సమీక్ష : తుమ్మెద – ప్రేక్షకులకి పెద్ద టార్చర్.!

సమీక్ష : తుమ్మెద – ప్రేక్షకులకి పెద్ద టార్చర్.!

Published on Dec 28, 2013 1:20 AM IST
Tummeda విడుదల తేదీ : 27 డిసెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5
దర్శకుడు : కె. నారాయణ
నిర్మాత : నరేష్ అడపా – సరయు చిట్టాల – అడపా కొండలరావు
సంగీతం : ఎం.ఆర్, కున్ని గుడిపాటి
నటీనటులు : రాజా, విజయ్ ధరణ్, వర్ష పాండే, అక్షయ..

చాలా రోజుల గ్యాప్ తర్వాత రాజా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘తుమ్మెద’. ఈ సినిమాలో రాజాతో పాటు విజయ్ ధరణ్, వర్ష పాండే, అక్షయ ప్రధాన పాత్రలు పోషించారు. కె. నారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని నరేష్ అడపా – సరయు చిట్టాల – అడపా కొండలరావులు కలిసి నిర్మించారు. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తుమ్మెద సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

మనోహర్(రాజా), వెంకీ అలియాస్ విక్కీ(విజయ్ ధరణ్) మంచి ఫ్రెండ్స్. మనోహర్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్, వెంకీ ఏమో ఓ కాంట్రాక్టర్ దగ్గర సూపర్ వైజర్ గా పనిచేస్తుంటారు. స్వతహాగా అమ్మాయిలన్నా, పెళ్లి అన్నా ఆమడ దూరం పారిపోయే మనోహర్ ఓ రోజు తన పక్క ఫ్లాట్ లో దిగిన అర్చన(వర్ష పాండే)ని చూసి ప్రేమలో పడతాడు. అదే సమయంలో మాధురి అనే అమ్మాయి ఫేస్ బుక్ లో మనోహర్ ని పెళ్లి చేసుకోమని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇదిలా ఉంటే వెంకీ కూడా రోజా(అక్షయ)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ రోజా మాత్రం వెంకీ ప్రేమకి నో చెబుతుంది. అదే సమయంలో అర్చన కూడా చెప్పాపెట్టకుండా ప్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. దాంతో మనోహర్ బాగా బాధపడుతుంటాడు.

అప్పుడు నిన్ను అర్చనని కలిపే బాధ్యత అని వెంకీ మనోహర్ తో చెప్తాడు. అర్చన ఎక్కడ ఉందా అని వెతుకుతున్న తరుణంలో రోజా అర్చనని మనోహర్ తో కలపడానికి నేను సాయం చేస్తాను కానీ నువ్వు నా కోసం ఓ పని చేయాలంటుంది. దానికి వెంకీ ఒప్పుకుంటాడు. రోజా వెంకీకి చెప్పిన పని ఏంటి? చివరికి వెంకీ అర్చన – మనోహర్ కలిపాడా? లేదా? మనోహర్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న మాధురి ఏమయ్యింది? అసలు రోజాకి అర్చనకి ఉన్న సంబంధం ఏమిటి అనే ట్విస్ట్ లను మీరు తెరపైనే చూడాలి…

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ లో మొదటగా చెప్పాల్సింది సినిమాలో అక్కడక్కడా వినిపించే ఇళయరాజా పాటలు, అలాగే ఓ సందర్భంలో వినిపించే ఘంటశాల గారి పాట. రాజా నటన పరంగా జస్ట్ ఓకే అనిపించాడు. దూకుడు ప్రదర్శించే పాత్రలో అక్షయ నటన బాగుంది.

మైనస్ పాయింట్స్ :

డైరెక్టర్ ఈ సినిమా నటీనటుల ఎంపికలో కాస్త జాగ్రత్త వహించాల్సింది. సినిమాలో వర్ష పాండేది మెయిన్ హీరోయిన్ రోల్ అయినప్పటికీ తెరపై కనిపించేది కొద్ది సేపు మాత్రమే, అలాగే ఆ పాత్రకి డైలాగ్స్ కూడా లేవు, అలాగే పాత్రకి ప్రాధాన్యత కూడా లేదు. ఇవన్నీ పక్కన పెడితే కనిపించిన సీన్స్ లో అన్నా బాగా చేసిందా అంటే అదీ లేదు. పైన చెప్పినట్టు నటన పరంగా రాజా ఓకే అనిపించినా సినిమాలో అతనికి పెద్ద ప్రాధాన్యత లేదు. ప్రధాన పాత్ర చేసిన విజయ్ ధరణ్ కోపం, బాధ, నవ్వు ఇలా అన్ని రకాల భావాలకి ఒకే రకమైన ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులని చితక్కోట్టేసాడు. ఇలా సినిమాలో ఉన్న మరి కొంత మంది నటుల నుంచి కూడా డైరెక్టర్ నటనని రాబట్టుకోలేకపోయాడు.

డైరెక్టర్ కథలో అక్కడక్కడా ట్విస్ట్ లని ఓ మాదిరిగా రాసుకున్నప్పటికీ వాటిని సరిగా తీయలేకపోయాడు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు కథ ఏ మాత్రం ముందుకు సాగకుండా అక్కడే ఉంటుంది అంటే స్క్రీన్ ప్లే ఎంత స్లోగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సెకండాఫ్ ని అయితే సాగదీసి దీసి ప్రేక్షకుని సహానికి పరీక్ష పెట్టాడు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేది అస్సలు లేదు. సినిమానే ముందుకు సాగట్లేదు అంటే మధ్యలో పాటలు వచ్చి ఇంకా చిరాకు పుట్టిస్తాయి. కథకి అవసరం లేని సీన్స్, అవసరం లేని సినిమాలో పాత్రలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ కి, సినిమా కంటెంట్ కి అస్సలు సంబంధం లేదు.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో ఇది బాగుంది అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. సినిమాటోగ్రఫీ ఒకటో రెండో సీన్స్ లో తప్ప మిగతా అన్ని చోట్లా నాశిరకంగా ఉంది. ఎడిటర్ అస్సలు జాగ్రత్త తీసుకోకుండా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే సినిమాలో అవరసం లేని సీన్స్ ఎక్కువైపోయాయి. ఎంఆర్ అందించిన పాటలు, కున్ని గుడిపాటి అందించిన నేపధ్య సంగీతం ఏదీ సినిమాకి హెల్ప్ అవ్వలేదు.

కథ – మాటలు – దర్శకత్వం నారాయణ డీల్ చేసాడు. కథ – ఆయన అనుకున్నది ఒకటి సినిమాలో చెప్పింది ఒకటి, కావున తను అనుకున్న కథ మధ్యలోనే కొట్టుకుపోయిందని మీరు అర్థం చేసుకోవచ్చు. మాటలు – సందర్బానికి మంచి డైలాగ్స్ కావాలి, కానీ ఆ సీన్ కి కనీస న్యాయం చేసే డైలాగ్స్ కూడా లేవు అంటే ఏ రేంజ్ లో డైలాగ్స్ రాసాడో మీరే అర్థం చేసుకోండి. ఇక డైరెక్షన్ అనేది అస్సలు బాలేదు.

తీర్పు :

ఈ సినిమా టైటిల్ తుమ్మెద, కానీ తుమ్మెద కంటే తేనెటీగ అనే టైటిల్ పెట్టి ఉంటే బాగుండేది. ఇలా ఎందుకన్నాను అంటే సినిమా మొత్తం తేనెటీగలా కుట్టి కుట్టి ప్రేక్షకులకి టార్చర్ పెడుతుంది. ఈ సినిమాకి ఏకంగా రెండు ఉపశీర్షికలు ఉన్నాయి. మొదటిది… మనసు లేని ప్రేమికుల కథ – ఇది ఒక మనసు లేని డైరెక్టర్ ప్రేక్షకుల మీద పగతో తీసిన ప్రేమ కథలా ఉంది. అసలు మనసనేదే లేకుండా ప్రేమ కథ ఎలా ఉంటుందనే లాజిక్ ని దర్శకుడు ఎలా మిస్ అయ్యాడో.. ఇక రెండవది.. అమ్మ చేతి వంట లాంటి కమ్మనైన ప్రేమకథా చిత్రం – అసలు అమ్మ చేత్తో విషం ఇచ్చినా కమ్మగా ఉందంటారు కానీ ఈ సినిమా కనీసం ఓ చెత్త హోటల్ లో ఉండే టిఫిన్ అంత రుచిగా కూడా లేకపోవడం ప్రేక్షకుల దురదృష్టకరం. ఇలాంటి ట్యాగ్ లైన్స్ పెట్టి ప్రేక్షకులని ఇబ్బంది పెట్టకూడదని డైరెక్టర్స్ కి మనవి. ఈ సినిమాలో చూడటానికి ఏమీ లేదు. సింపుల్ గా ఈ సినిమా జోలికి వెళ్లకపోవడం మీ జేబుకు చాలా మంచిది..

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

రాఘవ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు