సమీక్ష : 16 – ఆద్యంతం ఆకట్టుకున్న క్రైమ్ థ్రిల్లర్

సమీక్ష : 16 – ఆద్యంతం ఆకట్టుకున్న క్రైమ్ థ్రిల్లర్

Published on Mar 10, 2017 7:15 PM IST
16 movie review

విడుదల తేదీ : మార్చి 10, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం :కార్తిక్ నరేన్

నిర్మాతలు :చదలవాడ పద్మావతి

సంగీతం :జెక్స్ బిజోయ్

నటీనటులు :రహమాన్

ఈ మధ్య కోలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించిన సినిమాల్లో ‘ధృవంగల్ పతిన్నారు’ కూడా ఒకటి. యువ దర్శకుడు కార్తీక్ నరేన్ కేవలం 28 రోజుల్లో తెరకెక్కించిన ఈ చిత్రం తమిళంలో గతేడాది డిసెంబర్ 29న విడుదలై ఇప్పటికీ దిగ్విజయంగా నడుస్తోంది. అంతటి ఘన విజయం సాధించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ను టాలీవుడ్ ప్రేక్షకులకు అందించాలన్న ఉదేశ్యంతో చదలవాడ పద్మావతి ’16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌’ పేరుతో తెలుగులోకి అనువదించారు. మరి ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

దీపక్ అనబడే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ద్వారా ఈ కథ మొదలవుతుంది. పోలీస్ ఆఫీసర్ కావాలని ఆశపడే ఒక యువకుడు దీపక్ దగ్గరకు వచ్చి అసలు పోలీస్ ఉద్యోగం ఎలా ఉంటుందని, పోలీస్ అంటే ఎలా ఉంటాడు అనేది తెలుసుకోవాలనుకుంటాడు. కానీ అప్పటికే ఒక కేసు విషయంలో తన కాలును కోల్పోయిన దీపక్ పోలీస్ ఉద్యోగంలో చేరవద్దని ఆ యువకుడికి చెప్తూ 5 ఏళ్ల క్రితం తను ఇన్వెస్టిగేషన్ చేసిన ఒక కేసును గురించి వివరించడం మొదలుపెడతాడు.

ఆ కేసులో ఒక హత్య, ఒక హిట్ అండ్ రన్, ఒక యువతి మిస్సింగ్ వంటి మూడు విడి విడి కేసులు కలిసి ఉంటాయి. ఆ మూడు కేసులను దీపక్ ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు ? అతని విచారణ ఎలాంటి మలుపులు తిరిగింది ? ఒక కేసుకు, ఇంకో కేసుకు సంబంధం ఏమిటి ? దీపక్ ఆ కేసులో నిజాన్ని ఎలా తెలుసుకున్నాడు ? చివరికి ఆ కేసుకి న్యాయం ఎలా చెప్పబడింది, ఎవరి చేత చెప్పబడింది ? అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాను ఓపెన్ చేయడమే ఒక అపార్ట్మెంట్లో జరిగే యువతి యువకుల హత్య ద్వారా ఓపెన్ చేసిన దర్శకుడు కార్తిక్ నరేన్ తన మేధస్సునంతా ఉపయోగించి ఆరంభం నుండి చివరి దాకా ఎక్కడా ప్రేక్షకుడికి తనంతట తానుగా అసలు నిజం ఏమిటో తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు. ఒకదాని తర్వాత ఒక ఆటంకం సృష్టిస్తూ ఊహకందని విధంగా సినిమాను నడిపాడు. దీంతో కథనం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ చాలా థ్రిల్లింగా అనిపించింది. ఎంతలా అంటే దర్శకుడు క్రైమ్ థ్రిల్లర్ కు చేయవలసిన న్యాయం దాదాపు పూర్తిగా చేసేశాడు అనిపించేంత.

ఇక సినిమా ఫస్టాఫ్ మొత్తాన్ని ప్రస్తుతంలో పోలీస్ ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషన్ తాలూకు సన్నివేశాలతో, వాళ్ళు తమ దృష్టి కోణంలో నేరాలు ఎలా జరిగుంటాయి అనే ఊహించే సన్నివేశాలతో ప్రేక్షకుడి తెలివికి కఠినమైన పరీక్ష పెడుతూ, ఎక్కడా తుది తీర్పును రివీల్ చేయకుండా బాగా నడిపాడు. అలాగే సెకండాఫ్ కు వచ్చే సరికి ఫస్టాఫ్ లో ప్రేక్షకులు సమాధానం అందుకోలేక ఓడిపోయిన ఒక్కొక్క ప్రశ్నకు ఊహకందని జవాబులు చాలా పక్కాగా చెబుతూ ఆశ్చర్యాన్ని కలిగించాడు.

చివరి క్లైమాక్స్ అయితే అబ్బో ఏమి తీర్పు అనేలా ఇచ్చాడు. ఒకేసారి ఒక పోలీస్ ఆఫీసర్ కర్తవ్య నిర్వహణ ఎలా ఉండాలి, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల పర్యవసానం ఏమిటి అనే అంశాల్లోనే కథ మొత్తానికి తీర్పు చెప్పడం బాగుంది. ఇక ప్రధాన పాత్ర చేసిన రహమాన్ నటన సినిమాకు కావాల్సినంత సీరియస్, సిన్సియర్ ఫీలింగ్ ను తీసుకొచ్చింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాల్లోని ఇంటెన్సిటీని చాలా బాగా క్యారీ చేశాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని ప్రధాన మైనస్ పాయింట్ అంటే చెప్పాల్సింది ఖచ్చితమైనవే అయినప్పటికీ సామాన్య ప్రేక్షకుడికి అంత త్వరగా అందని ఫస్టాఫ్లోని కొన్ని లాజిక్స్ గురించి. సినిమా మొదలైన దగగర్నుంచి ఇంటర్వెల్ పడే వరకు క్లాస్ రూమ్ లో కూర్చున్నట్టు దర్శకుడు ప్రేక్షకుల మీదకి ప్రశ్నల మీద ప్రశ్నలు వదులుతూ సమాధానాలు కనుక్కోండి చూద్దాం అన్నట్టు ఉండే కథనం కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుంది కానీ బి, సి తరగతుల ఆడియన్సుకు పెద్దగా నచ్చదు.

ఇక సెకండాఫ్లో చిక్కుముడులన్నీ సవివరంగా విప్పుకుంటూ వచ్చినా, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నా థియేటర్లోంచి బయటికి వచ్చేప్పుడు కొన్నిస్ సన్నివేశాలు సమాధానం వెతుక్కోవాల్సి రావాడం కాస్త నిరుత్సాహాన్ని, అసహనాన్ని కలిగిస్తుంది. చూసిన చిత్రం గురించి ప్రేక్షకుడు ఎక్కువగా ఆలోచిస్తే ఆ సినిమా సక్సెస్ అయినట్టే అనే ధర్మాన్ని అనుసరించి ఈ సినిమా విజయవంతం అయినట్టే.. కానీ ఆ ఆలోచన మెచ్చుకోలుతనంగా, ఆశ్చర్యకరంగా ఉండాలి కానీ అనుమానాస్పదంగా, కాస్త తికమకగా ఉంటే ఆ విజయానికి కొంచెంలో కొంచెం మసక పడ్డట్టే. ఈ సినిమా విషయంలో సరిగ్గా అదే జరిగింది.

సాంకేతిక విభాగం :

ఒక క్రైమ్ కథకు థ్రిల్లింగా ఉండే అల్లికలాంటి తెలివైన కథానాన్ని జోడించి ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ ను రాసుకోవడంలో, దాన్ని అలాగే తెరకెక్కించడంలో కార్తిక్ నరేన్ ఒక దర్శకుడిగా, రచయితగా 99 % సక్సెస్ అయ్యాడు. ఇక సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, జెక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉండి సినిమాకు నూటికి నూరు శాతం సహాయపడ్డాయి. క్లిష్టమైన ఈ చిత్ర కథనానికి శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ చాలా బాగా దోహదపడింది. శివరాం ప్రసాద్ గోగినేని అందించిన తెలుగు మాటలు, పాత్రల డబ్బింగ్ వాయిస్ చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి.

తీర్పు:

కార్తికి నరేన్ డైరెక్ట్ చేసిన ఈ ’16 – ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌’ చిత్రం ఆద్యంతం ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. కార్తిక్ నరేన్ రూపొందించిన మంచి కథ, అద్భుతమైన కథనం, రహమాన్ గొప్ప నటన, సరైన క్లైమాక్స్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా ఫస్టాఫ్ బాగానే ఉన్నా అందులో దర్శకుడు ఉద్దేశపూర్వకంగానే ప్రేక్షకుడిని తికమక పెడుతున్నట్టు ఉండటం, ఎంతో సేపు ఆలోచిస్తే గాని అందుకోలేని అంశాలు కొన్ని ఉండటం ఇందులో కాస్త ఇబ్బంది కలిగించే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే ఈ చిత్రం క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది.

గమనిక : హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోను వీక్షించి ఈ సమీక్ష ఇవ్వబడినది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు