
మారుతున్న ట్రెండ్ తో పాటు టాలీవుడ్ లో సినిమా టైటిల్స్ సెలక్షన్ కూడా మారుతోంది. దర్శకులు కూడా తమ సినిమాలకు టైటిల్స్ నుంచే ఆకర్షణ లభించాలని, అలాగే టైటిల్ వినగానే ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో డిఫరెంట్ టైటిల్స్ పెడుతున్నారు. ఇలా పెడుతున్న వారి లిస్టులో తాజాగా దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా వచ్చి చేరారు. దాసరి తన 151 వ సినిమాని మంచు విష్ణుతో చేయనున్నాడని ఇదివరకే తెలియజేశాం.
ఈ సినిమాకి దాసరి ‘ఎర్ర బస్సు’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇటీవలే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా జూలై 24 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. మంచు విష్ణు సరసన కేథరిన్ ట్రేస హీరోయిన్ గా నటించనుంది. తాతా – మనవడు మధ్య ఉండే అనుబంధాన్ని చూపించే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళంలో విజయం సాధించిన ‘మంజపై’ సినిమాకి రీమేక్. ఈ సినిమాకి సంబందించిన పూర్తి విశేషాలు త్వరలో అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.