సమీక్ష : రాజా వారు రాణి గారు – స్లోగా సాగే లవ్ స్టోరీ !

సమీక్ష : రాజా వారు రాణి గారు – స్లోగా సాగే లవ్ స్టోరీ !

Published on Nov 30, 2019 3:02 AM IST
Raja Vaaru Rani Garu review

విడుదల తేదీ : నవంబర్ 29, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్, రాజ్ కుమార్ కాశీ రెడ్డి, యజుర్వేద్ గుర్రం, స్నేహ మాధురి, దివ్య నార్ని తదితరులు.

దర్శకత్వం : రవి కిరణ్ కోలా

నిర్మాత‌లు : మనోవికాస్ డి

సంగీతం :  జే క్రిష్

సినిమాటోగ్రఫర్ : విద్యా సాగర్ చింత, అమర్ దీప్ గుత్తుల

ఎడిటర్:  విప్లవ్ నైషధం


కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ‘రాజావారు రాణిగారు’. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకం పై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా జయ్ క్రిష్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ:

రాజా (కిరణ్‌ అబ్బవరం) తన మిత్రలతో కలిసి తమ పల్లెలో సాధారణ జీవితం గడుపుతూ స్కూల్ లైఫ్ నుంచే రాణి (రహస్య గోరఖ్‌)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే తన ప్రేమను వ్యక్త పరచలేని స్వభావంతో ఎన్నో సార్లు ఆ విషయం ఆమెకు చెప్పాలని అనేక ప్రయత్నాలు చేసి.. చివరికీ చెప్పలేక తనలో తానే మదన పడుతూ నలిగిపోతుంటాడు. ఈ క్రమంలో.. రాణి తన పై చదువుల కోసం వేరే ఊరు వెళ్లిపోతుంది. మూడున్నర సంవత్సరాలు గడుస్తోన్నా రాణి మళ్ళీ తిరిగి రాదు. రాణి ఊరికి రావడానిని రాజా ఫ్రెండ్స్ ఏమి ప్లాన్ చేసారు? వారి ప్లాన్ కారణంగా రాణి ఊరు వస్తోందా? రాజా రాణికి తన ప్రేమ విషయం చెప్పాడా? చివరికి తన ప్రేమను గెలుచుకున్నాడా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో నేటివిటీకి సంబంధించిన స్టోరీ వరల్డ్ మరియు స్వచ్ఛమైన ప్రేమ కోసం హీరో పడే సంఘర్షణ.. అలాగే ఆహ్లదమైన ప్రేమ సన్నివేశాలు మరియు పల్లెటూరి అమాయక స్వభావం కలిగిన స్నేహితుల మధ్య నడిచే హాస్యసన్నివేశాలు సినిమా మొదటి భాగంలో చక్కగా కుదరడం… అదేవిదంగా యాసలో సాగే ఫన్నీ డైలాగులు, దర్శకుడు నటీనటుల నుండి రాబట్టుకున్న సహజసిద్ధమైన నటన వంటి అంశాలు.. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. హీరో హీరోయిన్ ఇద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు ఎక్స్‌ ప్రెస్‌ చేసుకునే క్లైమాక్స్ సన్నివేశం కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది.

ప్రధాన పాత్రలు చేసిన హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరఖ్‌ ఇద్దరు కొత్తవారైనప్పటికీ, తమ నటనతో ఆయా పాత్రలలో చక్కగా నటించారు. ప్రేమను వ్యక్తపరచలేని యువకుడిగా కిరణ్ నటన చాలా సహజంగా ఉంది. అలాగే హీరోకి అతని ఫ్రెండ్స్ కి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి.

హీరోకి ఫ్రెండ్స్ గా నటించిన చౌదరి, నాయుడు పాత్ర నటులు కూడా తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్ని చోట్ల బాగా నవ్వించారు. ముఖ్యంగా చౌదరి పాత్ర సినిమాకే ప్రత్యేక ఆకర్షణ. హీరోయిన్ తండ్రిగా నటించిన నటుడు కూడా తన నటనతో పాటు ఆయన చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

అబ్బాయి అమ్మాయితో ప్రేమలో పడటం.. ఆ ప్రేమను వ్యక్తపరచలేక పోవడం అన్న కాన్సెప్ట్‌ ఇప్పటికే చాలా లవ్ స్టోరీల్లో చూశాం. దాంతో స్టోరీ పరంగా ఈ సినిమాలో కొత్తగా ఏమి లేదు. అయితే కథా నేపథ్యం మరియు ఆ నేపథ్యంలోని పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు.. కథనం విషయంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో కొన్ని ప్రేమ సన్నివేశాలు ఇంకా కుదించి ఉంటే బాగుండేది. అలాగే కథకు అవసరం లేని కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించాల్సింది.

ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో కీలక సన్నివేశాలు సంబంధించిన సంఘర్షణ కూడా బలంగా ఎలివేట్ అయినా ఫస్ట్ హాఫ్ అంత ఇంట్రస్ట్ గా సాగవు. దీనికి తోడు కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతాయి. అయితే బలమైన క్లైమాక్స్ తో మెయిన్ ఎమోషన్ హైలెట్ అయింది. ఇక సినిమాలో అందరూ కొత్త నటీనటులు కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితాన్ని కొంతవరకు దెబ్బతీస్తుందనే చెప్పాలి. పైగా కొత్త ధనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించదు.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు మంచి నేపథ్యంలో ఆసక్తికరమైన పాత్రలతో ఈ సినిమాను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా.. కథనం విషయంలో మాత్రం బాగా నెమ్మదిగా కనిపించారు. సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగట్లు ఆకట్టుకుంటుంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా అప్పటి కాలాన్ని గుర్తు చేస్తూ నడుస్తాయి. నిర్మాతలు ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. నిర్మాతల ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

 

తీర్పు:

రవికిరణ్ కోలా దర్శకత్వంలో కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా వచ్చిన ఈ చిత్రంలో భావేద్వేగమైన ప్రేమ కథతో సాగే కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు స్వచ్ఛమైన ప్రేమ కోసం హీరో పడే సంఘర్షణ.. అలాగే ఆహ్లదమైన పల్లెటూరి అమాయక స్వభావం కలిగిన స్నేహితుల మధ్య నడిచే హాస్యసన్నివేశాలు అదేవిదంగా యాసలో సాగే ఫన్నీ డైలాగులు, నటీనటుల సహజసిద్ధమైన నటన వంటి అంశాలు ఆకట్టుకునప్పటికీ… స్టోరీ కాన్సెప్ట్‌ రొటీన్ గా ఉండటం, కథనం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం, సినిమాలో కీలక సీన్స్ లో లాజిక్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మొత్తం మీద ఈ సినిమా మంచి ప్రేమ కథా చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు