అలనాటి నటి శారద ఆరున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విలక్షణమైన పాత్రలు పోషించి అలరించారు. కాగా శారద మలయాళ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గానూ కేరళ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత సినిమా పురస్కారం ‘జేసీ డానియల్ అవార్డు – 2024’కు ఆమె ఎంపికైన సంగతి తెలిసిందే. ఈనెల 25న తిరువనంతపురంలో జరగనున్న కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా శారద ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు.
ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ.. ‘మలయాళ ప్రేక్షకులు నాపై చూపించిన ఈ ప్రేమను నా ఆఖరి శ్వాస వరకు మర్చిపోను. వాళ్లు లేకపోతే నేను లేను. కెరీర్ ఆరంభంలో తెలుగులో నేను కొన్ని చిత్రాల్లో కామెడీ వేషాలు వేశాను. అపుడు మలయాళ పరిశ్రమలోనే నాకు అవకాశాలు వచ్చాయి. మలయాళ సినిమా ఇండస్ట్రీనే నన్ను ఓ స్టార్ నటిగా నిలబెట్టింది. ఇక నేను మా అమ్మ ప్రోత్సాహంతోనే నటన వైపు వచ్చాను. నటిగా నాకింత పేరు ప్రఖ్యాతులు, అవార్డులు ఏవి దక్కాయన్నా అన్నీ అమ్మ చలవే’ అని శారద తెలిపారు.
.


