ప్రత్యేక ఇంటర్వ్యూ : మధుర శ్రీధర్ – పరీక్షా ఫలితాల వల్ల లైఫ్ ని డిసైడ్ చెయ్యలేము..

ప్రత్యేక ఇంటర్వ్యూ : మధుర శ్రీధర్ – పరీక్షా ఫలితాల వల్ల లైఫ్ ని డిసైడ్ చెయ్యలేము..

Published on Mar 13, 2013 8:30 PM IST

Madhura-Sreedhar
‘మధుర’ ఆడియో కంపెనీ ద్వారా ఇండస్ట్రీకి బాగా పరిచయమున్న మధుర శ్రీధర్ ‘స్నేహ గీతం’ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాతో దర్శకుడిగా మారి ప్రేక్షకుల మెప్పును పొందాడు. తన దర్శకత్వంలో రాబోయే ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మహాత్ రాఘవేంద్ర, పియా బాజ్పాయ్, అర్చన కవి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా మధుర శ్రీధర్ ని మేము కలిసి ప్రత్యేకంగా ముచ్చటించాము. ఆయన తనకున్న లిమిట్స్ గురించి, తన రాబోయే సినిమాల గురించి, ఇండియాలో సోషల్ బాధ్యత మీద అతనికున్న కోరికల గురించి మాతో పంచుకున్నారు. ఆ వేశేషాలు మీ కోసం…

ప్రశ్న) మరి కొద్ది రోజుల్లో ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ విడుదల కాబోతోంది. ఈ సినిమా గురించి ఎలా ఫీలవుతున్నారు?

స) ఇన్ని రోజులు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కానీ రిలీజ్ కి దగ్గరయ్యే కొద్దీ నా కడుపులో సీతాకోకచిలుకలు తిరగడం మొదలు పెట్టాయి ఎందుకంటే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. నా వృత్తి పరంగా ఈ సినిమా నాకు చాలా ముఖ్యమైనది. ఈ సినిమా మీదే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ మా చేతిలో ఓ మంచి సినిమా ఉందని నమ్మకంగా ఉన్నాము, అలాగే ఈ సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చాలా బాగుందని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.

ప్రశ్న) మీ సినిమాలు చాల క్లాస్ గా మల్టీప్లెక్స్ క్రౌడ్స్ ని ఆకట్టుకునేలా ఉంటాయి. ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ తో ఆ మార్కెట్ ని మరింత పెంచుకోవడానికి ట్రై చేసారా?

స) (నవ్వుతూ) కొంతవరకూ అయితే అవుననే చెప్పాలి. ఈ సినిమాలో మొదటి సారి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ట్రై చేసాను, ముఖ్యంగా కామెడీ డిపార్ట్ మెంట్ ని ఎక్కువగా టచ్ చేసాను. ఈ సినిమాకి బ్రహ్మానందం, అలీ పాత్రలు సినిమాకి ప్రధాన హైలైట్. అలా అని అవుట్ అండ్ అవుట్ మసలా ఫిల్మ్ తియ్యలేదు. మేకింగ్ లో నా స్టైల్, సున్నితంగా భావోద్వేగాలు మిస్ కాకుండా సినీ ప్రేమికులకు నచ్చేలా కొన్ని కొన్ని మార్పులు చేసుకొని తీశాను.

ప్రశ్న) ఈ సినిమాని భారీగా రిలీజ్ చెయ్యడానికి టార్గెట్ చేసారా?

స) అవును. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 200 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. నా గత సినిమాలతో పోల్చుకుంటే ఇది భారీ రిలీజ్ అనే చెప్పాలి.

ప్రశ్న) ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ ఏమవుతుందనుకుంటున్నారు?

స) అనుకున్న స్టొరీ లైన్ మరియు మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్స్. ఒక్క ఎగ్జామ్స్ ద్వారానే లైఫ్ ని జడ్జ్ చెయ్యలేము. ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే మనిషి లైఫ్ లో ఫెయిల్ అవుతాడని అనలేము. అదే ఈ సినిమాలో చెప్పాలనుకున్నాను.ఈ సినిమా కార్తీక్ అనే ఓ కుర్రాడి రియల్ స్టోరీ ఆధారంగా తీశాను. అతను చాలా డిప్రెషన్ స్టేజ్ లో కెరీర్ గైడెన్స్ కోసం నా దగ్గరకి వచ్చాడు.అతను 16 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు కానీ ఆటో కాడ్ లో మంచి నైపుణ్యం ఉంది. నేను ఆటో కాడ్ ట్రైనింగ్ సెంటర్ పెట్టమని సలహా ఇచ్చాను ఇప్పుడు అతను నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు.

ప్రశ్న) ఈ సినిమాని ఎగ్జామ్స్ సీజన్ లో వదులుతున్నారు. రిజల్ట్ ఎలా ఉంటుందా అని మీరేమన్నా భయపడుతున్నారా?

స) అస్సలు లేదండి.. ఇంకా ఈ సినిమా ఎగ్జామ్స్ టైం లో రిలీజ్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఎగ్జామ్స్ అనే స్ట్రెస్ ఫుల్ పీరియడ్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ 18 కి , అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ 19 కళా అయిపోతాయి. ఆ టైంలో స్టూడెంట్స్ అందరికీ నా సినిమా చూసి రిలాక్స్ అవుతారు. ఎప్పుడైనా స్టూడెంట్స్ స్ట్రెస్ ఫ్రీ తో, కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాలి. ‘ అమ్మాయి/ అబ్బాయి ఎవరైనా సరే 50% సిలబస్ కంప్లీట్ చేసి కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్స్ కి వెళితే చాలు 80% చదివిన వారికంటే ఎక్కువ సక్సెస్ అయ్యే అవావకాశం ఉందని’ మా నాన్నగారు చెబుతుండేవారు.

ప్రశ్న) మీరు విక్కీ డోనర్ సినిమాని రీమేక్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.. దాని గురించి మరికొన్ని విశేషాలు చెప్పగలరా?

స) ఈ విషయంపై మార్చి 15 తర్వాత పూర్తి క్లారిటీకి వస్తాను. ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమా సక్సెస్ మీద ఆ సినిమా బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతుందా లేక లో బడ్జెట్టా అనేది డిసైడ్ అవుతుంది. అలాగే నటీనటులు మొదలైన వివరాలు కూడా ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సక్సెస్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. అలాగే నేను డా. ఎం.వి.కె రెడ్డి తో మూడు సినిమాలు చేయాలని అగ్రిమెంట్ ఉంది.

ప్రశ్న) మహాత్ రాఘవేంద్ర, పియా బాజ్పాయ్, అర్చనా కవిల నటనకు మీరు ఎంతెంత రేటింగ్ ఇస్తారు?

స) మహాత్ ఫుల్ ఎనర్జిటిక్ కుర్రాడు. స్వతహాగా అతను తెలుగు వాడే అయినప్పటికీ చిన్నప్పటి నుంచి చెన్నైలోనే పెరిగాడు. ఈ సినిమాలో నేననుకున్న పాత్ర చాలా కేర్ లెస్ గా, ఆకతాయిగా ఉండాలి దానికి పర్ఫెక్ట్ గా సరిపోయాడు , అలాగే పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. అర్చన కవి – పియా బాజ్పాయ్ వాళ్ళ నుంచి నేను ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఆశించానో అంతే ఇచ్చారు. ముగ్గురూ బాగా చేసారు.

ప్రశ్న) బ్రహ్మానందం, అలీ సినిమాలో ఎక్కడ ఫిట్ చేసారు?

స) బ్రహ్మానందం, అలీ ఇద్దరూ జీనియస్లు అని చెప్పాలి. వీరిద్దరి పాత్రలు సినిమాకి చాలా బలాన్నిస్తాయి, అలాగే వీరి పాత్రలు సెకండాఫ్ లో వస్తాయి. వాళ్లకి ఎంతో అనుభవం ఉంది అందుకే వారితో పనిచేయడం చాలా ఈజీగా అనిపించింది. గతంలో నేను చాలా కొత్తవారితో పనిచేసాను, వారి నుంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. బ్రహ్మానందం, అలీ పెర్ఫార్మన్స్ చేస్తుంటే నాకు చాలా ఈజీగా అనిపించింది

ప్రశ్న) ఈ సినిమా ప్రీమియర్ షోకి చేతన్ భగత్ వస్తున్నాడా?

స) రేపు ప్రదర్శించబోయే ప్రీమియర్ షోకి చేతన్ భగత్ రావటం లేదు, ప్రస్తుతం అతను కొంచెం బిజీగా ఉన్నాడు. కానీ త్వరలోనే వేరే ఒక కారణం మీద అతనిని హైదరాబాద్ కి తీసుకోస్తున్నాను. 2014 ఎన్నికలు ఇండియాకి చాలా కీలకం కానున్నాయి. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం దేశంలో ఓటు వెయ్యడానికి ఆస్కారమున్న 30 లక్షల మందికి ఓటర్ ఐడి లేదు. అలాగే సుమారు 200 నియోజకవర్గాల ఓటింగ్ పై రీసెర్చ్ చేస్తే గెలిచిన – ఓడిన వారి మధ్య తేడా కేవలం 3000 – 4000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కావున త్వరలోనే చేతన్ భగత్ ఓటు హక్కు లేని వారు వెంటనే ఓటర్ ఐడి కోసం రిజిస్టర్ చేసుకొని ఓటర్ ఐడి తెచ్చుకునేందుకు ఒక స్ఫూర్తి దాయకమైన ప్రసంగాన్ని ఇప్పించానున్నాను . ఈ కార్యక్రమానికి మరికొందరు పెద్ద వారిని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను.

ప్రశ్న) చూస్తుంటే మీకు రాజకీయాల పట్ల మంచి అవగాహన ఉన్నట్లుంది. పొలిటికల్ థీం మీద ఒక సినిమా తీయొచ్చు కదా?

స) ఖచ్చితంగా 2014 ఎన్నికల్లోపు పొలిటికల్ థీం మీద ఓ సినిమా చేస్తాను. ఇది కొత్త వారితో ఎంటర్టైనింగ్ గా సాగే సినిమా కానీ థీం లైన్ మాత్రం పాలిటిక్స్. భవిష్యత్తులో ఇండియాని మరింత అభివృద్ధి చేయడానికి యువత సామాజిక భాధ్యత తీసుకొని రాజకీయాల్లోకి రావాలి. అభివృద్దిలో భారతదేశం చాలా వెనుకబడింది, గత కొన్ని సంవత్సరాలుగా అసలు అభివృద్ధి అనేదే లేదు. నాకు వీలైనంత వరకూ ఎంతో కొంత యూత్ ని చైతన్య వంతుల్ని చేయడానికి ట్రై చేస్తున్నాను.

ప్రశ్న) ఈ రోజుల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా తక్కువగా కనిపిస్తోంది….

స) మీరన్నది చాలా నిజం.. మనమే మన చుట్టూ ఏమి జరుగుతోంది అనేది తెలియజేయాలి. మనం తీసుకునే చిన్న చిన్న స్టెప్స్ కూడా మార్పులు తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి .. పురాతన నలంద విశ్వవిద్యాలయ వినాశనం గురించి ఓ పెద్ద పురాణం ఉంది. బార్బేరియన్లు యూనివర్సిటీ పై దాడి చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ యూనివర్సిటీ మొత్తం మీద 50,000 స్టూడెంట్స్ ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు ఎవరికీ వారే అనుకోకపోయి ఉంటే ఆ వినాశనం జరిగి ఉండేది కాదు. ‘ అందరూ ఎవరికీ వారే మనకెందుకులే అనుకున్నారట.. మనకెందుకులే అనుకోవటం అనేది ఆ రోజు నుండే అలవాటై పోయింది’.

ప్రశ్న) సినిమాలు తీయడం కాకుండా మిగిలిన మీ సమయాన్ని ఎలా గడుపుతారు?

స) నేను యువతకి వారు కెరీర్లో ఏమి చెయ్యాలి, రెస్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మొదలైన అంశాల మీద గైడెన్స్ ఇస్తుంటాను. ఇది నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ప్రతి శనివారం లేదా ఆదివారం మా ఇంటి ఎదురుగా ఉన్న పార్క్ లో ఓ సెషన్ ఉంటుంది. చాలా మంది జర్నలిస్టులు తమ పిల్లలకు గైడెన్స్ కావాలంటే నా దగ్గరికి పంపిస్తుంటారు.

ప్రశ్న) మా పాఠకులకి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా?

స) నేను నాన్సెన్స్ లేకుండా ఉండేలా ఓ సినిమా తీయడానికి ట్రై చేసాను. ఈ సినిమా ద్వారా రెండు పాయింట్స్ చెప్పాలనుకున్నాను. మొదటిది – ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే అతను లైఫ్ లో ఫెయిల్ అయినట్టు కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అది ఏంటో తెలుసుకొని డెవలప్ చేసుకుంటే చాలు. ఇక రెండవది – ప్రతి ఒక్కరికీ సమాజం పట్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అది మన సామాజిక హక్కు.

అంతటితో మధుర శ్రీధర్ గారితో మా ఇంటర్వ్యూ ముగిసింది. దాపరికంలేని ఆయని మాటలు, అలాగే సమాజం పట్ల అతనికున్న రెస్పాన్సిబిలిటీతో మాకు అతని పై చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. మీరు కూడా ఈ ఇంటర్వ్యూని బాగా ఎంజాయ్ చేసారని ఆశిస్తున్నాం.

రాఘవ

Click here for  English Interview

సంబంధిత సమాచారం

తాజా వార్తలు