ఇంటర్వ్యూ : రాజశేఖర్ – ‘గడ్డం గ్యాంగ్’లో కొత్త రాజశేఖర్‌ను చూస్తారు..!

ఇంటర్వ్యూ : రాజశేఖర్ – ‘గడ్డం గ్యాంగ్’లో కొత్త రాజశేఖర్‌ను చూస్తారు..!

Published on Jan 24, 2015 6:53 PM IST

rajashekar
ఇతర హీరోల సినిమాలలో ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేయడానికి, విలన్ పాత్రలలో నటించడానికి నేను రెడీ. నాకు రెండు మూడు ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే, ఓ సక్సెస్ వచ్చిన తర్వాత వాటికి ఓకే చేద్దామని ఎదురుచూస్తున్నాను. సక్సెస్ లేక రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు అనిపించుకోవడం ఇష్టం లేదు. అని అన్నారు ప్రముఖ హీరో రాజశేఖర్. శివాని-శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితా రాజశేఖర్ నిర్మాణంలో రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘గడ్డం గ్యాంగ్’. సంతోష్ పీటర్ జయకుమార్ దర్శకుడు. ఫిబ్రవరి 4న రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ విషయాలు మీకోసం..

ప్రశ్న) ‘గడ్డం గ్యాంగ్’ ఎం చేస్తూ ఉంటారు..?

స) చాలా చెత్త గ్యాంగ్ అండి. కొత్త పద్దతిలో కిడ్నాపింగ్ చేస్తూ ఉంటారు. సినిమాలో నా పేరు ‘గడ్డం దాస్’. నాతో పాటు ఇంకో నలుగురు ఉంటారు. అందరూ గడ్డంతో ఉంటారు. రెండు విధాలుగా బాగుంటుందని ‘గడ్డం గ్యాంగ్’ అనే టైటిల్ పెట్టాం.

ప్రశ్న)’సూదు కవ్వమ్’ రీమేక్ రైట్స్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నించారట..?

స) గత ఐదేళ్ళ నుండి సక్సెస్ లేదు. ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలలో కొన్ని రొటీన్ కావడం, మరికొన్ని సినిమాలలో పొరపాట్లు జరిగాయి. ప్రస్తుతం యువతరం అంతా కొత్తదనం కోరుకుంటున్నారు. ‘సూదు కవ్వమ్’ చూడగానే చాలా కొత్తగా అనిపించింది. ఎలాగైనా రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాను. దాదాపు కోటి రూపాయలు పెట్టి రీమేక్ రైట్స్ కోసం కొన్నాం. రైట్స్ నా చేతికి రావడం అదృష్టంగా బావిస్తున్నాను. ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ కొడతా.

ప్రశ్న)తెలుగు నేటివిటీకి అనుగుణంగా ‘సూదు కవ్వమ్’లో మార్పులు చేర్పులు ఏమైనా చేశారా..?

స) లేదు. ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు. ఒరిజినల్ లో ఫ్లేవర్ చెడగొట్టడం ఇష్టం లేదు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా చాలా కొత్తగా ఉంటుంది. అక్కడక్కడా కొన్ని పంచ్ డైలాగ్స్ జత చేశాం.

ప్రశ్న) దర్శకుడు సంతోష్ పీటర్ జయకుమార్ మీరు అనుకున్న విధంగా సినిమాను తెరకెక్కించారా..?

స) ‘శేషు’, ‘ఎవడైతే నాకేంటి’ సినిమాలతో జీవిత మంచి దర్శకురాలిగా నిరూపించుకుంది. మొదట జీవితను ఈ సినిమాకు దర్శకత్వం వహించమని కోరాను. నిర్మాణ భాద్యతలు, దర్శకత్వం చూసుకోవడం నా వల్ల కాదని చెప్పింది. అప్పుడు సంతోష్ ను తీసుకున్నాం. జీవిత దర్శకత్వం చేస్తే ఎలా ఉంటుందో..? సంతోష్ దర్శకత్వం అలా ఉంది. నటీనటుల నుండి సన్నివేశానికి అవసరమైన ఫీల్ రాబట్టుకున్నాడు. ఒరిజినల్ తో సమానంగా, ఇంకా చెప్పాలంటే అద్బుతంగా ‘గడ్డం గ్యాంగ్’ను తెరకెక్కించాడు.

ప్రశ్న) ఈ సినిమాకు మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా..? ట్రైలర్లో మీ వాయిస్ వినిపించింది..?

స) ట్రైలర్ డబ్బింగ్ జరిగే సమయంలో సాయి కుమార్ అందుబాటులో లేకపోవడంతో నేనే చెప్పాల్సి వచ్చింది. సినిమాలో మాత్రం నా పాత్రకు సాయి కుమార్ గారే డబ్బింగ్ చెప్పారు. సినిమా అంతా కొత్తగా ఉంటుంది. నా పాత్రకు గంభీరమైన వాయిస్ అవసరం లేదు. మీరే డబ్బింగ్ చెప్పమని పిల్లలు, జీవిత అడిగారు. రిస్క్ చేయడం ఇష్టం లేదు. అందుకే ట్రై చేయలేదు.

ప్రశ్న) హీరోయిన్ షీనా ఎలా నటించింది. ‘పంజా’ ఫేం అంజనా లవానియా స్థానంలో ఆమెను తీసుకోవడానికి కారణం ఏంటి..?

స) కథాపరంగా హీరోయిన్ ఎక్కువ సేపు నా ఒళ్లో కూర్చోవాలి. అంజనా లవానియా బాగా హైట్ కావడంతో సెట్ అవ్వలేదు. అందువల్ల, ఆమెను స్థానంలో షీనాను తీసుకోవడం జరిగింది. క్యూట్, బబ్లీ గర్ల్ క్యారెక్టర్లో షీనా పర్ఫెక్ట్ గా సూటయ్యింది. షీనా కూడా అద్బుతంగా నటించింది.

ప్రశ్న) సినిమాలో హైలైట్స్ ఏంటి..?

స) అచ్చు సంగీతం, నేపధ్య సంగీతం. రీ రికార్డింగ్ లేకుండా సినిమా 50% అని చెప్పాలి. అతని రీ రికార్డింగ్ తో సినిమాకు 100% ఫీల్ వచ్చింది. అతను కూడా ఈ సినిమాలో నటించడంతో కెరీర్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. తర్వాత నా క్యారెక్టర్ సినిమాకు హైలైట్ అవుతుంది. గతంలో నేను చేసిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలో ప్రేక్షకులు కొత్త రాజశేఖర్ ను చూస్తారు.

ప్రశ్న) మెగాస్టార్ 150వ సినిమాలో మీరు నటిస్తున్నారట..?

స) ఇంకా వాళ్ళకు కథే దొరకలేదు. ఒకవేళ చిరంజీవి గారి 150వ సినిమాలో నాకు తగ్గ పాత్ర ఉంటె, ఆయనే పిలిచి చేయమని అడుగుతారు. నాకు ఆ సినిమాలో నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.

ప్రశ్న) విలన్ క్యారెక్టర్లు, మల్టీస్టారర్స్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది..?

స) ఈ వయసులో కూడా హీరో పాత్రలు చేస్తాననడం మూర్ఖత్వమే అవుతుంది. మల్టీస్టారర్స్, ఇతర హీరోల సినిమాలలో ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేయడానికి, విలన్ పాత్రలలో నటించడానికి నేను రెడీ. నాకు రెండు మూడు పెద్ద సినిమాల ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే, ఓ సక్సెస్ వచ్చిన తర్వాత వాటికి ఓకే చేద్దామని ఎదురుచూస్తున్నాను. సక్సెస్ లేక రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు అనిపించుకోవడం ఇష్టం లేదు. ‘గడ్డం గ్యాంగ్’ సక్సెస్ తర్వాత వాటి వివరాలు వెల్లడిస్తాను.

ప్రశ్న) మీ నెక్స్ట్ సినిమాలు ఏంటి..?

స) రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన ‘పట్టపగలు’ షూటింగ్ పూర్తయింది. మా అమ్మాయి, నేను కలిసి నటిస్తున్న ‘వందకు వంద’ మరియు ‘అర్జున’ సినిమాల షూటింగ్ చివరిదశలో ఉన్నాయి. ‘గడ్డం గ్యాంగ్’ విడుదల తర్వాత వరుసగా ఒక్కొకటి విడుదల చేస్తాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు