స‌మీక్ష : ప‌నిలేని పులిరాజు – ప‌స లేని ప్ర‌య‌త్నం!

స‌మీక్ష : ప‌నిలేని పులిరాజు – ప‌స లేని ప్ర‌య‌త్నం!

Published on Jul 15, 2016 8:00 PM IST
Panileni Puliraju review

విడుదల తేదీ : 15 జూలై, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : చాచా

నిర్మాత : పి.వి. నాగేష్ కుమార్

సంగీతం : వి.వి.

నటీనటులు : ధ‌న‌రాజ్, ప్రాచీ సిన్హా, శ్వేతా వ‌ర్మ‌, కొండ‌వ‌ల‌స ల‌క్ష్మ‌ణ‌రావు

రీసెంట్ గా తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఎంట‌ర్ టైన్ మెంట్ సినిమాల‌కు పెద్ద పీట వేస్తున్నారు. అందుకే స్టార్ హీరోలు కూడా కామెడీనే న‌మ్ముకోవాల్సిన ప‌రిస్థితి. సినిమాలో కొంచెం విష‌యం ఉంటే చాలు ప్రేక్ష‌కులు ఆదరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నారు. కామెడీ సినిమాల‌కు ఆద‌ర‌ణ ఉంటుంద‌నే న‌మ్మ‌కంతోనే జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ ప్రొగ్రామ్ తో బాగా పాపుల‌ర్ అయిన ధ‌నాధ‌న్ ధ‌న‌రాజు మ‌రోసారి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ప‌నిలేని పులిరాజు’. కామెడీకి కాస్త మ‌సాలా జోడించి తెర‌నిండా ఒళ్లంతా చూపించే లేడీ పాత్ర‌ల‌తో ప‌నిలేని పులి రాజు చిత్రం ఈరోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. గ‌తంలో ధ‌న‌రాజు హీరోగా చేసిన చిత్రాలు అంత‌గా ఫ‌లితాల‌నివ్వ‌లేదు. మ‌రి హీరోగా ధ‌న‌రాజు ఈ సినిమాతోనైనా నిల‌దొక్కుకున్నాడా? అడల్ట్ కామెడీతో సంద‌డి చేసేందుకు వ‌చ్చిన ప‌నిలేని పులిరాజు ప్రేక్ష‌కుల‌ను ఏమేర‌కు ఆక‌ట్టుకున్నాడో చూడాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

క‌థ :

ఒక‌ప్పుడు బాగా బ‌తికిన జ‌మీందార్ల వంశానికి వారసుడు పులిరాజు (ధ‌న‌రాజు). విచ్చ‌ల‌విడిగా తిరిగే పులిరాజుకు ఆడ‌వాళ్ల బ‌ల‌హీన‌త‌. ఆడ‌వాళ్ల‌తో ఎంజాయ్ చేస్తూ బ‌లాదూర్ గా తిరుగుతూ ఉంటాడు. త‌న వంశానికి వార‌సుడు కావాల‌ని భావించిన ధ‌న‌రాజ్ తండ్రి (ఆ పాత్ర కూడా ధ‌న‌రాజ్ దే) అత‌నికి ఒక ప‌ల్లెటూరి అమ్మాయిని ఇచ్చి పెళ్లి జ‌రిపిస్తాడు. అయితే చెప్పిన స‌మ‌యం కంటే ముందే శోభ‌నం జ‌రిగితే ఆడ‌పిల్ల‌ పుడుతుంద‌ని వంశం అంత‌రించిపోతుంద‌ని జ్యోతిష్కులు హెచ్చ‌రిస్తారు. కానీ శోభ‌నం స‌మ‌యం కంటే ముందే జ‌రిగిపోతుంది. దీంతో పులిరాజుకు ఇద్ద‌రు అమ్మాయిలు పుడ‌తారు. దాంతో పాటు అత‌ని భార్య‌కు భ‌విష్య‌త్ లో ఇక పిల్ల‌లు పుట్టే అవ‌కాశం లేద‌ని డాక్ట‌ర్లు తేల్చిచెప్పేస్తారు. దీంతో తీవ్రంగా ఆగ్ర‌హించిన పులిరాజు తండ్రి అత‌న్ని బంగ్లా నుంచి వెళ్ల‌గొడ‌తాడు. భార్య ద్వారా కుద‌ర‌దు కాబట్టి ఎవ‌రి ద్వారా అయినా కొడుకును క‌ని తీసుకువ‌స్తేనే బంగ్లాలోకి ప్ర‌వేశం ఉంటుంద‌ని లేకుంటే ఇక రావ‌ద్ద‌ని ఆర్డ‌ర్ చేస్తాడు. మ‌రి పులిరాజు కొడుకును క‌న్నాడా? పులిరాజు బిడ్డ‌కు త‌ల్లి అయ్యేందుకు ఎవ‌రైనా ఒప్పుకున్నారా? చివ‌రికి త‌న తండ్రి ఆస్తిని సాధించాడా అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్ :

ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టే ఈ సినిమాలో ప్ల‌స్ పాయింట్స్ వెత‌క‌డం అంటే ఎడారిలో నీళ్లు వెతికిన‌ట్టే. ఇప్ప‌టికే హాస్య‌న‌టుడిగా తెలుగు సినిమాల్లో స్థిర‌ప‌డ్డ ధ‌న‌రాజ్ సినిమాను అంతా తాను ఒక్క‌డే న‌డిపించాడు. అత‌ని కామెడీ టైమింగ్ బాగున్నా అత‌నికి స‌పోర్ట్ చేసే పాత్ర‌ భూత‌ద్దం పెట్టి వెతికినా ఈ సినిమాలో క‌నిపించ‌దు. ఇక దివంగ‌త హాస్య‌న‌టుడు కొండ‌వ‌ల‌స ఈ సినిమాలో పూర్తి స్థాయిలో క‌నిపించారు. ప్రారంభం నుంచి హీరోకు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్‌లో కొండ‌వ‌ల‌స త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకున్నారు.

మైన‌స్ పాయింట్స్ :

సింపుల్ పాయింట్ ను మొద‌ట్లో బాగానే హ్యాండిల్ చేసినా త‌ర్వాత సినిమా పూర్తిగా గాడి త‌ప్పింది. కేవ‌లం బూతు (దీన్ని మ‌సాలా అనాలేమో) ను ఆధారం చేసుకుని సినిమాను చుట్టేద్దామ‌నుకుని ఈ చిత్ర టీం భంగ‌ప‌డ్డారు. ప్ర‌థ‌మార్థంలో ఏదో కాస్త ఫ‌ర్వాలేద‌నిపించినా, ద్వితియార్ధంలో మాత్రం ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టారు. కీల‌క‌మైన పాత్ర‌ల తీరుతెన్నుల‌ను కూడా ద‌ర్శ‌కుడు హ్యండిల్ చేయ‌డంలో ఫెయిల‌య్యాడు. పాత్ర‌ల‌కు ఉన్న వ్య‌క్తిత్వంపై ప్రేక్ష‌కుడు ఒక అంచ‌నాకు వ‌చ్చేలోపే ఆ విష‌యాన్ని గంద‌ర‌గోళంలో ప‌డేసారు.

ఇక కామెడీ సినిమా అన్న పేరే కానీ ఎక్క‌డా ఒక పంచ్ డైలాగ్ కూడా ఉండ‌దు. కేవ‌లం లేడీ పాత్ర‌లు, వాళ్ల గ్లామ‌ర్ ఇదే విష‌యంతో బండి లాగిద్దామ‌నుకున్నారు. ఇది ప్రేక్ష‌కుల‌కు విసుగు తెప్పించింది. చివ‌ర్లో సినిమాను హ‌డావుడిగా ఎవ‌రో త‌ర‌ముతున్న‌ట్టు ముగించి చేతులు దులుపుకోవ‌డం కూడా మైన‌స్ గా మారింది. సినిమా పోస్ట‌ర్ల‌లో 13 పాత్ర‌ల్లో ధ‌న‌రాజు అంటూ హ‌డావుడి చేసారు కానీ సినిమాలో ఒక‌ట్రెండ్ పాత్ర‌లు మిన‌హా మిగ‌తావి ఎందుకొచ్చాయో, ఎందుకు వెళ్లాయో అర్ధం కాక ప్రేక్ష‌కులు అమోమ‌యంలో ప‌డ్డారు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాను ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కించ‌డంలో డైరెక్ట‌ర్ చాచా విఫ‌ల‌మ‌య్యారు. ఫస్ట్ హాఫ్ లో ఎలాగోలా బండిని లాగించినా సెకండాఫ్ పూర్తిగా తేలిపోయారు. ఎంచుకున్న క‌థ చాలా సింపుల్ గా చిక్కు లేకుండా ఉన్నా దాన్ని హ్యాండిల్ చేయ‌లేక‌పోయారు. ఇక వీ.వీ. సంగీతం అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఒక ఐట‌మ్ సాంగ్ మాత్రం ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. సినిమాలో గ్రాఫిక్స్ కూడా చాలా నాసిర‌కంగా ఉన్నాయి. చిన్న బ‌డ్జెట్ సినిమా అని స‌రిపెట్టుకున్నా మ‌రీ అంత ఛీప్ గా ఉండ‌టం ప్రేక్ష‌కుల‌కు మింగుడుప‌డ‌దు. ఆనంద్ మ‌రుకుర్తి కెమెరా ప‌నిత‌నం ఫ‌ర్వాలేదు అనిపించేలా ఉంది. కామెడీ సినిమాకు ప్రాణమైన సంభాష‌ణ‌లు కూడా పేల‌లేదు.

తీర్పు :

అడల్ట్ కామెడీ అంటూ వ‌చ్చిన ప‌నిలేని పులిరాజు ప‌స‌లేని పులిరాజుగా మిగిలిపోయాడ‌ని చెప్పాలి. సినిమా నిండా లేడీ పాత్ర‌ల‌ను పెట్టి వాళ్ల అంద‌చందాలు, ఒంపు సొంపుల‌తోనే సినిమాను న‌డిపిద్దామ‌నుకున్నారు కానీ ఆ ప‌ని కూడా స‌రిగా చేయ‌లేక‌పోయారు. ధ‌నాధ‌న్ ధ‌న‌రాజు వంటి కామెడీ న‌టుడ్ని హీరోగా పెట్టుకుని అత‌న్ని పూర్తి స్థాయిలో వాడుకోలేదు. ధ‌న‌రాజు సినిమాలో కాస్త కామెడీ ఉంటుంద‌ని ఆశించిన వారిని ఇది నిరాశ‌ప‌ర్చింది. క‌థ‌, క‌థ‌నాల్లో కొత్త‌ద‌నం లేక‌పోయినా ఉన్న పాయింట్ ను అయినా ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో చూపించ‌డంలో ఫెయిల‌య్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అడల్ట్ కామెడీ అన్న ప్రచారం పొందిన ఈ సినిమాకు, అలాంటి అంశాలను కోరుకొని వెళితే పూర్తిగా నిరాశ తప్పదు.

123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు