సమీక్ష : వెంకటాపురం – కొత్తగా ట్రై చేశారు

Venkatapuram movie review

విడుదల తేదీ : మే 12, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : వేణు మడికంటి

నిర్మాత : తుము ఫణి కుమార్, శ్రేయాస్ శ్రీనివాస్

సంగీతం : అచ్చు

నటీనటులు : రాహుల్, మహిమ మక్వాన్

‘హ్యాపీ డేస్’ చిత్రంతో టైసన్ గా తెలుగు తెరకు పరిచయమైన నటుడు రాహుల్ ఆ తర్వాత సోలో హీరోగా కొన్ని సినిమాలు చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఆయన చేసిన మరొక ప్రయత్నమే ఈ ‘వెంకటాపురం’. నూతన దర్శకుడు వేణు మడికంటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ:
వైజాగ్లోని భీమిలీ బీచ్ లో జరిగిన ఒక అమ్మాయి మర్డర్ కేసును అక్కడికి దగ్గర్లో ఉన్న వెంకటాపురం పోలీస్ స్టేషన్ పోలీసులు టేకప్ చేసి విచారిస్తుంటారు. వాళ్ళ విచారణలో ఆ అమ్మాయిని మర్డర్ చేసింది ఆనంద్ (రాహుల్) అని, ఆ అమ్మాయి పేరు చైత్ర (మహిమ మక్వాన్) అని, ఆమె ఆనంద్ లవరేనని పోలీసులు తేలుస్తారు.

అసలు ఆనంద్, చైత్రలు ఎవరు ? వాళ్ళ ప్రేమ కథేమిటి ? వాళ్ళకెదురైన సమస్యేలేమిటి ? నిజంగానే ఆనంద్ హత్య చేశాడా ? వాళ్ళ జీవితాల్లో జరిగిన అనుకోని సంఘటనలేమిటి ? వాటి వెనకున్న వాస్తవం ఏమిటి ? వ్యక్తులు ఎవరు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఎంచుకున్న జోనర్ థ్రిల్లర్ కనుక దర్శకుడు వేణు మడికంటి సినిమాను సీరియస్ వాతావరణంతో మొదలుపెట్టడం నచ్చింది. మొదటి సన్నివేశంతోనే ఇకపై నడవబోయే సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడాయన. ఆయన ఎంచుకున్న కథ కూడా రెగ్యులర్ ఫార్మాట్ కు దూరంగా కాస్తంత భిన్నంగానే ఉంది. కథ మొత్తం కొన్ని ముఖ్యమైన పాత్రల మీదే నడవడం, అనవసరమైన బలవంతపు కామెడీ లాంటి అంశాలేవీ లేకపోవడంతో ఎలాంటి చిరాకు లేకుండా సినిమా చూసే వీలు కలిగింది.

అలాగే ఫస్టాఫ్ ను సీరియస్ పాయింట్ తో స్టార్ట్ చేసిన దర్శకుడు దాని కొనసాగింపును సెకండాఫ్లో ఇంకాస్త థ్రిల్లింగా చెప్పడంతో సెకండాఫ్ ఉత్కంఠగానే సాగింది. ఇక సంగీత దర్శకుడు అచ్చు అందించిన సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్. సందర్భానుసారంగా వచ్చే పాటలకు ఆయన కంపోజ్ చేసిన భిన్నమైన మ్యూజిక్, కీలకమైన సన్నివేశాలకు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కుదిరి సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి.

వైజాగ్లోని అందమైన లొకేషన్లలో సన్నివేశాలను చాలా రియలిస్టిక్ గా కెమెరాలో బంధించారు సినిమాటోగ్రఫర్ సాయి ప్రకాష్. సినిమాకు కీలకమైన సెకండాఫ్లో కథ చివరి దశకు చేరుకున్నాక దర్శకుడు రివీల్ చేసిన కథలోని అసలైన వాస్తవం థ్రిల్లింగా అనిపించింది. పెర్ఫార్మెన్స్ పరంగా హీరో రాహుల్ ను ఈ సినిమాలో కొత్తగా చూడొచ్చు. అయన బాడీ లాంగ్వేజ్, హావా భావాలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

రచయిత కమ్ దర్శకుడు వేణు మడికంటి సినిమా కథనంలో చాలా చోట్ల తప్పులు చేశారు. అవన్నీ సామాన్య ప్రేక్షకులకు సులభంగా దొరికిపోయి అనుమానాలుగా మిగిలిపోయేవే. ఫస్టాఫ్లో సినిమాకు అత్యంత కీలకమైన హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ఉండాల్సినంత బలంగా లేదు. హీరో హీరోయిన్ల పరిచయం, వాళ్ళ స్నేహం బాగానే ఉన్నా వాళ్ళు ప్రేమలో పడటం అనే అంశమే తేలిపోయింది. అలాగే ఫస్టాఫ్లో హీరోయిన్ స్నేహితుల మీద నడిచే కొన్ని అనవసరమైన సన్నిశాలు బోర్ అనిపించాయి.

దర్శకుడు వేణు రాసుకున్న స్క్రీన్ ఫ్లే థ్రిల్లింగానే అనిపించినా కథలోని అసలు నిజాన్ని ఆయన చాలా చోట్ల కావాలనే బలవంతంగా దాచిపెట్టినట్లు అనిపించింది. రివీల్ చేసే అవకాశం ఉన్నా కూడా చేయకుండా ఆ సన్నివేశాల్ని ఉన్నటుండి ముగించేయడం వంటివి చాలానే చేశాడు.

పైగా నేరుగా చెప్పాల్సిన కథను థ్రిల్లింగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాస్త గజిబిజిగా చెప్పడంతో కొన్ని కనెక్షన్లను పట్టుకోవడం కష్టమైంది. దీంతో థియటర్లో సినిమాపై ఉండాల్సిన శ్రద్ద కాస్త సన్నగిల్లింది. అలాగే కొన్ని అంశాలకు వివరణే ఇవ్వలేదు. సన్నివేశాల చిత్రీకరణలో కూడా లోపాలు కనబడ్డాయి. హీరో పాత్రకు చెప్పిన డబ్బింగ్ కొన్ని చోట్ల సింక్ అవ్వలేదు. కీలకమైన పాత్రలకు బలమైన మాటలు లేకపోవడం ఆ పాత్రలు ప్రేక్షకుడిపై చూపే ప్రభావాన్ని తగ్గించింది.

సాంకేతిక విభాగం:

వేణు మడికంటి దర్శకుదడిగా పూర్తి స్థాయిలో విజయం అందుకోలేకపోయాడు. కథనంలో కొన్ని చోట్ల లూప్ హోల్స్ ను అలాగే వదిలేయడం, బలవంతంగా ట్విస్టును దాచడం వంటివి చేసి నిరుత్సాహపరిచారు. అచ్చు అందించిన సంగీతం సినిమాకు చాలా హెల్ప్ అయింది. సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాగుంది. నందు ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండి ఉంటే కథనంలో క్లారిటీ ఇంకా బెటర్ గా ఉండేది. తుము ఫణి కుమార్, శ్రేయాస్ శ్రీనివాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

చాన్నాళ్లుగా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరో రాహుల్ కు కొత్తగా ట్రై చేసిన ఈ ‘వెంకటాపురం’ సినిమాతో అది దొరుకుతుందని చెప్పొచ్చు. భిన్నమైన కథ, అందులోని థ్రిల్లింగ్ ఎలిమెంట్, సెకండాఫ్ కథనం, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా బలహీనంగా ఉన్న ఫస్టాఫ్, పూరించకుండా వదిలేసిన లూప్ హోల్స్, కీలకమైన వాస్తవాన్ని బలవంతంగా దాచిపెట్టడం వంటి అంశాలు బలహీనతలుగా ఉన్నాయి మొత్తం మీద చెప్పాలంటే రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా థ్రిల్లర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బెటర్ చాయిస్ అనొచ్చు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :