సమీక్ష : మామ ఓ చందమామ – ప్రతి సీన్ ఎక్కడో చూసినట్టే ఉంటుంది

సమీక్ష : మామ ఓ చందమామ – ప్రతి సీన్ ఎక్కడో చూసినట్టే ఉంటుంది

Published on Dec 15, 2017 11:36 PM IST
Mama O Chandamama movie review

విడుదల తేదీ : డిసెంబర్ 15, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : రామ్ కార్తీక్, సనా మక్బుల్ ఖాన్

దర్శకత్వం : విశాఖ థ్రిల్లర్స్ వెంకట్

నిర్మాత : వరప్రసాద్ బొడ్డు

సంగీతం : మున్నా కాశీ

సినిమాటోగ్రఫర్ : జి.ఎల్.బాబు

స్టోరీ, స్క్రీన్ ప్లే : విశాఖ థ్రిల్లర్స్ వెంకట్

యంగ్ హీరో రామ్ కార్తిక్, సనా మక్బుల్ ఖాన్ లు జంటగా నటించిన చిత్రం ‘మా ఓ చందమామ’. ఈరోజే ప్రేక్షకుల్ ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పరిశీలిద్దాం..

కథ:

చంటి (రామ్ కార్తీక్) తన ఊళ్ళోనే పెద్దమనిషి (సుమన్) ఇంట్లో చిన్నప్పటి నుండి పనివాడిగా ఉంటూ వాళ్లలో ఒకడిగా కలిసిపోతాడు. కానీ సుమన్ కు చంటి అంటే అస్సలు పడదు. ప్రతి చిన్న విషయానికి చంటిని తిడుతూనే ఉంటాడు. అలాంటి ఆయన చంటి ఊళ్లోని ప్రేమ జంటకు పెళ్లి చేశాడనే విషయం తెలుసుకుని చంటిని, చనిపోయిన అతని అమ్మను కూడా నిందిస్తాడు.

సుమన్ చంటి అమ్మను ఎందుకు నిందించాడు, చంటి ఎవరు, చంటి సుమన్ ఇంట్లోకి ఎలా చేరాడు, ఈ మధ్యలో సుమన్ కుమార్తె కీర్తి (సనా మక్బుల్) కు, చంటికి నడుమ చిగురించిన ప్రేమ ఏమైంది అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ హీరో గతం. ఇంటర్వెల్ తర్వాత బయటపడే హీరో గతం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఆ గతం కూడా కథకు చాలా కీలకంగా ఉండి బాగుంటుంది. హీరో తనను అసహ్యించుకుంటున్న యజమాని కోసం చివరి వరకు పాకులాడటం, ఆయన పరువు కోసం తన ప్రేమను కూడా త్యాగం చేయాలనుకోవడం వంటి అంశాలు కొంత ఎమోషన్ ను క్యారీ చేయగలిగాయి.

ఇక మధ్యలో వచ్చే జబర్దస్త్ గెటప్ శ్రీను కామెడీ చాలా చోట్ల పండింది. మతిమరుపు పనివాడిగా శ్రీను నటన అలరించింది. హీరో రామ్ కార్తిక్ నటనలో పరిణితి చూపించాడు. డైరెక్టర్ వెంకట్ హీరో చుట్టూ రాసిన రిలేషన్స్ కొన్ని బాగుంటాయి. ఊరి పెద్దగా సుమన్ పాత్ర, అందులో ఆయన నటన ఆకట్టుకున్నాయి. నిర్మాత వరప్రసాద్ బొడ్డు కథను సపోర్ట్ చేసేందుకు మంచి నటీనటులను తీసుకుని నిర్మాణ దక్షతను చాటుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన మైనస్ కథనంలోని ఒక్కటంటే ఒక్క ప్లాట్ కూడా కొత్తగా అనిపించలేదు. కీలకమైన ప్రతి బ్లాక్ ఏదో ఒక హిట్ సినిమాలో చూసినవే. సినిమా మొత్తం పూర్తయ్యాక చూస్తే కొన్ని హిట్ సినిమాల్లో హైలెట్ గా నిలిచిన ప్లాట్స్, సన్నివేశాలని తీసుకొని కట్టగా కలిపి ఈ సినిమా చేశారని అర్థమైపోతుంది. దీంతో సినిమా చూస్తున్నంతసేపు ఒక సబ్ ప్లాట్ మొదలవగానే దాని గమనం, ముగింపు దాని వలన కథలో హిట్ చేసుకునే మలుపులు ఈజీగా పట్టేయవచ్చు. దీంతో సినిమా చూస్తున్నంతసేపు బోర్ ఫీల్ సలుపుతునే ఉంటుంది.

ఇక కథకు కీలకమైన అంశాల్లో ఒకటైన హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ఎక్కడా రొమాంటిక్ ఫీల్ ను కలిగించలేకపోయింది. వాటికి తోడు మధ్యలో వచ్చే పాటలు విసిగించాయి. ఫస్టాఫ్ ఏదోలా గడిచినా సేకదాఫ్ మాత్రం చాలా భారంగా నడించింది. ఎప్పుడెప్పుడు సినిమా ముగుస్తుందా అనే ఫీలింగ్ కలిగింది. జబర్దస్త్ అప్పారావ్ కామెడీ ట్రాక్, హీరోయిన్ తాలూకు కొన్ని సన్నివేశాలు అవసరం లేకున్నా కథలోకి ప్రవేశించి చికాకాకు పెడతాయి. అన్నిటినీ మించి సినిమా టైటిల్ కు ఎక్కడా జస్టిఫికేషన్ జరగలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు విశాఖ థ్రిల్లర్స్ వెంకట్ సినిమా కోసం కావాల్సిన కథను కొన్ని సినిమాల నుండి స్ఫూర్తిపొంది తీసుకున్నా సినిమా చూసేప్పుడు ప్రేక్షకుడికి వాటిని గుర్తుకురాకుండా జాగ్రత్తపడలేకపోయారు. దీంతో ప్రతి కీలక సన్నివేశం తేలిపోయింది. వీటికి తోడు బలహీనమైన కథనం మరింత బోర్ కొట్టింది.

ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్లోని కొన్ని అనవసరమైన సన్నివేశాల్ని తొలగించి ఉండాల్సింది. బ్యాక్ గ్రౌడ్ స్కోర్ పర్వాలేదనేలా ఉన్న పాటల సంగీతం మాత్రం అస్సలు మెప్పించలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

తెలుగులో పెద్ద హిట్లుగా నిలిచిన సినిమాల స్పూర్తితో కథను రాసుకుని విశాఖ థ్రిల్లర్స్ వెంకట్ రూపొందించిన ఈ ‘మామ ఓ చందమామ’ చిత్రంలో కొత్తదనం, ఆసక్తికరమైన అంశాలు ఏవీ కనబడలేదు. దీంతో సినిమా ఆద్యంతం నీరసంగానే సాగింది. గెటప్ శ్రీను కామెడీ, ఇంటర్వెల్ తర్వాత రివీల్ అయ్యే ట్విస్ట్ మినహా ఈ చిత్రంలో ఎంజాయ్ చేయడానికి మరే అంశాలు లేవు. మొత్తం మీద చెప్పాలంటే టైటిల్ జస్టిఫికేషన్ లేని ఈ సినిమా కొన్న టికెట్ కు కూడా పూర్తిస్థాయి జస్టిఫికేషన్ చేయలేదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు