సమీక్ష : ఐతే 2.0 – ఆకట్టుకోలేకపోయింది

సమీక్ష : ఐతే 2.0 – ఆకట్టుకోలేకపోయింది

Published on Mar 16, 2018 12:59 PM IST
Aithe 2.0 movie review

విడుదల తేదీ : మార్చి 16, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మణాల్‌, మదాంజలి

దర్శకత్వం : రాజ్‌ మాదిరాజ్‌.

నిర్మాత : కె.విజయరామరాజు, డా.హేమంత్‌ వల్లపు రెడ్డి

సంగీతం : అరుణ్‌ చిలువేరు

సినిమాటోగ్రఫర్ : కౌశిక్‌ అభిమన్యు

ఎడిటర్ : కార్తీక్‌ పల్లె

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మణాల్‌, మదాంజలి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఐతే 2.0’. నటుడు రాజ్‌ మదిరాజు ఈ సినిమాను దర్శకత్వం వహించగా, ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామరాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మించారు. ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా ? లేదా ? చూద్దాం.

కథ:

ఇంజినీరింగ్ పూర్తి చేసిన నలుగురు విద్యార్థులు తమ దగ్గర ఖర్చులకు డబ్బులు లేక, సరైన ఉద్యోగాలు దొరక్క సైబర్ క్రైమ్ కు పాల్పడతారు. అలా అడ్డదారిలో అడుగులు వేసిన ఆ నలుగురు ఒక కంపెనీలో ఉద్యోగానికి చేరతారు. అదే కంపెనీలో ఒక వ్యక్తి అక్రమ చర్యలకు పాల్పడుతుంటాడు. అతన్ని ఆ నలుగురు ఎలా ఎదుర్కున్నారు ? అతను చేసిన అతిక్రమణ ఏంటి ? చివరికి ఆ నలుగురు ఏం అయ్యారు ? తెలుసుకోవాలంటే ‘ఐతే 2.0’ చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్టోరీ లైన్. సైబర్ క్రైమ్ కు పాల్పడినా అందులో వచ్చే డబ్బును పేద ప్రజలకు పంచి పెట్టాలి. డబ్బు లేని వారిని ఆదుకోవాలి అని ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం తాలూకు సన్నివేశాలు బాగున్నాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్ బాగుంది. నలుగురు కలిసి తన బాస్ చేసే అక్రమ చర్యలను గుర్తించి అతన్ని దెబ్బకొట్టాలని చేసే ప్రయత్నం బాగుంది.

సినిమాలో నటించిన నటీనటులు అందరు దాదాపు కొత్తవాళ్ళే అయినప్పటికీ బాగా చేసారు. సైబర్ క్రైమ్ లో హ్యాకర్స్ అకౌంట్స్ ను ఎలా హ్యాక్ చేస్తారు ? వారు డబ్బును వేరే వారి అకౌంట్స్ నుండి ఎలా దొంగాలిస్తారు వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించడం జరిగింది.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఒక పద్దతి ప్రకారం లేదు, దర్శకుడు అనుకున్న కథ ఒకటి దాన్ని తెరమీద చూపించిన విధానం మరొకటి. డబ్బింగ్ కూడ సరిగా లేదు, కొన్ని సీన్స్ లో రీ సౌండ్స్ వినిపిస్తాయి. ఇలాంటి సినిమాల్లో నేపధ్య సంగీతం బాగుండాలి కానీ ఈ మూవీలో అదే కరువైంది. చాలా చిన్న కాన్సెప్ట్ ను అనవసర సన్నివేశాలు జోడించి పెద్దదిగా చూపించడం జరిగింది. దీంతో చూస్తున్న ప్రేక్షకులకు విసుగు కలగక మానదు.

కొత్తవాళ్ళు బాగా చేసినప్పటికీ వారికి మంచి సన్నివేశాలు, పాటలు పడకపోవడంతో సినిమా తేలిపోయింది. ఇద్దరు కొత్త అమ్మాయిలు ఈ మూవీలో నటించడం జరిగింది, వారిని కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితం చేశారు కాని కథలో నాడుకోలేదు. స్క్రీన్ ప్లేలో కొత్తదనం లేదు, క్లైమాక్స్ కూడా మనం ఊహించినట్టే జరుగుతుంది. సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి అతి కిరాతకంగా మనిషిని చంపడం వంటి సీన్స్ బాగాలేదు. సినిమాలో హింస ఎక్కువగా ఉంది. సినిమాను తక్కువ స్థాయిలో రూపొందించడంతో షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ కూడ సిల్లీగా నమ్మశక్యం కాని రీతిలో ఉంటుంది.

సాంకేతిక వర్గం:

డైరెక్టర్ రాజ్ ముదిరాజ్ చెప్పాలనుకున్న పాయింట్ ను ప్రేక్షకులకు అర్థం అయ్యేలా, ఎంటర్టైన్మెంట్ గా చెప్పడంలో విఫలమయ్యాడు. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఎక్కువ సన్నివేశాల్ని రాయలేకపోయారు. డైలాగ్స్ కూడా సినిమాలో గొప్పగా లేవు. కౌశిక్‌ అభిమన్యు కెమెరా వర్క్ పెద్దగా లేదు. ఆర్టిస్ట్స్ ముఖాలకు దగ్గరగా కెమెరా పెట్టి చాలా సన్నివేశాలు పాడు చెయ్యడం జరిగింది. అరుణ్‌ చిలువేరు సంగీతం ఆకట్టుకోలేదు, ఉన్నది ఒకటి రెండు పాటలే అయిన అవి కూడా సరిగా లేవు. ఎడిటర్ కార్తీక్‌ పల్లె సెకండ్ హాఫ్ లోని చాలా సన్నివేశాలు కట్ చేయాల్సింది. చిత్ర నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు :

గతంలో వచ్చిన ‘ఐతే’ సినిమాకు ఈ సినిమా కొనసాగింపు అనుకోని ఈ ‘ఐతే 2.0’కు వెళ్ళితే నిరాశ తప్పదు. వీటి రెండిటికీ అస్సలు సంభంధం లేదు. దర్శకుడు తయారుచేసుకున్న కథ, స్క్రీన్ ప్లేలో పస లేదు. చాలా సన్నివేశాలు గతంలో ఏదో సినిమాలో చూసిన సీన్స్ లాగే ఉండటంతో సినిమా ఆసక్తికరంగా లేదు. మంచి కాన్సెప్ట్ ను అర్థవంతంగా తియ్యడంలో దర్శకుడు తడబడ్డాడు. మొత్తం మీద కొత్తదనాన్ని, వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకు ఈ సినిమా నిరాశను మిగులుస్తుంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు