సమీక్ష : చిరునవ్వుల చిరుజల్లు – ‘చల్లని ప్రేమజల్లు’!

సమీక్ష : చిరునవ్వుల చిరుజల్లు – ‘చల్లని ప్రేమజల్లు’!

Published on Mar 13, 2015 7:58 PM IST
Chirunavvula Chirujallu

విడుదల తేదీ : 13 మార్చి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : ఐ. అహ్మద్

నిర్మాత : జానీ

సంగీతం :హరీస్ జయరాజ్

నటీనటులు : జీవా, త్రిష, వినయ్ రాయ్, సంతానం తదితరులు


2013 చివరి వారంలో ‘ఎండ్రెండ్రుమ్ పున్నగై’ పేరుతో తమిళంలో విడుదలై మంచి విజయం సాధించిన సినిమాను ‘చిరునవ్వుల చిరుజల్లు’ పేరుతో తెలుగులో అనువదించారు. ఎప్పట్నుంచో విడుదలకు నోచుకోకుండా ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నిజంగానే చిరునవ్వుల చిరుజల్లు కురిపించిందా ? లేదా ? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

గౌతమ్ (జీవా), శ్రీ (వినయ్ రాయ్), బేబీ (సంతానం) ముగ్గురు ప్రాణ స్నేహితులు. తనని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయిన తల్లిని హీరో ద్వేషిస్తూ ఉంటాడు. కొన్ని కారణాలతో గౌతమ్, అతడి తండ్రి(నాజర్) తమ ఊరొదిలి సిటీకి వచ్చేస్తారు. అలాంటి సమయంలోనే శ్రీ, బేబీలను అతను స్కూల్లో కలవడం, వాళ్ళు ముగ్గురూ పెరిగి పెద్దై పోవడం జరిగిపోతుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్నేహం వారిది. జీవితంలో పెళ్ళి చేసుకున్నా, అమ్మాయిల జోలికి పోయినా దానికి మించిన నరకం ఉండదనే అభిప్రాయంలో.. పెళ్ళి అనేదే చేసుకోమని ముగ్గురూ మాటిచ్చుకుంటారు. తమ ఇష్టానుసారంగానే జీవితాన్ని గడిపే వారు, ఒక సొంత యాడ్ ఏజెన్సీని నెలకొల్పుతారు. వేరొక పెద్ద కంపెనీతో ప్రాజెక్టులో భాగంగా, ఆ సంస్థ తరపున ప్రియ (త్రిష) వీరితో కలిసి పనిచేస్తుంది. ప్రియకి వారి ఆలోచనా విధానాలు నచ్చకపోయినా మంచి వాళ్ళనే కారణంతో వాళ్ళతో పాటే కలిసిపోతుంది. ఇంతవరకూ చాలా సంతోషంగా నడిచిపోయే వాళ్ళ జీవితంలోకి ఒక్కసారిగా గొడవలొస్తాయి. శ్రీ, బేబీలు తాము పెళ్ళి చేసుకుంటున్నామని చెప్పడంతో గౌతమ్ వాళ్ళిందరి నుంచి విడిపోతాడు.

ఇక ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా కలవడం కుదరదు. ఒక పెద్ద ప్రాజెక్ట్ రావడంతో అప్పటివరకూ బాధలో ఉన్న గౌతమ్, దాన్నుంచి బయటకు వచ్చి మళ్ళీ పనుల్లో మునిగిపోతాడు. ప్రాజెక్ట్ పనిపై యూరప్ వెళ్ళడం, అక్కడ గౌతమ్ ప్ర్రియతో దగ్గరగా మెలగడం, మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత విడిపోవడం జరుగుతుంది. అయితే గౌతమ్ తన పదో యేట నుంచి తండ్రితో మట్లాడకపోవడం సినిమా మొదటి నుంచీ చూపిస్తారు. 15 ఏళ్ళ పాటు గౌతమ్ తండ్రితో ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు ? మళ్ళీ ఆ ముగ్గురు స్నేహితులు కలుస్తారా ? ప్రియను గౌతమ్ ప్రేమిస్తున్న విషయం అతను అర్థం చేసుకుంటాడా? అన్న ప్రశ్నలకు సమాధానం తెరపైనే చూడాలి.

ప్లస్‌ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్రధాన బలంగా చెప్పుకోవాల్సింది కథనం గురించే. నిజానికి రొమాంటిక్ కామెడీ కథల్లో పెద్దగా కథేమీ లేకపోయినా చెప్పే విధానం, కథ నడిచే తీరు మాత్రమే ఆ సినిమా స్థాయిని నిర్ణయిస్తాయి. హీరో క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయడం దగ్గరనుంచి, ముగ్గురు స్నేహితుల కలయిక, వాళ్ళ జీవితం, స్నేహం ఇవన్నీ చాలా పకడ్బందీగా రూపొందించారు. ఎప్పుడైతే త్రిష వాళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తుందో కథ ఇక మొత్తం అర్థమైపోయిన భావన కలిగినా చిన్న చిన్న ట్విస్ట్‌లతో, రొమాంటిక్ సన్నివేశాలతో, సున్నితమైన హాస్యంతో కథను నడిపించారు. గౌతమ్ పాత్రలో జీవా ఒదిగిపోయాడు. త్రిష అందంతో, అభినయంతో ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులంతా తమ శక్తిమేర నటించారు. పాటల ప్లేస్‌మెట్స్ దగ్గరనుంచి ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. ఆండ్రియా ఉన్నంతసేపూ అందంతో ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ మొత్తం సరదా సరదాగా గడిచిపోగా, సెకండాఫ్‌లో అసలైన పాయింట్ తెర మీదకు తీసుకువచ్చారు. ప్రీ క్లైమాక్స్‌కు ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక అక్కణ్ణుంచి మొదలయ్యే క్లైమాక్స్ ఊహించదగ్గదే అయినా అంతకుమించి ఆశించలేం కూడా. ఇంతకు ముందే తెలిసిన, ముందే ఊహించగల కథలో కూడా ముందు నుంచే కొన్ని ప్రశ్నలను రేకెత్తించడం ద్వారా వాటి సమాధానాల కోసమైనా సినిమాని చూసేలా స్క్రిప్ట్ డిజైన్ చేశారు. ఈ ప్రయాణంలో కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చేయడంలో సినిమా విజయం సాధించిందనే చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

పైన చెప్పినట్టుగానే ముందే తెలిసిన కథ సినిమాకి మైనస్ పాయింట్ అని చెప్పాలి. అయితే.. ఇది అన్ని ప్రేమకథా చిత్రాల్లోనూ జరిగేదే. సెకండాఫ్ తర్వాత మొదలయ్యే కొన్ని సన్నివేశాల్లో సాగతీత కనిపిస్తుంది. అప్పటివరకూ సరదా సరదాగా సాగిన సినిమా ఒక్కసారే స్లో నెరేషన్‌లోకి వెళ్ళేసరికి ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. ఈ ఫేస్ ఎక్కువ సేపు లేకపోవడం సినిమాకి కలిసివచ్చే అంశం. ఆండ్రియా పాత్ర కేవలం త్రిషపై గౌతమ్‌కి ప్రేమ కలగడానికి ఒక పావుగా మాత్రమే వాడుకున్నారు. అయితే.. ఆ పాత్ర అంతకుమించి చేయడానికి కూడా ఏమీ లేదు. అక్కడక్కడా వచ్చే కొన్ని అసభ్య సన్నివేశాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. త్రిష ప్రాజెక్ట్ హెడ్ పాత్ర గేలా ప్రవర్తించడం కొంతమందికి నవ్వు తెప్పిస్తుందేమో కానీ, మరికొంతమందికి ఒకరకమైన చిరాకునూ కలిగిస్తుంది.

సాంకేతిక విబాగం :

సాంకేతిక విభాగాల పని తీరుకొస్తే.. అందరికన్నా ఎక్కువ మార్కులు సంపాదించుకునేది సినిమాటోగ్రాఫర్ ఆర్.మదియే! సినిమా ఆసాంతం అందంగా, పెయింటింగ్‌లా తీశాడు. ఫ్రేమ్‌లో నిలకడ, లైటింగ్ అతడి ప్రతిభకు నిదర్శనం. ఇక యూరప్ అందాల గురించి చెప్పనవసరం లేదు. ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో అలాంటి చిత్రీకరణ చూసి ఉండం. కథలో కొత్తదనం లేకపోయినా కథనం విషయంలో పూర్తి మార్కులు కొట్టేశాడు దర్శకుడు అహ్మద్. చుట్టూ ఉన్న పరిస్థితులు దృశ్యాల ద్వారా పాత్రల వ్యక్తిత్వాన్ని చూపించడంలో అతడి పని తనాన్ని చూడొచ్చు. ఎడిటింగ్ షార్ప్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంది. సెకండాఫ్‌లోని స్లో నెరేషన్ పట్ల దర్శకుడు కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. హారీస్ జయరాజ్ మ్యూజిక్, వండర్ అనిపించకున్నా అన్ని పాటలూ థియేటర్‌లో చూసినప్పుడు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కి తగ్గట్టు పర్ఫెక్ట్‌గా సాగింది. డైలాగులు కొన్ని చోట్ల అతిగా ఉన్నా, ఓవరాల్‌గా ఫర్వాలేదనిపిస్తుంది. దర్శకుడి విజన్‌కి తగ్గట్టు అన్ని విభాగాలూ పని చేసాయన్న విషయం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది.

తీర్పు :

ఒక్కమాటలో చెప్పాలంటే.. కాసేపు సరదాగా, కాసేపు ఎమోషనల్‌గా సాగిపోయే బలమైన కథనం, పెయింటింగ్‌లా తీర్చిదిద్దబడ్డ సన్నివేశాలు, పాటల కోసం ఈ సినిమాని హ్యాపీగా చూసేయచ్చు. స్లో నెరేషన్‌లో సాగే రొమాంటిక్ ప్రేమకథలను మెచ్చని వారు మాత్రం సినిమాకి దూరంగా ఉండడమే మంచింది. సినిమా పేరులో చెప్పినట్టుగానే చిరునవ్వుల చిరుజల్లుతో ప్రేమజల్లును ఆస్వాధించవచ్చు. అందులో తడవడం, తడవకపోవడం అన్నది ప్రేక్షకుడి ఇష్టం. అయితే.. ఈ సినిమా ఇప్పుడు, ఈ సీజన్‍లో రావడం ద్వారా పెద్దగా చేయగలిగిందేమీ లేదు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు