
ఏప్రిల్ 7న వచ్చే కోర్టు తీర్పుతో ‘మా’ ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టత వస్తుందనుకున్నవారికి మళ్ళీ చేదు వార్తే! ఇప్పటికిప్పుడు ‘మా’ ఎన్నికల ఫలితాలు లేనట్టేనా ? అంటే మిగిలేది అవుననే సమాధానమే! తెలుగు సినీ పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ‘మా’ అసోసియేషన్‌కు ఎన్నికలు ఎక్కువ సార్లు ఏకగ్రీవంగానే జరిగాయి. గత రెండు దఫాలుగా మా అధ్యక్ష పదవిలో ప్రస్తుత ఎంపీ మురళీ మోహన్ కొనసాగుతున్నారు. రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఆయన మళ్ళీ ఈ పదవిని చేపట్టే ఆలోచన చేయలేదు. ఆ క్రమంలోనే 2015-17 దఫాకు రాజేంద్రపసాద్ పోటీలో నిలబడ్డారు. మొదట ఏకగ్రీవంగా రాజేంద్రుడే గెలుస్తారని భావించినా చివర్లో ప్రముఖ నటి జయసుధ కూడా రంగంలోకి దిగడంతో పోటీ తప్పనిసరైంది.
ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం, సవాళ్ళు విసురుకోవడంతో ఈ ఎన్నికల తంతు సామాన్యుడికీ హాట్ టాపిక్‌గా మారింది. ఇక మార్చి 29న ఈ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే ఎన్నికలు ముగిసి ఇన్ని రోజులైనా దీనికి సంబంధించిన కేసొకటి కోర్టు పరిధిలో ఉన్నందున ఫలితాలు వెలువడలేదు. అప్పట్లో ‘మా’ ఎన్నికలను నిలిపివేయాలని కోర్టులో వేసిన ఓ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు, ఎన్నికల నిర్వహణను నిలిపివేయడాన్ని తోసిపుచ్చింది. అయితే.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఫలితాలు ప్రకటించకూడదని తెలిపింది. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన విచారణ ఈరోజు కూడా వాయిదా పర్వంతోనే ముగిసింది. తాజాగా ఈ కేసు ఏప్రిల్ 9కి వాయిదా పడింది. ఏప్రిల్ 9న వచ్చే తీర్పు ప్రకారం ‘మా’ ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.

