నంతలో మార్కులు కొట్టేసేదంటే సినిమాటోగ్రాఫర్ సురేందర్ రెడ్డి అని చెప్పొచ్చు. ముఖ్యంగా మలేషియా నేపథ్యాన్ని బాగా క్యాప్చర్ చేశారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫర్వాలేదు.

తీర్పు :

శ్రీకాంత్ సినిమా వస్తోందంటే ఇప్పటికీ టీవీల్లో ఒక రకమైన క్రేజ్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ స్థాయిలో ఫ్యామిలీస్‌కి దగ్గరైన ఈ హీరో గత కొద్దిరోజులుగా పూర్తి స్థాయి హీరోగా సినిమాలు తగ్గించేశారు. కాగా ఆయన నటించిన ‘వీడికి దూకుడెక్కువ’ అన్న సినిమా మాత్రం శ్రీకాంత్‌ను పూర్తి స్థాయి హీరోగా చూపిస్తూ వచ్చిన తాజా సినిమా. ఒక అర్థం పర్థం లేని కథ, కథనాల ప్యాకేజీ, ఎందుకొస్తున్నాయో తెలీకుండా వెళ్ళిపోయే అనవసర సన్నివేశాలు, నీరసంగా నడిచే సెకండాఫ్, విసుగు తెప్పించే పాటలు… ఇలా ఇన్ని మైనస్ పాయింట్స్‌తో వచ్చిన ఈ సినిమా, శ్రీకాంత్ సినిమా అంటే కనిపించే కాస్తోకూస్తో క్రేజ్‌కు కూడా ఏమాత్రం అందకుండా ఎక్కడో ఆగిపోయింది. ఇక ఈ సినిమాను కాపాడేది, కాపాడగలిగేది ఏదైనా ఉందా? అంటే అది ఒక్క శ్రీకాంత్ యాక్టింగ్, టైమింగ్ ఉన్న డైలాగ్ డెలివరీ అని చెప్పుకోవచ్చు. అయితే ఒక్క శ్రీకాంత్ కోసమే రెండున్నర గంటల అతి సాదాసీదా అర్థం లేని సినిమాను చూడగలమా అంటే.. అది సమాధానం దొరికీ దొరకని ప్రశ్న!

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW