మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఇంకో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే చిత్ర యూనిట్ కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు.
భోపాల్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కాగా, బెంగళూరు ప్రెస్ మీట్‌లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హాజరై పవన్ కళ్యాణ్‌ను తలుచుకోవడంతో ఆ ఈవెంట్ కూడా సక్సెస్ అయ్యింది. మరోవైపు డైరెక్టర్ బుచ్చిబాబు డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసే పనిలో యమ బిజీగా ఉన్నాడు. అయితే, ఈ సినిమా ప్రీమియర్ షోల విషయంలో మెగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.600 ఫ్లాట్ రేట్‌తో స్పెషల్ షోల అనుమతులకు లైన్ క్లియర్ కానున్నట్లు సినీ సర్కిల్స్ సమాచారం. కానీ, తెలంగాణలో ఎగ్జిబిటర్ల డిమాండ్లు, టికెట్ ధరల వివాదం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.
ఒకవేళ ఏపీలో ముందుగా షోలు వేసి, తెలంగాణలో ఆలస్యమైతే సోషల్ మీడియా స్పాయిలర్స్ వల్ల సినిమా టాక్ దెబ్బతినే ప్రమాదం ఉంది. గతంలో ‘దేవర’ చిత్రానికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. ఈ డ్యామేజ్ ‘పెద్ది’కి జరగకూడదంటే రెండు రాష్ట్రాల్లో ఒకేసారి షోలు పడేలా నిర్మాత ఈ నెలాఖరులోగా వివాదాన్ని సెటిల్ చేయాల్సి ఉంది. మరి ఫ్యాన్స్‌కు టెన్షన్ పెట్టిస్తున్న ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో చూడాలి.


