‘చాయ్ షాట్స్’ యాప్‌లో ప్రసారమవుతున్న వర్టికల్ సిరీస్ ‘దందా’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆదిత్య దేవులపల్లి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో కథానాయకుడిగా నటించిన దొర సాయి తేజ తాజాగా తన అనుభవాలను పంచుకున్నారు. బాలనటుడిగా డబ్బింగ్ చెప్పడంతో మొదలైన తన సినీ ప్రయాణం, ‘బ్యాక్ బెంచర్స్’ వంటి ప్రజాదరణ పొందిన సిరీస్‌ల ద్వారా ముందుకు సాగిందని తెలిపారు. ‘దందా’లో తాను పోషించిన ‘అరవింద్’ పాత్రకు వస్తున్న ప్రశంసలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని, దర్శకుడి స్పష్టమైన విజన్ వల్లే ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందని చెప్పారు.
చిత్రీకరణ సమయంలో సమయం, ఖర్చు తగ్గించేందుకు సీన్ పూర్వాపరాలపై ముందే పూర్తి అవగాహన పెంచుకునేవాడినని సాయి తేజ వెల్లడించారు. వీలైనంత వరకు సన్నివేశాలను సింగిల్ టేక్‌లోనే పూర్తి చేయడానికి ప్రయత్నించేవాడినని తెలిపారు. కేవలం రోజువారీ కంటెంట్ క్రియేటర్‌గా మిగిలిపోకుండా, పూర్తిస్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సమాజంలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి, వారు ప్రేక్షకులపై ప్రభావం చూపేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తులో సాధారణ ప్రజలకు దగ్గరగా ఉండే కథలతో పాటు స్ఫూర్తిదాయకమైన పాత్రలను ఎంచుకుంటానని సాయి తేజ తెలిపారు. థియేటర్లయినా, ఓటీటీ వేదికలయినా సరే.. ప్రేక్షకులు తమ సమయాన్ని, డబ్బును వెచ్చించి చూసే ప్రతి కంటెంట్‌కు పూర్తి న్యాయం చేసేలా మంచి ప్రాజెక్టులతో ముందుకు వస్తానని ఆయన పేర్కొన్నారు.


