పాటల సమీక్ష : బాహుబలి – ది కంక్లూజన్ : రాజమౌళి, కీరవాణీలు ప్రాణం పెట్టి చేసినట్టున్నాయి !

పాటల సమీక్ష : బాహుబలి – ది కంక్లూజన్ : రాజమౌళి, కీరవాణీలు ప్రాణం పెట్టి చేసినట్టున్నాయి !

Published on Mar 26, 2017 10:32 PM IST


దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకేకించిన ‘బాహుబలి-ది కంక్లూజన్’ ప్రీ రిలీజ్ వేడుక ఈరోజే అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకలోనే ఆడియో పాటల్ని సైతం విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్. ‘బాహుబలి-ది బిగినింగ్’ కు తన సంగీతంతో ప్రాణం పోసిన ఎం.ఎం. కీరవాణి ఈ రెండవ భాగానికి కూడా సంగీతం అందిచారు. మరి ఈ పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : సాహోరే బాహుబలిnext-enti

గాయనీ గాయకులు : డాలర్ మెహింది, కీరవాణి, మౌనిమ
రచన : కె.శివ శక్తి దత్త, డా.కె. రామకృష్ణ

‘భళి భళి భళి రా భళి.. సాహోరే బాహుబలి’ అంటూ సాగే ఈ పాట అమరేంద్ర బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడైన తరుణంలో వచ్చేదిగా అనిపిస్తోంది. ఆరంభంలో బాహుబలికి తన కర్తవ్యాలను గుర్తు చేస్తున్నట్టు సాగే ఈ పాట మెల్లగా తల్లి శివగామిదేవి గొప్పతనాన్ని కీర్తిస్తూ సాగుతుంది. పాటకు కీరవాణి అందించిన సంగీతం చాలా బాగుంది. గాయకుడు డాలర్ మెహింది గాత్రం వినిపిచ్చిన ప్రతిసారి గగుర్పాటుగా అనిపించింది. ఇక రచయితలు కె.శివ శక్తి దత్త, డా.కె. రామకృష్ణ పాటకు సంస్కృత పదాలతో కూడిన అద్భుతమైన, అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు.

arere2. పాట : హంస నావ
గాయనీ గాయకులు : సోని, దీపు
రచన : చైతన్య ప్రసాద్

‘ఓరోరి రాజా.. వీరాధి వీర..’ అంటూ మొదలయ్యే ఈ పాట అమరేంద్ర బాహుబలి, దేవసేనలు హంస నావలో విహారానికి వెళ్లిన సమయంలో వచ్చే రొమాంటిక్ సాంగ్ లా ఉంది. ఇందులో దేవసేన బాహుబలిపై తనకున్న ఇష్టాన్ని పాట రూపంలో చెబుతుంది. విజువల్ గా ఈ పాట విఎఫ్ఎక్స్ తో మరింత అందంగా ఉండేలా ఉంది. ఇక చైతన్య ప్రసాద్ అందించిన ‘నీగాలి సోకుతుంటే పైన.. మెచ్చిందిలే దేవసేన’ వంటి సాహిత్యం చాలా రొమాంటిక్ గా అనిపిస్తోంది. మొదటి భాగం నుండి ప్రేక్షకులు చూడాలనుకుంటున్న బాహుబలి – దేవసేనల్ ప్రేమ గాథ ఈ ఒక్క పాటలోనే సుస్పష్టంగా కనిపించేలా ఉంది. ఇక కీరవాణి సంగీతం, సోని,దీపుల గాత్రం చాలా బాగా కుదిరి పాటకు మరింత రసానుభూతిని తీసుకొచ్చాయి.

3. పాట : కన్నా నిదురించరాdisturb
గాయనీ గాయకులు : శ్రీనిధి, వి. శ్రీసౌమ్య
రచన : ఎం. ఎం. కీరవాణి

“మురిపాల ముకుందా..’ అంటూ సాగే ఈ పాట దేవసేన అమరేంద్ర బాహుబలిని వివాహమాడక ముందు, తన రాజ్యమైన కుంతల దేశంలో ఉండగా వచ్చే పాటలా అనిపిస్తోంది. దేవసేన తన ఇష్ట దైవమైన శ్రీకృష్ణుడిని తలచుకుంటూ పాడే పాటలా ఉంది. ఈ పాట చాలా సినిమాల్లో ఉన్నట్టే కాస్త రొటీన్ గానే అనిపిస్తోంది. ఏమంత ప్రత్యేకత కనిపించడంలేదు. బహుశా దృశ్యరూపంలో చూస్తే అనుష్క అభినయంతో బాగుండేలా ఉంది. అమరేంద్ర బాహుబలి దేవసేనను మొదటిసారి చూసే సమయంలోనే ఈ పాట వస్తుందనిపిస్తోంది. కీరవాణి సంగీతం, సాహిత్యం, శ్రీనిధి, వి. శ్రీసౌమ్య ల గాత్రం బాగున్నాయి.

champesave4. పాట : దండాలయ్యా
గాయనీ గాయకులు : కాల భైరవ
రచన : ఎం. ఎం. కీరవాణి

‘పడమర కొండల్లో వాలిన సూరీడా..’ అంటూ చాలా ఆర్ద్రంగా, భాధగా మొదలయ్యే ఈ పాట ఒక రాజు రాజ్యాన్ని విడిచిపోతున్నప్పుడు అతన్ని ఆపేందుకు ప్రజలు పాడెడిలా ఉంది. బహుశా చిత్రంలో బాహుబలి రాజ్యాన్ని భల్లాలుడికి వదిలేసి ఏమీ లేనివాడిగా వెళ్లే సమయంలో ఘట్టం ఉండి ఆ సమయంలో ఈ పాట వస్తుందేమో. ఈ పాటలో రాజమౌళి చతురత కన్పిస్తోంది. పాట మొదటి సగం రాజు రాజ్యం విడిచిపోతుంటే బాధపడ్డ ప్రజలు చివరి సగంలో మళ్ళీ అదే రాజును రాజ్యంలోకి ఆహ్వానిస్తూ సంతోషపడుతుంటారు. అంటే ఇది అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ఇద్దరికీ వర్తించే పాటలా ఉంది. కాల భైరవ తన గాత్రం పాటలో అటు భాధను, ఇటు సంబరాన్ని సమానంగా పలికించాడు. కీరవాణి సంగీతం, సాహిత్యం రెండూ బాగున్నాయి.

5. పాట : ఒక ప్రాణంside
గాయనీ గాయకులు : కాల భైరవ
రచన : ఎం. ఎం. కీరవాణి

‘ఒక ప్రాణం ఒక త్యాగం..’ అంటూ చాలా ఉద్రేకంగా ఆరంభమయ్యే ఈ పాట కట్టప్ప తప్పనిసరి పరిస్థితుల్లో మనసు చంపుకుని బాహుబలిని చంపడం, అమరేంద్ర బాహుబలి చేసిన త్యాగం, భల్లాలుడు-బాహుబలి మధ్య వైరం, భర్త మరణం, కొడుకు పోరాటాన్ని చూస్తున్న దేవసేన పరిస్థితి, రాజ్యం కోసం బాహుబలి తన రక్తాన్ని ప్రతి బొట్టు శివుడికి సమర్పించినట్టు యుద్ధం చేయడం వంటి అంశాలని స్పృశించారు. ఒక్క మాటలో చెప్పాలంటే కథలోని కీలక పాత్రలు, కీలక ఘట్టాలపైనే ఈ పాట నడిచేలా కన్పిస్తోంది. ఈ పాటకు కాల భైరవ గాత్రం ప్రాణం పోయగా కీరవాణి సంగీతం, సాహిత్యం పాట గొప్పగా నిలబడేలా చేశాయి.

తీర్పు:

ఈ ఆడియో పాటలను వింటుంటే ‘బాహుబలి-ది కంక్లూజన్’ చిత్రంపై కోటి ఆశలు పెట్టుకుని విడుదల కోసం ఆశగా ఎదురుచూస్తున్న తెలుగు సినీ ప్రేక్షకుల ఆశలు నెరవేరేంత గొప్పగా ఈ రెండవ భాగాన్ని రాజమౌళి రూపొందించినట్టు ఇట్టే అవగతమవుతోంది. అసలైన కథ, మలుపులు, ఘట్టాలు అన్నీ ఇందులో ఉండటం వలన ఈ పాటల్ని అద్భుతంగా మలిచారు కీరవాణి. ఒక్క మూడవ పాట మాత్రమే కాస్త రొటీన్ గా ఉన్నా మిగతా ఒకటి, రెండు, నాలుగు, ఐదు పాటలైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. విజువల్ గా చూస్తే ఇవి మంచి అనుభూతిని ఇవ్వడం ఖాయమని అనిపిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే ఈ పాటలను రాజమౌళి, కీరవాణిలు ప్రాణం పెట్టి చేసినట్టున్నాయి.

Click here for Audio Songs

Click here for English Music Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు