ఇంటర్వ్యూ : పూజ హెడ్గే – మహాభారతంలో కృష్ణుడిలా ‘ముకుంద’లో వరుణ్ తేజ్

ఇంటర్వ్యూ : పూజ హెడ్గే – మహాభారతంలో కృష్ణుడిలా ‘ముకుంద’లో వరుణ్ తేజ్

Published on Dec 16, 2014 4:48 PM IST

Pooja-Hegde

‘గోపికమ్మా.. చాలును లెమ్మా నీ నిదర..’ అంటూ యువ ప్రేక్షకులకు నిదుర లేకుండా చేసింది పూజ హెడ్గే. తన అందంతో, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. వరుణ్ తేజ్ కు జంటగా ‘ముకుంద’ సినిమాతో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు గోపికలా వస్తుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా విశేషాలను తేలియజేయడానికి మీడియాతో సమావేశం అయ్యారు. ఆమె చెప్పిన విశేషాలు మీకోసం..

ప్రశ్న) ‘ముకుంద’ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?

స) పదహారణాల సంప్రదాయబద్దమైన అచ్చ తెలుగమ్మాయిగా ‘ముకుంద’లో నటించాను. సినిమా అంతా నా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. రావు రమేష్ నా తండ్రిగా నటించారు. ప్రతి తండ్రి తన కూతురు ఎలా ఉండాలని కోరుకుంటారో.. నా క్యారెక్టర్ అలా ఉంటుంది. తొలి సినిమా ‘ఒక లైలా కోసం’లో కాస్త మోడరన్ లుక్ లో కనిపించాను. ‘ముకుంద’లో కంప్లీట్ డిఫరెంట్ రోల్ లో కనిపిస్తాను. రెండవ సినిమాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.

ప్రశ్న) వరుణ్ తేజ్ క్యారెక్టర్ గురించి చెప్పండి..?

స) మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎటువంటి ముఖ్య పాత్ర పోషించారో.. ‘ముకుంద’లో వరుణ్ తేజ్ అటువంటి పాత్రలో కనిపిస్తారు. రెండిటి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఇదొక పొలిటికల్ బేస్డ్ స్టొరీ అంతే. మా ఇద్దరి మధ్య మంచి ప్రేమకథ కూడా ఉంటుంది.

ప్రశ్న) వరుణ్ తేజ్ కు ఇదే తొలి సినిమా. ఎలా నటించాడు..?

స) కళ్ళతోనే వరుణ్ నటిస్తాడు. ప్రతి భావాన్ని కళ్ళలో పలికిస్తాడు. వెరీ టాలెంటెడ్. మెగా ఫ్యామిలీలో నెక్స్ట్ స్టార్ హీరోగా అవతరిస్తాడు. అతనితో వర్క్ చేయడం అంటే చాలా సరదాగా సమయం గడచిపోతుంది. ఒకే వయసుకు చెందిన వాళ్ళం కావడంతో త్వరగా స్నేహితులైపోయాం. ముఖ్యంగా అతని హైట్ పై నేను జోకులు వేసేదాన్ని. వెరీ స్వీట్ పర్సన్.

ప్రశ్న) శ్రీకాంత్ అడ్డాలతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?

స) ఒక సన్నివేశం వివరించిన తర్వాత ఎలా నటించాలో మనకు చెప్పరు. మనం ఎలా నటించాలనుకుంటున్నామో.. అలా చేయమని చెప్తారు. నటులకు స్వేచ్ఛను ఇస్తారు. నా కాస్ట్యూమ్స్ దగ్గర నుండి ప్రతి అంశంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. సంగీతంపై మంచి అవగాహన ఉంది. నేను ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చూశాను. తన సినిమాలలో అమ్మాయిలను(హీరోయిన్) అందంగా చూపిస్తారు. అంతే అందంగా వారి పాత్రలను తీర్చిదిద్దుతారు. ఈ సినిమాలో కూడా నా పాత్ర అలాగే ఉంటుంది. ముఖ్యంగా కథను చాలా చక్కగా నేరేట్ చేస్తారు.

ప్రశ్న) హృతిక్ రోషన్ ‘మొహింజదారో’ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది..?

స) జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అశుతోష్ గోవారికర్ వంటి గొప్ప దర్శకుడితో పని చేయడం నా అదృష్టం. అతను దర్శకత్వం వహించిన ‘లగాన్’, ‘స్వదేశ్’ సినిమాలను నేను థియేటర్లో చూశాను. అతని సినిమాలో అవకాశం రావడం కలలా ఉంది. నేను లక్కీ గర్ల్.

ప్రశ్న) అసలు, మీకు ‘మొహింజదారో’ సినిమా అవకాశం ఎలా వచ్చింది..?

స) రణబీర్ కపూర్ సరసన నేను నటించిన టివిఎస్ కమర్షియల్ యాడ్ ను అశుతోష్ గోవారికర్ భార్య సునీత చూశారు. ఆమెకు నేను నచ్చడం, ‘మొహింజదారో’ హీరోయిన్ పాత్రకు నేను పర్ఫెక్ట్ ఛాయస్ అని భావించడంతో నాకు ఓ గొప్ప చారిత్రాత్మక సినిమాలో నటించే అవకాశం లభించింది.

ప్రశ్న) ‘మొహింజదారో’లో మీ పాత్ర కోసం ఏమైనా రీసెర్చ్ చేశారా..?

స) నేను ఏం చేయడం లేదు. అశుతోష్ గోవారికర్ ఎంతో రీసెర్చ్ చేశారు. నా పాత్రకు సంబదించిన సమాచారం ఆయనే ఇచ్చారు. ఇప్పటికే కొన్ని వర్క్ షాప్స్ లో పోల్గోన్నాను. నేను ఆయన్ను ఫాలో అయిపోతున్నాను. చారిత్రాత్మక సినిమాలో నటించడం గొప్ప అనుభూతి. ఆ కాలానికి తగ్గట్టు నా కాస్ట్యూమ్స్ అన్నిటిని ఆస్కార్ నామినేటెడ్ కాస్ట్యూమ్ డిజైనర్ తో రూపొందిస్తున్నారు.

ప్రశ్న) పక్కింటి అమ్మాయి తరహా క్యారెక్టర్ లలో నటించారు. గ్లామరస్ రోల్స్ వస్తే చేయడానికి రెడీనా..?

స) గ్లామరస్ హీరోయిన్ గా కనిపించడానికి నేను రెడీ. గ్లామరస్ రోల్స్ చేయడాన్ని ఇష్టపడతాను కూడా. నా దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్ లలో నాకు నచ్చిన కథలను ఎంపిక చేసుకుంటూ వచ్చాను. ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ సినిమాలలో పక్కింటి అమ్మాయిగా నటించాను. భవిష్యత్ లో గ్లామరస్ రోల్స్ వస్తే తప్పకుండా నటిస్తాను.

ప్రశ్న) ‘ఒక లైలా కోసం’ సినిమా ఫలితంపై మీ స్పందన..?

స) సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నా పెర్ఫార్మన్స్ ను మెచ్చుకున్నారు. నాకు పరిశ్రమలో ఓ గుర్తింపు లభించింది. సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. ‘ఒక లైలా కోసం’ సినిమా ఫలితం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను.

ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి..?

స) ప్రస్తుతానికి నా దృష్టి అంతా ‘మొహింజదారో’ పైనే. వచ్చే ఐదు నెలలు జనవరి నుండి మే వరకూ ఆ సినిమాకు డేట్స్ కేటాయించాను. ‘మొహింజదారో’ షూటింగ్ పూర్తయిన తర్వాత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు