ఇంటర్వ్యూ : దేవి శ్రీ ప్రసాద్ – పెళ్లి ఎప్పుడు అంటే…

ఇంటర్వ్యూ : దేవి శ్రీ ప్రసాద్ – పెళ్లి ఎప్పుడు అంటే…

Published on Aug 27, 2014 10:59 PM IST

DSP1

సంగీతమే శ్వాసగా బ్రతికే వ్యక్తి దేవి శ్రీ ప్రసాద్. అతని మ్యూజిక్ లో ఒక ఎనర్జీ ఉంటుంది, ఫుల్ జోష్ ఉంటుంది. తన సంగీతంతో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులను అలరిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ కు మ్యూజిక్ షోస్ అంటే చాలా ఇష్టం. అభిమానుల ముందు లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అంటే ఇంకా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇటివలే యు.ఎస్.ఏ – కెనడా మ్యూజికల్ టూర్ కంప్లీట్ చేసి ఇండియాకి తిరిగొచ్చారు. ఈ మ్యూజికల్ టూర్ తనకు కొత్త అనుభూతిని, ఎంతో ఉత్తేజాన్ని కలిగించిందని చెప్పారు. ఈ టూర్ విశేషాలను తెలియజేయడానికి పాత్రికేయులతో సమావేశం అయ్యారు దేవి శ్రీ ప్రసాద్. ఆ విశేషాలు మీ కోసం..

రెండు నెలల ముందు నుండి ప్లాన్ చేశాం…

మైకేల్ జాక్సన్, ఇళయరాజా అంటే చాలా ఇష్టం. వారిలా లైవ్ పెర్ఫార్మన్స్, మ్యూజికల్ టూర్స్ చేయాలని ఉండేది. గతంలో అమెరికాలో మ్యూజిక్ షోలు చేశాను. ఈసారి యు.ఎస్.ఏ – కెనడా టూర్ స్పెషాలిటీ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించాం. మా కాస్ట్యూమ్స్, ఆడిటోరియం స్టేజి డిజైన్, 3డి టెక్నాలజీ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ వీడియోస్, సౌండ్ సిస్టం ఎలా ఉండాలి అనే విషయంలో టూర్ ప్రారంభానికి రెండు నెలల ముందు నుండి ప్లాన్ చేశాం. డాన్సర్స్ కూడా అమెరికా వాళ్లనే తీసుకున్నాం. ప్రతి ఒక్క డాన్సర్లో ఒక్కో స్పెషాలిటీ ఉంది. గ్రాండ్ లెవెల్లో చేయాలని ఫిక్స్ అయ్యాను. మేము అనుకున్న విధంగా టూర్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.

సక్సెస్ లోవారిది కీలక పాత్ర…

టూర్ సక్సెస్ కావడంలో సింగర్స్, మ్యుజిషియన్ల క్రెడిట్ చాలా ఉంది. టూర్ కు వెళ్ళే ముందు సింగర్స్ ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. సాగర్, నేహ బాసిన్, రనైనా రెడ్డి, మాలతీ ఇలా లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడంలో ది బెస్ట్ సింగర్స్ ను తీసుకువెళ్ళాను. నోరా జెర్మైన్ అనే అమెరికన్ జాజ్ ప్లేయర్ వయోలిన్ సాంగ్(ఇద్దరమ్మాయిలతో మూవీ) పెర్ఫార్మన్స్ కు మంచి పేరొచ్చింది. తను చాలా బిజీ మ్యుజిషియన్, ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మాతో మిగతా టూర్ అంతా కంటిన్యూ అయ్యింది.

అమెరికన్ల ప్రసంశలు మరువలేను…

నెల రోజుల్లో మొత్తం యు.ఎస్.ఏ – కెనడాలలో 7 షోలు చేశాం. మేము షో చేసిన ప్రతి చోటా ప్రేక్షకుల నుండి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ ఆడిటోరియంలలో మరే ఇతర మ్యూజికల్ షోలకు మీ పెర్ఫార్మన్స్ కు వచ్చినంత పేరు రాలేదు. ‘నథింగ్ క్లోజ్ టు యువర్ పెర్ఫార్మన్స్’ అని షో పూర్తయిన తర్వాత అమెరికన్లు కాంప్లిమెంట్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. జూలై 26న ఇల్లినాయిస్ లో ‘దేవి శ్రీ ప్రసాద్ డే’ అని ప్రకటించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇల్లినాయిస్ స్టేట్ గవర్నర్, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు.

ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు…

వేస్ట్ బాస్కేట్స్, పాత డబ్బాలు, ట్రాలీలు, బకెట్లతో మ్యూజిక్ చేశాం. కొత్త రిథమ్స్ క్రియేట్ చేశాం. వాటికి అద్బుతమైన స్పందన వచ్చింది. నేను అనుకున్నదాని కంటే ప్రేక్షకులు 100 రెట్లు వాటిని ఎంజాయ్ చేశారు. మేం కష్టపడినదాని కంటే ఎక్కువ ప్రతిఫలం మాకు లాభించింది. ఈ మ్యూజికల్ టూర్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన అమెరికాలో సంగీత ప్రియులు అందరికి మనస్పూర్తిగా చాలా చాలా థాంక్స్. ఇటువంటి షోలు చేసినప్పుడు నాలో ఎనర్జీ డబల్ అవుతుంది. ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఇటువంటి షోస్ వలన కలుగుతుంది.

నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు….

ఎప్పటి నుండో యు.ఎస్.ఏలో మ్యూజికల్ టూర్ చేయాలనుకుంటున్నాను. సరైన నిర్వాహకుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తిరుమల రామకృష్ణా రెడ్డి గారు కలిశారు. చక్కని ప్లానింగ్ తో టూర్ ను ఆర్గనైజ్ చేశారు. ఆయన లేకుంటే టూర్ ఇంత సక్సెస్ అయ్యేది కాదు. స్పెషల్ థాంక్స్ టు రామకృష్ణా రెడ్డి గారు మరియు ఆర్గనైజర్ రామ్ గజ్జల గారు. యు.ఎస్.ఏ టూర్ ఇంత సక్సెస్ కావడానికి నాకు అవకాశం ఇచ్చిన దర్శకులు, నిర్మాతలు, హీరోలు కారణం. వారందరికీ కృతజ్ఞతలు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలు, ఇతర దర్శకులు వీడియో ద్వారా నాకు విషెస్ తెలిపారు. వారందరికీ స్పెషల్ థాంక్స్.

‘జల్సా – యంజె’ – మైకేల్ జాక్సన్ కు అంకితం…

ఈ ఏడాది నా పుట్టిన రోజు నాడు అమెరికాలో ఉన్నాను. మ్యూజికల్ టూర్ లో భాగంగా న్యూ జెర్సీలో షో చేస్తున్నాను. ఆ రోజు మైకేల్ జాక్సన్ పై ‘జల్సా – యంజె’ అనే వీడియో సాంగ్ చేశాను. ఈ పాటను ఆగస్ట్ 29 మైకేల్ జాక్సన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తున్నాం.

ప్రతిభను పరిచయం చేస్తా…

ఎంతో ప్రతిభ ఉండి వెలుగులోకి రాలేకపోతున్న సింగర్స్, మ్యుజిషియన్లు మన ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వారి ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేయాలని ఉంది. ప్రేక్షకులకు వారిని పరిచయం చేస్తాను. త్వరలో నా అఫీషియల్ యుట్యూబ్ ఛానల్ www.youtube.com/ThisIsDSPMusic లో వారి వీడియోలు అప్లోడ్ చేస్తాను.

సల్మాన్ ఖాన్ ఆఫర్ – త్వరలో బాలీవుడ్ ట్రైన్…

సౌత్ సినిమా ఇండస్ట్రీని దున్నేస్తున్న ఈ యుంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కు బాలీవుడ్లో అవకాశాలు వస్తున్నాయి. అక్కడ సినిమాలో ఒక్కొక్క పాట ఒక్కొక్కరు కంపోజ్ చేస్తున్నారు. అలా చేయడం ఇష్టం లేదు. సినిమాలో అన్ని పాటలు నేనే చేస్తా. ఇక్కడ సినిమాలతో బిజీగా ఉండడం వలన చేయలేకపోతున్నని తెలిపారు. సల్మాన్ ఖాన్ ‘కిక్’కు అవకాశం వచ్చింది. ఈ టూర్ వలన చేయలేకపోయా. వచ్చే ఏడాది హిందీ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నా.

పెళ్లి ఎప్పుడు అంటే…

పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు.. కుదిరితే ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తాను అంటూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ అసలు సమాధాం చెప్పకుండా మీడియా సమావేశం ముగించారు దేవి శ్రీ ప్రసాద్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు