త్వరలోనే సెట్స్‌పైకి ‘గబ్బర్ సింగ్ 2’!

త్వరలోనే సెట్స్‌పైకి ‘గబ్బర్ సింగ్ 2’!

Published on Mar 30, 2015 9:45 PM IST

All-set-for-Gabbar-Singh-2
పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి దాదాపుగా రెండు నెలలు దాటింది. ఇక పూర్తి స్థాయి హీరోగా చేసిన చిత్రం విడుదలై దాదాపుగా సంవత్సరం పైనే అయిపోయింది. 2013లో అత్తారింటికి దారేది చిత్రం ద్వారా చివరగా మన ముందుకు వచ్చిన పవన్, మధ్యలో ఒక అతిథి పాత్రలో ‘గోపాల గోపాల’ సినిమాలో నటించాడు. కాగా ఆయన ఇప్పటివరకూ వేరొక సినిమా షూటింగ్‌ మొదలుపెట్టిన దాఖలాలు లేవు. సూపర్ హిట్ ‘గబ్బర్ సింగ్’‌కు సీక్వెల్‌గా గబ్బర్ సింగ్ 2ను అనౌన్స్ చేసినా ఆ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ళలేదు.

’గబ్బర్ సింగ్ 2’ సెట్స్‌పైకి వెళ్ళడం అటుంచితే.. ఈ ప్రాజెక్టుకు దర్శకులు మాత్రం మారుతూ వస్తుండడం విశేషం. చివరకు ‘పవర్’ సినిమా ద్వారా హిట్‌ కొట్టిన బాబీని దర్శకుడిగా ఫైనల్ చేశారు. ఈమధ్య కాలంలో ఇన్ని మార్పులకు గురైన సినిమా బహుశా ఇదే కావొచ్చు! ఒకానొక దశలో గబ్బర్ సింగ్ ఆగిపోయిందనే పుకార్లు కూడా వినిపించాయి. అయితే.. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయట. ఏప్రిల్ చివరి వారంలో కానీ, మే మొదటి వారంలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు