అందుకే ‘బాహుబలి’ ఆడియో రిలీజ్ వాయిదా వేశాం : రాజమౌళి

అందుకే ‘బాహుబలి’ ఆడియో రిలీజ్ వాయిదా వేశాం : రాజమౌళి

Published on May 28, 2015 12:30 PM IST

rajamouli-prabhas

‘బాహుబలి’ అభిమానులకు ఈనెల 31వ తేదీ విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాము ఎంతగానో ఎదురుచూస్తూన్న బాహుబలి ట్రైలర్, ఆడియోలను ఆరోజే విడుదల చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్, ఆడియో కోసం ఇప్పట్నుంచే సిద్ధమైన అభిమానులకు ఇది చేదు వార్త. బాహుబలి ఆడియో రిలీజ్ వేడుకను వాయిదా వేశారు.

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి ది బిగినింగ్‌’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక వాయిదా పడింది. హైద్రాబాద్‌లోని హైటెక్స్‌ ఓపెన్ గ్రౌండ్స్‌లో అభిమానుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించాలనుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో పోలీసులు కొన్ని పరమితులు విధించడంతో ఆడియో రిలీజ్ వాయిదా వాయిదా వేశారు.

ఇదే విషయమై రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ.. “ముందుగా ప్రభాస్ అభిమానులకు, బాహుబలి అభిమానులందరికీ క్షమాపణలు. అంతా అనుకున్నట్టుగా జరిగితే మే 31న పెద్ద ఎత్తున బాహుబలి ఆడియో రిలీజ్ జరిగేది. ఓపెన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఆడియో ఫంక్షన్ల విషయంలో గతంలో జరిగిన కొన్ని బాధాకర సంఘటనలను దృష్టి పెట్టుకొని పోలీసులు కొన్ని పరిమితులు విధించారు. ప్రభాస్ కోసం గత రెండేళ్ళుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎంతో మంది అభిమానులు హజరయ్యే ఇలాంటి వేడుకలో ఏదైనా జరగరానిది జరిగితే అందరం బాధపడాల్సి ఉంటుంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అభిమానులు నిరుత్సాహ పడతారని తెలిసినా ఆడియో రిలీజ్‌ను వాయిదా వేశాం. ఈ సాయంత్రం గానీ, రేపు గానీ తరువాతి ప్లాన్స్ గురించి తెలియజేస్తాం” అని అన్నారు

ఇక యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. “బాహుబలి ఆడియో కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. అయినా ఆడియో రిలీజ్‌ను వాయిదా వేయక తప్పడం లేదు. ట్రైలర్, ఆడియో, సినిమా చూసినతర్వాత ఈ రెండేళ్ళ ఎదురుచూపును ఇట్టే మరచిపోతారని మాత్రం కచ్చితంగా చెప్పగలను” అన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న శోభు యార్లగడ్డ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్, ప్లాన్ గురించి మరింత సమాచారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా సినిమా యూనిట్ తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు