సమీక్ష : యముడికి మొగుడు – నవ్వించి ఏడిపించాడు

సమీక్ష : యముడికి మొగుడు – నవ్వించి ఏడిపించాడు

Published on Dec 28, 2012 8:10 AM IST
Yamudiki Mogudu (1) విడుదల తేదీ: 27 డిసెంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : ఈ. సత్తిబాబు
నిర్మాత : చంటి ఆడ్డాల
సంగీతం : కోటి
నటీనటులు : అల్లరి నరేష్, రిచా పనాయ్


సుడిగాడు వరకు మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరున్న అల్లరి నరేష్ ఆ సినిమా తరువాత సుడి ఒక్కసారిగా మారిపోయింది. సుడిగాడు సినిమా తరువాత వస్తున్న ‘యముడికి మొగుడు’ సినిమా ఈ రోజే విడుదలైంది. ఈ. సత్తి బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమా పై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. నరేష్ సరసన రిచా పనాయ్ నటించిన ఈ సినిమాని చంటి అడ్డాల నిర్మించాడు. 1988లో వచ్చిన చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా యముడికి మొగుడు టైటిల్ వాడుకుంటూ వచ్చిన ఈ అల్లరోడు యముడికి మొగుడు అయ్యాడా లేదా అనేది ఒకసారి చూద్దాం.

కథ :

బ్రహ్మ చేసిన తప్పిదం వల్ల నరేష్ (నరేష్) తల రాత లేకుండా ఒక నెల ముందుగానే పుడతాడు. నరేష్ తల రాత లేకుండా పుట్టడం వల్ల చావు ఉండదు, దేవుళ్ళకు ఉండే శక్తులు అన్నీ అతనికి ఉంటాయి. యమ’గోల’ సినిమా ధియేటర్లో పుట్టడం వల్ల చిన్నప్పటి నుండే మహా అల్లరోడిలా తయారవుతాడు. ఇంటర్మీడియట్ ఆరు సంవత్సరాల నుండి చదువుతూనే ఉంటాడు. నాటకాల వేసే పిచ్చి ఉన్న నరేష్ స్వయంవరం నాటకం వేస్తుండగా యామజ/యముడి కూతురు (రిచా పనాయ్) ని ఆ నాటకంలో వివాహమాడతాడు. నరేష్ తన మొగుడు అని భావించిన యామజ నరేష్ వెంట పడుతుంది. యమజని వదిలించుకోవడానికి నరేష్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. నరేష్, యమజని తన ఇంట్లో పనిమనిషిగా పరిచయం చేసి మెల్లిగా ఆమెని ప్రేమిస్తాడు. యామజ భూలోకం వెళ్లిందని తెలుసుకున్న యముడు (షాయాజీ షిండే) యమజని తీసుకు రమ్మని తన కొడుకు యమగండ (మాస్టర్ భరత్), చిత్ర గుప్తుడు (కృష్ణ భగవాన్) ని భూలోకానికి పంపిస్తాడు. వారి ప్రయత్నం విఫలమయ్యి యముడే భూలోకానికి వచ్చి యమజని యమలోకానికి తీసుకు వెళ్తాడు. మరి నరేష్ ఏం చేసాడు? అసలు యామజ భూలోకానికి ఎందుకు వచ్చింది? అసలు యముడికి, నరేష్ కి సంభందం ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే యముడికి మొగుడు చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

