
టాలీవుడ్ తో పాటు యావత్ భారతదేశ చిత్ర పరిశ్రమ ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రాఫికల్ వండర్ ‘బాహుబలి’. దాదాపు రెండు సంవత్సరాల పాటు నిర్విరామంగా జరిగిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్న ఈ సినిమా ఆడియో మరియు ట్రైలర్ ని మే 31న రిలీజ్ చేసి సినిమాని జూలై 10న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఆడియో రిలీజ్ కి ఒక నెల ముందు నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ సినిమాలోని నటీనటుల లుక్ మరియు వారి పాత్రల పేర్లను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.
ఈ సినిమా థీమ్ పోస్టర్ వదిలినప్పటి నుంచి నిన్న వదిలిన భళ్లాలదేవా లుక్ వరకూ అన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా నటీనటుల లుక్ మరియు పాత్రల వివరణ చూసి మన పురాణాలలో బాగా ఫేమస్ అయిన కొంతమందిని పాత్రలని చూసి స్ఫూర్తి తీసుకున్నారని, అలాగే బాహుబలి కాన్సెప్ట్ పోస్టర్ కి యమునా నదిపై ఉండే చిన్ననాటి శ్రీకృష్ణుడి కథ నుంచి స్ఫూర్తి పొందారు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ వీటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టడం కోసం ఈ చిత్ర నిర్మాతల ఒకరైన శోభు యార్లగడ్డ ముందుకు వచ్చి ‘బాహుబలి సినిమాలోని ఏ పాత్రని మరియు ఏ సన్నివేశాన్ని మన పురాణాల నుంచి స్పూర్తిగా తీసుకోలేదు. బాహుబలి ఓ కొత్త కథ. దీనికి ఏ పురాణాలకి సంబంధం ఉండదని’ తెలియజేశాడు.
టాలీవుడ్ స్టార్స్ అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా లను ప్రధాన పాత్రలో పెట్టి సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాని తెరకెక్కించాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మించారు.

