ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్వెల్ అభిమానులకు పండగ లాంటి వార్త. అందరి ఫేవరెట్ సూపర్ హీరో ‘స్పైడర్ మ్యాన్’ సరికొత్త అవతారంలో మన ముందుకు రాబోతున్నాడు. భారీ అంచనాల మధ్య ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ అధికారిక ట్రైలర్ విడుదలైంది. న్యూయార్క్ సిటీలో సూర్యోదయం వేళ, ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైనుంచి హీరో టామ్ హాలండ్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. వేలాది మంది అభిమానుల మధ్య జరిగిన ఈ ఈవెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈసారి పీటర్ పార్కర్ జర్నీ మునుపటి కంటే మరింత సీరియస్, ఎమోషనల్‌గా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.
గతంలో వచ్చిన ‘స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా ముగిసిన నాలుగేళ్ల తర్వాత ఏం జరిగిందనే పాయింట్‌తోనే ఈ ‘బ్రాండ్ న్యూ డే’ కథ మొదలవుతోంది. తనను ప్రేమించే వాళ్ళ జీవితాల నుంచి, వారి జ్ఞాపకాల నుంచి పూర్తిగా దూరమైపోయాడు పీటర్ పార్కర్. ఇప్పుడు అతను ఒంటరి. పీటర్ అనే పేరు కూడా ఆ సిటీకి గుర్తులేదు. కేవలం స్పైడర్‌మ్యాన్‌గా మాత్రమే బతుకుతూ న్యూయార్క్ నగరానికి ఫుల్ టైమ్ రక్షకుడిగా మారాడు.
ఈ క్రమంలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త శత్రువు సిటీపై పంజా విసురుతాడు. హీరో శక్తి సామర్థ్యాలకు మించిన ఈ పవర్‌ఫుల్ విలన్‌ను ఒంటరిగా స్పైడర్‌మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా మెయిన్ థీమ్. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ బ్లాక్‌బస్టర్‌లో టామ్ హాలండ్ సరసన జెండయా మరోసారి మెరవనుంది. జాకబ్ బాటలన్, జోన్ బెర్న్తల్, మార్క్ రఫెలో వంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.
సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఇది థియేటర్లలో సందడి చేయనుంది. మునుపెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్‌లు, ఊహించని ట్విస్టులతో రాబోతున్న ఈ సినిమా కోసం సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