కామెడీ సినిమాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిన అల్లరి నరేష్ ఈ సినిమాలో కామెడీ బాగా పండించాడు. కామెడీ పంచ్ డైలాగులకి అతని టైమింగ్ తోడవడంతో బాగా పేలాయి. డైలాగుల్లో కొంత ద్వందార్ధాలు ధ్వనించినప్పటికీ కామెడీలో కలిసి పోయాయి. సింగిల్ టేక్ సీన్ యముడి ముందు చెప్పిన దానవీరశూరకర్ణ స్పూఫ్ డైలాగ్ అదిరింది. రిచా పనాయ్ నటన పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ చూడడానికి బావుంది. అందాల ప్రదర్శన కూడా కావలసినంత చేసింది. షాయాజీ షిండే యముడిగా పర్వాలేదనిపించాడు. భారీ డైలాగులు లేకపోవడం వల్ల బతికిపోయాడు. రమ్యకృష్ణ అత్తో అత్తమ్మ కూతురో రీమిక్స్ సాంగ్లో మాస్ ఆడియెన్స్ ని అలరించింది. గత కొన్ని సినిమాల నుండి నవ్వించలేకపోతున్న మాస్టర్ భరత్ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో బాగా నవ్వించాడు. యమలోకంలో రఘు బాబుతో క్రికెట్ ఆడే సన్నివేశం బావుంది. కృష్ణ భగవాన్ పంచ్ డైలాగుల్లో పంచ్ కాస్త తగ్గింది కానీ నవ్వించడంలో మాత్రం ఫెయిల్ కాలేదు. ఫస్టాఫ్ వరకు కామెడీ పంచ్ డైలాగులతో సరదాగా సాగిపోతుంది.

మైనస్ పాయింట్స్ :

ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మరి మైనస్ ఏమీ లేవా అంటే ఎందుకు లేవు ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిన సినిమా ఇంటర్వెల్ భాగంతో కథ మొత్త తెలిసిపోవడంతో సెకండ్ హాఫ్ కథ లేకుండా చప్పగా సాగింది. చివరికి క్లైమాక్స్ ఏం జరబోతుందో మనకు తెలుసు, ఎలా ముగిస్తడా అని ఆసక్తిగా ఎదురు చుసిన వారికి పేలవమైన క్లైమాక్స్ తో ముగింపునిచ్చాడు. ముగింపు కూడా కామెడీగా ఉండుంటే బావుండేది. అప్పటి వరకు లేని సెంటిమెంట్ ఎపిసోడ్ ఒక్కసారిగా నెత్తి మీద పెట్టాడు. వీటికి తోడు అత్తో అత్తమ్మ కూతురో రీమిక్స్ పాట మినహా మిగతా పాటలన్నీ ఆసక్తికరంగా లేకపోవడం మైనస్. రిచా పనాయ్ డబ్బింగ్ కూడా అస్సలు బాలేదు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన క్రాంతి రెడ్డి సింగిల్ హ్యాండ్ తో సినిమాని నిలబెట్టాడు. త్రివిక్రమ్ మార్కు పంచ్ డైలాగుల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాసుకున్న డైలాగులన్నీ బాగా పేలాయి. కోటి సంగీతం అందించిన పాటలు బావుండుంటే సినిమా రేంజ్ మరింత పెరిగేది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి యమలోకం సెట్, ఓరోరి మగధీర పాటలో ఆర్ట్ బావుంది. తక్కువ బడ్జెట్ అయినా నిర్మాణ విలువలు మాత్రం తగ్గకుండా ఉన్నాయి. ఈవివి సత్యనారాయణ వారసుడిగా వచ్చిన ఈ. సత్తిబాబు కామెడీ ఫస్టాఫ్ వరకు బాగానే పండించగలిగాడు ఆ కామెడీ చివరిదాకా మేనేజ్ చేయడంలో విఫలమయ్యాడు.

తీర్పు :

యముడి కాన్సెప్ట్ మీద ఈ సంవత్సరం వచ్చిన సోషియో ఫాంటసీ సినిమాలన్నీ నిరాశ పరిచాయి. కామెడీని నమ్ముకోవడంతో ఈ సినిమా మాత్రం బాగానే నవ్వించింది. ఫస్టాఫ్ లో ఉన్న కామెడీ సెకండ్ హాఫ్ కూడా మేనేజ్ చేసి బెటర్ క్లైమాక్స్ తీసి ఉంటే ఇంకా బావుండేది. కామెడీ సినిమాల మీద ఆసక్తి ఉన్నవారు సరదాగా అల్లరి నరేష్ కామెడీ కోసం ఒకసారి ఈజీగా చూడొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

అశోక్ రెడ్డి .ఎమ్

Click Here For ‘Yamudiki Mogudu’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు