సమీక్ష : దేవి శ్రీ ప్రసాద్ – లాజిక్స్ లేని క్రైమ్ థ్రిల్లర్

సమీక్ష : దేవి శ్రీ ప్రసాద్ – లాజిక్స్ లేని క్రైమ్ థ్రిల్లర్

Published on Nov 24, 2017 4:06 PM IST
Devi Sri Prasad movie review

విడుదల తేదీ : నవంబర్ 24, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : శ్రీ కిశోర్

నిర్మాత : ఆర్వి. రాజు, డి. వెంకటేష్

సంగీతం : కమ్రాన్

నటీనటులు : భూపాల్ రాజు, ధన్ రాజ్, మనోజ్ నందన్, పూజ రామచంద్రన్

భూపాల్ రాజు, ధన్ రాజ్, మనోజ్ నందన్, పూజ రామచంద్రన్ లు ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘దేవి శ్రీ ప్రసాద్’. టీజర్, టరీలర్లతోనే మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

దేవి (భూపాల్ రాజు), శ్రీ (ధన్ రాజ్), ప్రసాద్ (మనోజ్ నందన్) లు మంచి స్నేహితులు. వాళ్లకు స్టార్ హీరోయిన్ లీల (పూజ రామచంద్రన్) అంటే చాలా ఇష్టం. ఆమెను ఒక్కసారైనా దగ్గర్నుండి చూడాలని ఆశపడుతుంటారు. అలాంటి లీల ఒకరోజు అనుకోకుండా కారు ప్రమాదంలో చనిపోతుంది. ఆమె శవాన్ని శ్రీ పనిచేసే హాస్పిటల్ లో ఉంచుతారు డాక్టర్లు.

ఆ విషయం తెలుసుకున్న శ్రీ తన మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ దేవి, ప్రసాద్ లకు విష్యం చెప్పి చూడటానికి రమ్మని పిలుస్తాడు. అలా ఆ ముగ్గురు శవాల గదిలో ఉన్న లీల శవాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఏం చేశారు ? వాళ్ళు చేసిన పని వలన ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డారు ? అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్లస్ పాయింట్ అంటే దర్శకుడు ఎంచుకున్న కథాంశమనే చెప్పాలి. చనిపోయిన హీరోయిన్ తో తాగిన మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ఏం చేశారు, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డారు, ఆ ఇబ్బందుల నుండి బయటపడటానికి తప్పు మీద తప్పును ఎలా చేశారు అనే సింగిల్ లైన్ పాయింట్ ను బాగానే అనుకున్నాడు దర్శకుడు కిశోర్. ఈ పాయింట్ తో మంచి డ్రామాను క్రియేట్ చేసే అవకాశముంది. చనిపోయిన బాడీ చుట్టూ నడిచే ఈ సినిమాను ఆరంభంలో బాగానే హ్యాండిల్ చేశారాయన.

ముగ్గురు స్నేహితులు శవంతో తప్పు చేయడం వరకు చిత్రం ఆసక్తికరంగానే నడిచింది. అలాగే ఆ తప్పును కప్పి పుచ్చడానికి చేసే కొన్ని ప్రయత్నాలు కూడా మెచ్చుకోలుగానే ఉన్నాయి. నటుల్లో దేవి పాత్రను చేసిన భూపాల్ రాజు మంచి నటన కనబర్చాడు. అతని నటనతో సినిమాలోని తీవ్రత పెరిగింది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు కిశోర్ రాసుకున్న సింగిల్ లైన్ పాయింట్ చెప్పుకోడానికి బాగానే ఉన్నా అది స్క్రీన్ మీద విజయవంతం కావాలంటే ఉత్కంఠమైన కథనం, సన్నివేశాలు తప్పనిసరి. వాటినే సరిగ్గా తయారుచేసుకోలేదు దర్శకుడు. దీంతో సినిమా ఆరంభంలో కొద్దిసేపు బాగానే ఉన్నా తర్వాత తర్వాత బోర్ కొట్టేసింది. అంతేగాక కీలకమైన మలుపు కూడా చాలా సిల్లీగా అనిపించాయి. ముఖ్యంగా చివర్లో రివీల్ చేసే కీలకమైన మలుపు తెలిస్తే అంత మాత్రం దానికి ఇంత సినిమా అవసరంలేదనిపిస్తుంది.

దర్శకుడు కిశోర్ ఎక్కడికక్కడ తనకు నచ్చినట్టు స్వేచ్ఛను వాడేసుకోవడంతో చాలా నిరుత్సాహం కలిగింది. ముఖ్యంగా హాస్పిటల్ లో జరిగే కొన్ని సన్నివేశాలైతే మినిమమ్ లాజిక్ కూడా లేకుండా మరీ సిల్లీగా ఉన్నాయి. దాంతో ఉత్కంఠగా నడవాల్సిన సినిమా కాస్త సిల్లీ సిల్లీగా తయారైంది. అంతేగాక కథనం మధ్యలో వచ్చే కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దర్శకుడు స్త్రీ ఉనికిని గుర్తించాలి అంటూ ఆరంభంలో చెప్పినా ఆ తర్వాత దాన్ని స్క్రీన్ పై కన్వే చేయలేకపోయాడు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు కిశోర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా సరైన కథ, కథనాలు లేకపోవడం, సన్నివేశాలు, మలుపుల్లో లాజిక్స్ లేకపోవడంతో సినిమా ఫలితం తలకిందులైంది. ముఖ్యంగా ద్వితీయార్థం మొత్తం దర్శకుడు తీసుకున్న ఓవర్ ఫ్రీడమ్ వలన సిల్లీగా తయారైంది. ఆయన మేకింగ్లో అనుభవలేమి స్పష్టంగా కనబడింది. అయితే ఆయన అతి తక్కువ బడ్జెట్లో సినిమా తీయడాన్ని మాత్రం మెచ్చుకోవచ్చు.

కమ్రన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫణీందర్ వర్మ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది. చంద్రమౌళి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

‘దేవి శ్రీ ప్రసాద్’ అనే ఈ చిత్రం పాయింట్ బాగున్నా సరైన కథనం, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు లేకపోగా లాజిక్స్ కు చాలా దూరంగా ఉండటం, దర్శకుడి అనుభవలేమి వలన కేవలం సినిమా కోసం ఎంచుకున్న పాయింట్, చిత్ర ఆరంభం, ప్రధాన పాత్రలు క్రైమ్స్ చేయడానికి పురిగొల్పే పరిస్థితులు మినహా సినిమా మొత్తం తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించే విధంగా ఉంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ చిత్రం ఒక లాజిక్ లేని క్రైమ్ థ్రిల్లర్ గా మిగిలిపోయింది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు