ఉగాది రోజున.. నాని vs నాని!

ఉగాది రోజున.. నాని vs నాని!

Published on Mar 17, 2015 3:38 AM IST

Yevade-Subramanyam
‘అష్టాచమ్మా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నాని.. ఆ తర్వాత అనతికాలంలోనే వరుస హిట్లతో దూసుకువచ్చాడు. గత కొన్నాళ్ళుగా ఒక మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ అనుకున్నంత స్థాయిలో ఆ సినిమాలు సక్సెస్ సాధించట్లేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని కొత్త దర్శకుడితో ఒక కొత్త తరహా సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’తో ఉగాది రోజున మన ముందుకు వస్తున్నాడు. విచిత్రమేంటంటే నాని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇప్పటికీ విడుదలకు నోచుకోని సినిమా కూడా ‘ఎవడే సుబ్రమణ్యం’తో పాటే విడుదల కానుండడం. ఆ సినిమాయే.. ‘జెండాపై కపిరాజు’. ఈ రెండు సినిమాలూ ఉగాదికే విడుదలకు సిద్ధమవ్వడం ఆసక్తికరమైన అంశం.

నాగ అశ్విన్ దర్శకత్వంలో, ప్రియాంక దత్ నిర్మించిన ‘ఎవడే సుబ్రమణ్యం’.. ఎన్నో ప్రయాసలకోర్చి నిర్మించబడింది. ఈ సినిమాను ఉగాది రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా యూనిట్ మొత్తం సరికొత్త ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాను జనాల్లోకి తీసుకెళుతుంది. ఇక ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలతో ఆగిపోయిన జెండాపై కపిరాజుకు చివరకు విడుదల మోక్షం కలిగింది. ఈ సినిమా కూడా ఉగాది రోజునే విడుదల కానుంది. అయితే జెండాపై కపిరాజు వాయిదా పడే అవకాశముందని హీరో నాని చెప్పినా, రెండు సినిమాలకు సంబంధించిన రిలీజ్ పోస్టర్స్ కూడా ఇప్పటికే విడుదలైపోవడంతో ఇక రెండు సినిమాలూ పోటీలో ఉండడమనేది ఖాయంగా కనిపిస్తోంది. మరి చివరకు ఏమైనా మార్పులు జరుగుతాయా ? లేక రెండూ ఒకే రోజు విడుదల అవుతాయా ? అన్నది వేచి చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు