చెన్నైలో జరిగిన ‘వీధి తిరువిళా’ 13వ ఎడిషన్ వేడుకలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ముఖ్య అతిథిగా పాల్గొని ‘జాకీ (Jockey)’ సినిమా టీజర్‌ను ఆవిష్కరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా ‘గోట్ ఫైట్’ ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
గతంలో ‘మడ్డీ’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని అందించిన పి.కె.7 స్టూడియోస్, దర్శకుడు డా. ప్రగభల్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది. ప్రేమ కృష్ణదాస్, సి. దేవదాస్, జయ దేవదాస్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యువన్ కృష్ణ, రిదాన్ కృష్ణాస్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శక్తి బాలాజీ సంగీతం అందిస్తున్నారు.
మధురై గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సంప్రదాయ పొట్టేలు పందెాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సన్నివేశాల్లో సహజత్వం కోసం చిత్ర బృందం అక్కడి ప్రాంతంలోనే మూడేళ్లపాటు ఉండి పరిశోధన చేసింది. నటీనటులు కూడా నిజమైన పొట్టేళ్లతో ప్రత్యేక శిక్షణ తీసుకోవడం విశేషం. గ్రామీణ ప్రజల భావోద్వేగాలు, నేటివిటీ మిస్ కాకుండా ఈ చిత్రాన్ని మలిచామని చిత్ర యూనిట్ తెలిపింది.


