సమీక్ష : వారధి – ఓకే కానీ లెంగ్త్ ఎక్కువైంది.

సమీక్ష : వారధి – ఓకే కానీ లెంగ్త్ ఎక్కువైంది.

Published on Apr 18, 2015 1:20 PM IST
Varadhi

విడుదల తేదీ : 17 ఏప్రిల్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : సతీష్ కార్తికేయ

నిర్మాత : పి. వివేకానంద వర్మ

సంగీతం : విజయ్ గోర్తి

నటీనటులు : క్రాంతి, శ్రీ దివ్య, హేమంత్..

‘బస్ స్టాప్’ ఫేం శ్రీ దివ్య హీరోయిన్ గా, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, ఆ ఐదుగురు ఫేం క్రాంతి హీరోగా నటించిన సినిమా ‘వారధి’. సతీష్ కార్తికేయ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమాకి వివేకానంద శర్మ. చాలా రోజుల క్రితమే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురు చూసారు. సమ్మర్ కానుకగా ఈ కోల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని ఈ రోజు రిలీజ్ చేసారు. మరి ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

వైజాగ్ లో ఒకే కాలేజ్ లో చదువుకున్న గౌతమ్(హేమంత్) ఆరాధన(శ్రీ దివ్య)ని ప్రేమిస్తాడు. కాలేజ్ చివరి రోజున ఆరాధన వచ్చి గౌతమ్ కి ప్రపోజ్ చేస్తుంది. వీరి ప్రేమ మొదలైన కొద్ది నిమిషాలకే ఓ యాక్సిడెంట్ లో గౌతమ్ చనిపోతాడు. కట్ చేస్తే 6 సంవత్సరాల తర్వాత కథ హైదరాబాద్ లో మొదలవుతుంది. ఈ 6 సంవత్సరాలు ఆరాధన గౌతమ్ ప్రేమలోనే ఉంటుంది. అప్పుడే మన హీరో వినయ్(క్రాంతి) ఎంటర్ అవుతాడు. వినయ్ పక్కన వారిని బాధ పెట్టి ఆ బాధని ఎంజాయ్ చేసే ఓ సైకో, వినయ్ కి పక్కవాడికి హెల్ప్ చెయ్యడం అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వినయ్ ఓ రోజు ఆరాధనని చూసి ప్రేమలో పడతాడు.

ఎలాగోలా ఆరాధనని తన కంపెనీలో చేర్చుకొని కొద్ది రోజులకి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆరాధన రిజెక్ట్ చేస్తుంది. ఆ బాధలో తాగి వస్తున్న వినయ్ కి ఓ యాక్సిడెంట్ అవుతుంది. అప్పటి నుంచి వినయ్ కి ఆత్మలు కనిపిస్తుంటాయి. ఆ ఆత్మలు రోజు తమ కోరికలు తీర్చమని టార్చర్ చేస్తుంటాయి. ఆ ఆత్మలలో ఆరాధన ప్రేమించిన గౌతమ్ కూడా ఉంటాడు. వినయ్ కి ఆత్మలకి మధ్య జరిగిన ఓ సంఘటన వలన వినయ్ లో మార్పు వస్తుంది. అలా మార్పు వచ్చిన వినయ్ ఆత్మల కోసం ఏం చేసాడు.? అలాగే ఆరాధనని ప్రేమించిన గౌతమ్ కోసం ఏం చేసాడు.? అసలు గౌతమ్ చావుకి నిజమైన కారణం ఏంటి.? చివరికి వినయ్ – ఆరాధన ఒకటయ్యారా.? లేక స్నేహితుల్లా మిగిలిపోయారా అన్నది మీరు వెండితెరపై చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

‘వారధి’ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాల్సింది నటీనటులైన క్రాంతి, శ్రీ దివ్యల గురించి. సైకో అనగా ఎదుటి వారిని టార్చర్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చెయ్యగల పాత్రలో క్రాంతి పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. తన చేసిన వెటకారపు కామెడీ, డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. చాలా వరకూ ఇతని పాత్ర నవ్విస్తూ ఉంటుంది. ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేసాడు. ఇక శ్రీ దివ్య మన ఇంట్లో అమ్మాయిలా కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేసింది. వీరి తర్వాత ముఖ్య పాత్ర పోషించింది హేమంత్. హేమంత్ ఎక్కువ సేపు లేకపోయినా సినిమాకి చాలా కీలకం, బాగా చేసాడు కూడా.. హేమంత్ క్రాంతి మీద వేసే సెటైర్స్ బాగా నవ్వు తెప్పిస్తాయి.

సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త సరదాగా సాగిపోతుంటుంది. సినిమా స్టార్టింగ్ లో వచ్చే లవ్ ఎపిసోడ్ బాగుంటుంది. ఆ తర్వాత క్రాంతి క్యారెక్టర్ పరిచయం అయినప్పటి నుంచీ కాస్త వేగంగా ముందుకెళుతుంది. క్రాంతిని ఆత్మలు విసిగించే సీన్స్ బాగున్నాయి. శ్రీనివాస్ రెడ్డి కామెడీ ట్రాక్ బాగుంది. తను ఉన్నప్పుడు ఆడియన్స్ బాగానే ఎంటర్టైన్ అవుతారు. ఎంఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, రంఘనాథ్ లు తమ పాత్రల పరిధిమేర నటించారు. సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ని డైరెక్టర్ బాగా చెప్పగలిగాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో పాత్రలను జస్టిఫై బాగా చేసాడు. అలాగే డైలాగ్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ రన్ టైం. ఈ సినిమాని 139 నిమిషాలు సాగదీయకుండా 120 నిమిషాల్లో షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే హీరో పాత్ర ఎంతనేది చెప్పడానికి ఒక పాట 4 సీన్స్ సరిపోతాయి. అంతేకానీ 10 సీన్స్ రాయాల్సిన అవసరం లేదు, అలా ఉన్నాయి అంటే అవి కథకి భారం అవుతాయే తప్ప హెల్ప్ కావు. ఇలాంటి సీన్స్ వల్ల కొన్ని సీన్స్ బాగున్నా మధ్య మధ్యలో కొన్ని సీన్స్ మాత్రం బాగా బోరింగ్ గా అనిపిస్తాయి.

సెకండాఫ్ లో ఆత్మల కాన్సెప్ట్ ని అందరూ ఎంజాయ్ చేస్తుంటారు, కానీ ఆ ఆత్మల చుట్టూ రాసుకున్న సీన్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. అసలు విషయం ఏమిటంటే అసలు అతనికి ఆత్మలు ఏ కారణం వల్ల కనిపిస్తున్నాయి అనే దానికి అస్సలు లాజిక్ లేదు. జస్ట్ ఫాలో అయిపోవాలి అంతే. ఇకపోతే ఈ సినిమా 2008లో వచ్చిన ‘ఘోస్ట్ సిటీ’ అనే సినిమాకి కాపీ.. ఆ సినిమాకి హెల్ప్ అయ్యింది కంటిన్యూగా సాగే ఎంటర్టైన్మెంట్. కానీ మన నేటివిటీకి కథని మార్చి చెప్పేటప్పుడు అంత ఎంటర్టైనింగ్ గా చెప్పలేకపోయారు. ఏదో కమర్శియాలితీ కోసం క్లైమాక్స్ లో ఓ ఫైట్ ని పెట్టారు తప్ప అవసరం అనుకుంటే ఆ ఎపిసోడ్ లేకుండానే కథని కన్విన్సింగ్ గా చెప్పచ్చు.

సాంకేతిక విభాగం :

వారధి సినిమాకి రాజేంద్ర కేసాని అందించిన డీసెంట్ సినిమాటోగ్రఫీ బాగా హెల్ప్ అయ్యింది. ఇచ్చిన లోకేషన్స్ ని బాగా చూపించాడు. ముఖ్యంగా రుషి కొండ బీచ్ లో షూట్ చేసిన ఫస్ట్ సీన్ ని చాలా బాగా తీసాడు. విజయ్ గోర్తి మ్యూజిక్ కూడా బాగుంది. పాటల్లో మీనింగ్ ఉంది, రీ రికార్డింగ్ లో ఫీలింగ్ ఉంది. సో సినిమాకి హెల్ప్ అయ్యింది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ పెద్దగా బాలేదు. ఆయన ఇంకాస్త కీర్ తీస్కొని డైరెక్టర్ తో పోట్లాడి అయినా రన్ టైం తగ్గించాల్సింది. అలాగే డైలాగ్స్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయి.

కథ, కథనం, డైరెక్షన్ విభాగాలను డీల్ చేసింది సతీష్ కార్తికేయ. కథ – హాలీవుడ్ మూవీ నుంచి స్ఫూర్తి తీసుకోకుంది కావున కొత్తది అని చెప్పలేను, స్ఫూర్తి వరకూ ఓకే కథా విస్తరణలో లాగింగ్ సీన్స్ లేకుండా చూసుకోవాల్సింది. కథనం – అంత ఆసక్తి గాలేదు. ఊహాజనితంగానే ఉంటుంది. డైరెక్షన్ – ఒక పాయింట్ ని స్ఫూర్తి తీసుకోవడంలో తప్పు లేదు కానీ సినిమాలోని చాలా సీన్స్ ని అలానే తీసుకొని ముందుకు వెళ్ళడంలోనూ తప్పు లేదు, కానీ ఒరిజినల్ కాన్సెప్ట్ లోని మేజిక్ ని రిపీట్ చేయలకేపోతేనే సమస్య వస్తుంది. అదే ఇక్కడ జరిగింది. సతీష్ కార్తికేయ 50% మాత్రమే సక్సెస్ అయ్యాడు. పి. వివేకానంద వర్మ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓ రెగ్యులర్ ప్రేమకథలో ఆత్మలు, వాటి కోరికలు అనే పాయింట్ ని మిళితం చేసి కాస్త కొత్తదనంకోసం ట్రై చేసిన సినిమా ‘వారధి’. ఇదొక హాలీవుడ్ కథకి స్ఫూర్తి అయినా తెలుగులో చాలా వరకూ బాగానే చెప్పడానికి ట్రై చేసాడు. కానీ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పి ఉంటే బాగుండేది. వారధిలో కామెడీ పొట్ట చెక్కలయ్యేంత లేదు కానీ ఓ మోస్తరుగా ఉంది, కానీ ఎమోషన్స్ మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకునేంత ఉన్నాయి. నటీనటుల పెర్ఫార్మన్స్, ఎమోషన్స్, అక్కడక్కడా కామెడీ ఈ సినిమాకి మేజర్ ప్లస్ అయితే ఊహాజనితమైన ఫస్ట్ హాఫ్, రన్ టైం, చెప్పాల్సిన దానికన్నా ఎక్కువ చెప్పడం లాంటివి మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా ‘వారధి’ సినిమా కొంతమందికి యావరేజ్ అనిపిస్తుంది, కొంతమందికి బాగుంది అనిపిస్తుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు