ఇంటర్వ్యూ : శ్రీకాంత్ అడ్డాల – రుక్మిణి శ్రీకృష్ణల ప్రేమకధే ‘ముకుంద’

ఇంటర్వ్యూ : శ్రీకాంత్ అడ్డాల – రుక్మిణి శ్రీకృష్ణల ప్రేమకధే ‘ముకుంద’

Published on Dec 26, 2014 5:40 PM IST

srikanth-addala
వరుణ్ తేజ్, పూజా హెడ్గే జంటగా ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించిన సినిమా ‘ముకుంద’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మీడియాతో సమావేశం అయ్యారు. మెగా వారసుడు హీరోగా పరిచయమైన ఈ సినిమా గురించి, ప్రేక్షకుల స్పందన గురించి మరియు తన భవిష్యత్ ప్రణాళికల గురించి దర్శకుడు చెప్పిన విశేషాలు మీకోసం..

ప్రశ్న) ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది..?

స) బాగుంది. మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చినా.. రెండవ రోజు నుండి మాత్రం ప్రేక్షకులందరూ సినిమా బాగుందని అంటున్నారు. కలెక్షన్స్ కూడా బాగున్నాయి.

ప్రశ్న) ఫస్ట్ టైం హీరో.. వరుణ్ తేజ్ నటన పట్ల మీరు సంతోషంగా ఉన్నారా..?

స) వంద శాతం సంతోషంగా ఉన్నాను. నా కథలో ‘ముకుంద’ పాత్రలో భావోద్వేగాలను చక్కగా పలికించాడు. ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు.. అందరూ వరుణ్ తేజ్ ను బాగా ప్రజెంట్ చేశారు, కొత్త హీరో అయినా చాలా సహజంగా నటించాడు. అని ప్రశంసిస్తున్నారు. తొలి సినిమాతోనే వరుణ్ తేజ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. షూటింగ్ సమయంలో కూడా చాలా క్రమశిక్షణతో మెలిగేవాడు. భవిష్యత్ లో పెద్ద హీరో అవుతాడు.

ప్రశ్న) వరుణ్ తేజ్ కోసమే యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారా..?

స) లేదండి. నేను కథ సిద్దం చేసుకున్న తర్వాత వరుణ్ తేజ్ ను హీరోగా సెలెక్ట్ చేసుకున్నాను. నాగబాబు గారికి, చిరంజీవి గారికి కథ నచ్చడంతో సినిమా ప్రారంభించాం. నాకు యాక్షన్ జోనర్ లో సినిమా చేయడం కొత్త. అందుకే వీలైనంత సహజంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాను.

ప్రశ్న) హీరో హీరోయిన్లు మాట్లాడుకోకపోవడానికి కారణం ఏంటి..?

స) ఇటీవల కాలంలో అమ్మాయిలు అబ్బాయిల మధ్య మాటలే ఎక్కువ ఉంటున్నాయి. పరిపూర్ణంగా ప్రేమించుకునేవాళ్ళు తక్కువ. అందుకే మాటలు లేకుండా ఓ ప్రేమకథ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచనతో ఈ ప్రేమకథ చేశాను. యువతకు స్వచ్చమైన ప్రేమను చూపించాలనే ప్రయత్నం ఇది.

ప్రశ్న) ఈ ప్రేమకథకు స్ఫూర్తి ఏమైనా ఉందా..? ప్రేక్షకులు ఈ తరహా ప్రేమకథలను ఆదరిస్తారని అనుకుంటున్నారా..?

స) శ్రీకృష్ణుడు – రుక్మిణిలు ఎక్కడా కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. కానీ, ఇద్దరికీ ఒకరంటే మరొకరికి అమితమైన ప్రేమ. వారి ప్రేమకథ ప్రేరణతో వరుణ్ తేజ్ – పూజా హెగ్డేల ప్రేమకథ రాసుకున్నాను. ‘ముకుంద’ టైటిల్ అనుకున్న తర్వాత శ్రీకృష్ణుడి కథలో ఏదోక మంచి విషయాన్నీ ప్రేక్షకులకు చెప్పాలనుకున్నాను. అప్పుడు ఈ ప్రేమకథ చెప్తే బాగుంటుందనే నిర్ణయం తీసుకున్నాను. మెజారిటీ ప్రేక్షకులకు ఫోన్ చేసి ప్రేమకథను చాలా చక్కగా చూపించారని చెప్తున్నారు.

ప్రశ్న) స్నేహితుడి (అర్జున్) కోసం పోరాడడం తప్ప హీరో లక్ష్యాన్ని సరిగ్గా ఆవిష్కరించలేదని విమర్శలు వస్తున్నాయి..?

స) మనల్ని మనం తక్కువ చేసుకోవడం పెద్ద నేరం. నిజాయితిగా ఉండాలి అనే మనస్తత్వం హీరోది. కేవలం మాటలతో ఎదుటివాళ్ళలో మనం సమర్ధులం కాదేమో.. అనే భావనను రావు రమేష్ తీసుకువస్తాడు. ఎదుటివాళ్ళను చులకన చేస్తున్న రావు రమేష్ మీద హీరో పోరాటం చేస్తాడు. మొదట స్నేహితుడి పాత్ర ద్వారా వారిద్దరి మధ్య పోరాటానికి బీజం ఏర్పడింది, అంతే. ఒక్క అర్జున్ విషయంలోనే కాదు, నా స్నేహితుల విషయంలో కూడా ఇలానే రియాక్ట్ అవుతాను అని ఒక సందర్భంలో హీరో చెప్తాడు కదా. తన లక్ష్యం కోసం హీరో పోరాడతాడు.

ప్రశ్న) ప్రకాష్ రాజ్ లాంటి సామాన్య వ్యక్తి, 25 ఏళ్ళ నుండి విజయం సాధిస్తున్న ఒక మున్సిపల్ చైర్మన్ ను ఓడించడం నిజ జీవితంలో సాధ్యమేనా..?

స) సాధ్యమే. సమాజంలో మనకు అలాంటి వ్యక్తులు తారసపడతారు. ఒక వ్యక్తిపై నమ్మకం ఉంచితే ఆసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు. ఎన్నికలలో పోటి చేయకపోయినా రేలంగిలో నేను చూసిన ఓ వ్యక్తి జీవితం ఆధారంగా ఆ పాత్రను తీర్చిదిద్దాను. ప్రకాష్ రాజ్ పాత్ర ద్వారా కొన్ని మంచి విషయాలు చెప్పడం జరిగింది. ఆయన నటనకు, డైలాగులకు మంచి స్పందన లభించిది. స్క్రీన్ టైం తక్కువైనా ఆ పాత్రలో నటించడం ప్రకాష్ రాజ్ గొప్పతనం. ఆయనకు క్యారెక్టర్ బాగా నచ్చింది.

ప్రశ్న) ఓ అగ్ర హీరోతో ‘బ్రహ్మోత్సవం’ అనే సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి..?

స) నిర్మాత అధికారికంగా ఆ సినిమా వివరాలు వెల్లడిస్తారు. స్వచ్చమైన కుటుంబ అనుబంధాలు, విలువలు, ఆప్యాయతల నేపధ్యంలో సాగే ప్రేమకథగా ‘బ్రహ్మోత్సవం’కు రూపకల్పన చేస్తున్నాను. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2015లో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.

ప్రశ్న) ప్రతి సినిమాలో విలువల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎందుకని..?

స) సినిమా అనేది చాలా బలమైన మాధ్యమం. మన సమాజంలో ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే, నాకు సాధ్యమైనంతలో ప్రతి సినిమాలో విలువలు, సాంప్రదాయాల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తా. ప్రతి ఒక్కరూ మార్పు గురించి చెప్తారు. అది మనమే ప్రారంభించాలని నేను నమ్ముతాను. అందుకే, ఈ ప్రయత్నం. సమాజానికి విలువలు చాలా అవసరం. నేను దర్శకత్వం వహించే ప్రతి సినిమాలో విలువలు ఉంటాయి.

ప్రశ్న) దర్శకత్వంలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు..?

స) దాసరి గారు నాకు ఇన్స్పిరేషన్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్కీన్ ప్లే నేర్చుకోవడం కోసం దాసరి గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. విశ్వనాథ్, కె.బాలచందర్, మణిరత్నంలు అన్నా ఇష్టమే.

ప్రశ్న) మళ్లీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి భారి మల్టీస్టారర్ సినిమా ఎప్పుడు తీస్తారు..?

స) నా మదిలో కూడా అటువంటి ఆలోచన ఉంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో మళ్లీ అలాంటి సినిమా తెరకెక్కిస్తాను. ‘బ్రహ్మోత్సవం’ సినిమా పూర్తయిన తర్వాత భారి మల్టీస్టారర్ సినిమా పనులు ప్రారంభిస్తాను. అంటూ ఇంటర్వ్యూను ముగించారు.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు