సమీక్ష : దళం – నక్సలిజం విత్ ఎంటర్టైన్మెంట్

సమీక్ష : దళం – నక్సలిజం విత్ ఎంటర్టైన్మెంట్

Published on Aug 16, 2013 4:00 AM IST
dalam-review విడుదల తేదీ : 15 ఆగష్టు 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : జీవన్ రెడ్డి
నిర్మాత : ఎం. సుమంత్ కుమార్ రెడ్డి
సంగీతం : జేమ్స్ వసంతన్
నటీనటులు : నవీన్ చంద్ర, కిషోర్, పియా బాజ్పాయ్..

‘అందాల రాక్షసి’ సినిమా ఫేం నవీన్ చంద్ర హీరోగా, పియా బాజ్పాయ్ హీరోయిన్ గా నక్సల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా ‘దళం’. ఈ సినిమాలో కిషోర్ ఓ కీకల పాత్ర పోషించాడు. వర్మ దగ్గర శిష్యరికం చేసిన జీవన్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్. జేమ్స్ వసంతన్ సంగీతం అందించిన ఈ సినిమాని సుమంత్ కుమార్ రెడ్డినిర్మించాడు. నక్సల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంత వరకూ ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

నక్సలైట్ నాగబాబు దళంలో పనిచేస్తున్న శత్రు(కిషోర్), అభి(నవీన్ చంద్ర) నక్సల్స్ గా మారి అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నామని, ఇలాంటి పోరాటం వ్యర్థం అని పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనుకుంటారు. అలా లొంగిపోయిన వాళ్ళకి కోర్టు ఒక నెల రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తుంది. జైల్లో ఉన్న శత్రు గ్యాంగ్ లోని ఫైర్ ని గమనించిన పోలీస్ హెడ్ పోలీసులు లీగల్ గా చెయ్యలేని పనులను ఆ గ్యాంగ్ తో చెయ్యించాలని అనుకుంటాడు. దానికి వాళ్ళు ఒప్పుకొని మళ్ళీ గన్ పట్టుకుంటారు. రాజకీయ నేత అయిన జెకె(నాజర్) వాళ్ళని కొన్ని సొంత పనులకు వాడుకుంటూ ఉంటాడు. దాంతో శత్రు గ్యాంగ్ కొన్ని ఇబ్బందుల్లో పడతారు. అదే తరుణంలో వారందరినీ ఏరిపారేయడానికి గవర్నమెంట్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ లడ్డా(అభిమన్యు సింగ్) ని రంగంలోకి దింపుతుంది. అప్పుడే ఆ తర్వాత లడ్డా శత్రు గ్యాంగ్ ని హత మార్చాడా? లేక శత్రు గ్యాంగ్ లడ్డాని చంపేసిందా? అసలు శత్రు గ్యాంగ్ లోకి శృతి(పియా బాజ్పాయ్) ఎలా వచ్చింది? అసలు శృతి ఎవరు? అనే అంశాలను తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

అందాల రాక్షసి’ సినిమాలో కాస్త అల్లరిగా కనిపించిన నవీన్ చంద్ర ఈ సినిమాలో బాగా సీరియస్ గా కనిపిస్తాడు. డైరెక్టర్ ఎంచుకున్న పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోయాడు. సినిమాలో మాట్లాడింది చాలా తక్కవే అయినప్పటికీ ఆ పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. శత్రు పాత్రలో కనిపించిన కిషోర్ పాత్రకి తగ్గట్టు చేసాడు. పియా బాజ్పాయ్ ది చిన్న పాత్రే అయినప్పటికీ సినిమాకి కీలకమైనది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో అభిమన్యు సింగ్, జైలర్ పాత్రలో హర్షవర్ధన్ ల నటన బాగుంది. నాజర్, నాగబాబు, అజయ్ లు తమ పాత్ర పరిధిమేర నటించారు.

ఏకే 47 పాత్రలో ధన్ రాజ్, భద్రం పాత్రలో కృష్ణుడు ఫస్ట్ హాఫ్ లో బాగా నవ్వించారు. అలాగే యాదగిరి అలియాస్ యాదవ్ పాత్రలో తాగుబోతు రమేష్ కడుపుబ్బా నవ్వించాడు. ముఖ్యంగా అన్నిటికీ ‘యాదవ్ ….’ అంటూ అలాగే ‘రుచి మరిగిర్రు కొడుకులు’ అంటూ తెలంగాణ యాసలో మాట్లాడటం మరియు సెకండాఫ్ లో ‘స్వాతి ముత్యం’ సినిమాలోని ‘సువ్వి సువ్వి’ పాటపై చేసిన స్పూఫ్ అందరినీ బాగా నవ్విస్తుంది. ఇంటర్వల్ బ్లాక్ ముందు వచ్చే 20 నిమిషాల కామెడీ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అవుతుంది. ఇంటర్వల్ ఎపిసోడ్ బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి అలాగే ప్రజల్ని ఉత్తేజ పరచడం కోసం నక్సల్ చేత చెప్పించిన కొన్ని లైన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఫస్ట్ హాఫ్ సాగినంత వేగంగా సెకండాఫ్ సాగదు. ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చెయ్యడంతో సెకండాఫ్ ఇంకా బాగుంటుందని ఆశిస్తారు. కానీ అంత ఎఫెక్టివ్ గా లేకపోవడంతో ప్రేక్షకులు కాస్త నిరాశపడుతారు. సెకండాఫ్ మొదలైన కొద్దిసేపటికే క్లైమాక్స్ ఎలా ఉంటుందా అనేది ఊహించేయవచ్చు. అలాగే క్లైమాక్స్ ని తెలుగు వారికి అంతగా నచ్చని ట్రాజిడీతో ముగించడం ఎంతవరకూ కనెక్ట్ అవుతుందో చెప్పలేము.

ఇలాంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ బాగా హైలైట్ అవుతూ ఉంటాయి కానీ ఈ మూవీలో ఐటెం సాంగ్ ఆడియన్స్ కి అంతగా నచ్చదు. జర్నలిస్ట్ పాత్రలో సాయి కుమార్ ని మొదటి సీన్ లో హై రేంజ్ లో చూపించి సెకండాఫ్ లో సింపుల్ గా చంపేయడం బాలేదు.

సాంకేతిక విభాగం :

కెప్టెన్ అఫ్ ది సినిమా డైరెక్టర్ అంటారు.. అలాంటి డైరెక్టర్ జీవన్ రెడ్డి ఈ సినిమా కోసం కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అనే నాలుగు కీలకమైన విభాగాలను డీల్ చేసాడు. కథ – ఒక్కసారి గన్ పట్టుకున్నోడు దాన్ని వదలాలనుకున్నా అది వాళ్ళని వదలదు అనే కాన్సెప్ట్ ని చాలా బాగా రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే – అక్కడక్కడా అంత ఎఫ్ఫెక్టివ్ గా లేకపోయినా మొత్తంగా ఓకే అనేలా ఉంది. డైలాగ్స్ – సింప్లీ సూపర్బ్. ప్రతి ఉద్యమం ఏదో ఒక స్వార్ధంలో నుంచి పుట్టిందే కానీ నిజాల పునాదులనుంచి పుట్టిందే నక్సలిజం, పోలీస్ ఇంటరాగేషన్ అంటే పోలీసోడి లాఠీకి, మీ వాడి బాడీకి స్టామినా టెస్ట్ లాంటిది’ లాంటి డైలాగ్స్ మరియు నక్సల్ చేత చెప్పించిన కొన్ని బిట్ సాంగ్స్ బాగున్నాయి. తొలి సినిమా అయినా జీవన్ రెడ్డి తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు. ఇంకాస్త శ్రద్ధ పెట్టి కమర్షియల్ సినిమాలు చేస్తే మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది.

సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు పెద్దగా అర్థం కాకపోయినా జేమ్స్ వసంతన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాని చాలా చోట్ల నిలబెట్టింది. ఎడిటర్ సెకండాఫ్ పై ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘దళం’ నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఆకట్టుకునే సినిమా. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ అనగానే కేవలం గొడవలే పోలీసులతో జరిగే గొడవలే కాకుండా కాస్త ఎంటర్టైన్మెంట్, ఒక 5 నిమిషాల లవ్ ఎపిసోడ్, సెంటిమెంట్ లాంటివి పెట్టి సినిమాని ప్రేక్షకులకి నచ్చే విధంగా డైరెక్టర్ ప్లాన్ చేసుకోవడం బాగుంది. నవీన్ చంద్ర- కిషోర్ పెర్ఫార్మన్స్, కొన్ని కామెడీ ఎపిసోడ్స్, డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్ అయితే సెకండాఫ్ ఊహాజనితంగా ఉండడం కొన్ని బోరింగ్ సీన్స్, ట్రాజిడీ క్లైమాక్స్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. నక్సలిజం విత్ ఎంటర్టైన్మెంట్ ఉన్న దళం సినిమాని ఈ వారం ఎలాంటి అనుమానం లేకుండా చూడొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు