సమీక్ష : విజేత – తండ్రిని గెలిపించిన తనయుడు

Vijetha movie review

విడుదల తేదీ : జులై 12, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, మురళీ శర్మ

దర్శకత్వం : రాకేష్ శశి

నిర్మాత : రజిని కొర్రపాటి

సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్

సినిమాటోగ్రఫర్ : కె.కె.సెంథిల్

ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్

స్క్రీన్ ప్లే : రాకేష్ శశి

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విజేత’. కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ:

శ్రీనివాస‌రావు (ముర‌ళీశ‌ర్మ) మంచి ఫోటోగ్రాఫ‌ర్‌. ఫ్యామిలీ కోసం తన కెరీర్ ని వదిలేసుకుంటాడు. కనీసం తన కొడుకు(కళ్యాణ్ దేవ్) అయిన జీవితంలో నచ్చింది చేయాలనీ కోరుకుంటాడు. కానీ రామ్ (కళ్యాణ్ దేవ్) మాత్రం కెరీర్ ను సీరియస్ గా తీసుకోడు. ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా తిరుగుతుంటాడు. ఆ క్రమంలో ఎదురింట్లో చైత్ర (మాళ‌వికా నాయ‌ర్‌)ను ప్రేమిస్తూ ఆమెను ఇంప్రెస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. కాగా కొన్ని సంఘటనలు ద్వారా రామ్ కొడుకుగా తన బాధ్యత తెలుసుకొని, తండ్రి బాధను అర్ధం చేసుకుంటాడు.

అదే సమయంలో రామ్‌ కి తన తండ్రి గురించి ఓ నిజం తెలుస్తోంది. దాంతో పూర్తిగా మారిపోయిన రామ్ కుటుంబానికి తోడుగా నిల‌బడాలని నిర్ణయించుకుంటాడు. రామ్ కుటుంబం కోసం ఏం చేశాడు ? వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ? కొడుకుగా రామ్, తండ్రి క‌ల‌ను ఎలా తీర్చాడు ? రామ్ చైత్ర చివరికి ఒకటవుతారా ? లాంటి విషయాలు తెలియాలంటే విజేత చిత్రం చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు రాకేష్ శశి రాసుకున్న సున్నితమైన ఒక మధ్య తరగతి కుటుంబ కథ ఇది. కథే ఈ సినిమాకు ప్రధాన బలం. బలమైన పాత్రలతో, సన్నివేశాలతో, భావోద్వేగాలతో నిండిన ఈ కథ ప్రేక్షకుడ్ని సినిమాతో పాటే ప్రయాణించేలా చేసింది.
సెకెండాఫ్ లో అక్కడక్కడ కథకు అక్కరలేని కామెడీ సన్నివేశాలను ఇరికించనప్పటికీ దర్శకుడు కొన్ని మంచి ఎమోషనల్ సీన్స్ తో సినిమాని నిలబెట్టాడు.

హీరో తండ్రి పాత్ర ఈ సినిమాకే హైలెట్ అని చెపొచ్చు. అలాంటి తండ్రి పాత్రలో నటించిన మురళి శర్మ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇక మొదటి సారి హీరోగా నటించిన కళ్యాణ్ దేవ్ లుక్స్ పరంగా చాలా బాగున్నాడు. తండ్రి బాధను అర్ధం చేసుకున్నే సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. అలాగే హీరోయిన్ని లవ్ లో పడేసే సన్నివేశాల్లో ఓ సగటు కుర్రాడిలా చక్కగా నటించారు. హీరోకి, హీరోయిన్ కు మధ్య నడిచే కొన్ని కామెడీ సీన్స్ నవ్విస్తాయి. హీరోయిన్నీ ఇంప్రెస్ చెయ్యటానికి ఆమె మదర్ కి క్లోజ్ విధానం బాగుంది.

కమెడియన్స్ సత్యం రాజేష్, మహేష్ విట్టా తమ కామెడీ టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వులు పూయించారు. మొత్తం మీద ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ కోసం కెరీర్ ను త్యాగం చేసే తండ్రి పాత్రలో, చాలామంది తండ్రులు మమేకం అవుతారు. తండ్రికి ఏదైనా చెయ్యాలని కలలు కనే కొడుకు పాత్ర కూడా, చాలామంది కొడుకులను ఆలోచనలో పడేస్తుంది. ఫైనల్ గా సినిమాలో పేరెంట్స్ ఇంపార్టెన్స్ గురించి ఇంటర్నల్ గా ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

కథ, పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు రాకేష్ శశి, కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా కనిపించారు. ఫస్టాఫ్ ను అన్ని విధాలా బాగానే నడిపిన ఆయన సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలను సాగదీశారు. కథకు అవసరం లేని కొన్న కామెడీ సీన్స్ పెట్టి, ఎమోషనల్ ప్లో ను పక్కదారి పటించారు.

సెకెండాఫ్ లో ఇంకా బరువైన భావోద్వేగాల్ని పలికించే సందర్భాల్ని ఏర్పాటు చేయగల స్కోప్ ఉన్నా, రాకేష్ శశి మాత్రం సింపుల్ గా హీరోకి పెద్ద సంఘర్షణ స్ట్రగుల్స్ ఏమీ లేకుండా సాదాసీదాగా కథనాన్ని నడిపారు. రాకేష్ కథనం మీద ఇంకొంచెం కేర్ తీసుకోని ఉంటే బాగుండేది. అలాగే మొదటి భాగంలో లవ్ ట్రాక్ ను బాగా రాసుకున్న ఆయన, రెండువ భాగంలో మాత్రం ఆ లవ్ ట్రాక్ ను వదిలేసారు. వదలకుండా హీరోహీరోయిన్ల మధ్య ఆ ప్రేమ సన్నివేశాలను ఇంకాస్త బరువుగా రాసుకుని ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

రాకేష్ శశి దర్శకుడిగా సినిమాకు దాదాపుగా పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, మంచి ఎమోషనల్ పాత్రలతో చిత్రాన్ని తీర్చిదిద్దారు, కె.కె.సెంథిల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సన్నివేశాలన్నీ అందంగా కనబడ్డాయి.

హర్షవర్ధన్ సంగీతం బాగుంది. ముఖ్యంగా కొక్కొరొకో సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్ కూడా మంచి ఫీల్ క్రియేట్ చేస్తుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది గానీ సెకెండాఫ్ లో ఆయన కత్తెరకు ఇంకొంచెం పని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. వారాహి ప్రొడక్షన్స్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయ్.

తీర్పు :

ఈ చిత్రంలో ఓ సగటు కుర్రాడి పాత్రలో కనిపించిన హీరో కళ్యాణ్ దేవ్ తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. తండ్రి పాత్రలో నటించిన మురళి శర్మ కూడా తన అద్భుతమైన నటనతో సినిమాని నిలబెట్టారు. హీరోయిన్ మాళవిక నాయర్ కూడా అందంగా కనిపిస్తూ, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసింది. ముందు చెప్పుకున్నట్లు ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :