మెగా హీరోల మధ్య పోటీ తప్పదా?

మెగా హీరోల మధ్య పోటీ తప్పదా?

Published on Sep 3, 2015 12:09 AM IST

Alu-arjun-ram-charan-sai-da
తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఓ ప్రత్యేకత ఉంది. చిరంజీవి నుంచి మొదలుకొని, ఈ మధ్యే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ వరకూ ఎందరో హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి మెప్పిస్తున్న వారిలో ఉన్నారు. అయితే సాధారణంగా వీరంతా ఒకరి సినిమాకు మరొకరి సినిమాతో పోటీ ఉండకుండా సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కాగా అనూహ్యంగా ఇప్పుడు వరుసగా ఒక్కోవారం గ్యాప్‌లో నలుగురు మెగా హీరోలు పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చి పడింది.

అందరికంటే ముందుగా సెప్టెంబర్ 24వ తేదీకి సాయిధరమ్ తేజ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాతో థియేటర్లలో వాలేందుకు సిద్ధమయ్యారు. దిల్‍రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. ఈమధ్యే విడుదలైన ట్రైలర్, ఆడియో సినిమాపై ఆసక్తి పెంచేశాయి. దసరా సీజన్‌కు ముందు వస్తోన్న సినిమాల్లో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మంచి క్రేజ్ ఉన్న సినిమాగా చెప్పుకోవచ్చు. ఇక ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ విడుదలైన వెంటనే మరోవారం రోజుల తర్వాత అక్టోబర్ 2న దర్శకుడు క్రిష్ -వరుణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో రూపొందిన ‘కంచె’ విడుదల కానుంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడిచే ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత విపరీతమైన అంచనాలు బయలుదేరాయి. సినిమా యూనిట్ కూడా ఒక ప్రత్యేక కారణంతో గాంధీ జయంతికి సినిమా విడుదలను ఫిక్స్ చేసింది.

ఇక ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘కంచె’ తర్వాత ఆ వరుసలో సెప్టెంబర్ 9కి ఫిక్స్ అయిన సినిమా ‘రుద్రమదేవి’. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగా హీరో అల్లు అర్జున్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను అక్టోబర్ 9న ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేసేలా గుణశేఖర్ అన్ని ప్లాన్స్ చేస్తున్నారు. ఇక ఈ మూడు సినిమాల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్‌లీ’, రుద్రమదేవి విడుదలైన వారంలోపే అంటే అక్టోబర్ 15కు ఫిక్స్ అయింది. దసరా కానుకగా సెలవులకు విడుదల కానున్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉండడంతో పాటు దసరాకు ఈ సినిమా రావడం తప్పనిసరి అన్న అభిప్రాయం అంతటా ఉంది.

దీంతో పోటీలో నిలిచి ఉన్న ఈ నాలుగు మెగా హీరోల సినిమాలూ వేటికవే ఓ ప్రత్యేక సందర్భంలో, ముందే ఫిక్స్ అయిన ఓ ప్లాన్‌తో విడుదల కానుండడంతోనే అసలు సమస్య వచ్చి పడింది. ఈ విధంగా మెగా హీరోల సినిమాలన్నీ ఒకేసారి థియేటర్ల ముందుకు రావడంతో కచ్చితంగా పోటీ వద్దన్నా ఉండి తీరుతుంది. ఓ పక్క థియేటర్ల సమస్య ఉండడంతో పాటు, మరోపక్క మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒకేసారి పోటి పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై ఈ నాలుగు సినిమాల విషయంలో జరిగే పరిణామాలన్నీ ఆసక్తికరంగా మారనున్నాయనడంలో సందేహం లేదు. ఇకపోతే, ఇప్పుడు ఫిక్స్ చేసిన టైమ్‌కే మెగా హీరోలంతా థియేటర్ల ముందుకు వచ్చేసి పోటీ పడతారా? లేదా సినిమా విడుదల తేదీలను మార్చేసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు