డెలివరీ బాయ్‌తో గొడవ.. క్లారిటీ ఇచ్చిన నటుడు అఖిల్ రాజ్..!

డెలివరీ బాయ్‌తో గొడవ.. క్లారిటీ ఇచ్చిన నటుడు అఖిల్ రాజ్..!

Published on Jun 30, 2026 6:39 PM IST

‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అఖిల్ రాజ్, తాజాగా ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌తో జరిగిన గొడవ కారణంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ నెట్టింట హల్‌చల్ చేయడంతో అఖిల్ రాజ్‌పై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, అసలు ఏం జరిగిందో వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక క్లారిటీ వీడియోను విడుదల చేశాడు.

అఖిల్ రాజ్ మాట్లాడుతూ.. ‘మేము ఫుడ్ ఆర్డర్ చేయలేదు, కానీ మా ఇంటికి పార్సిల్ వచ్చింది. మా అమ్మ ఆ పార్సిల్ తీసుకుని, ఎవరు ఆర్డర్ చేశారని అడిగారు. ఎవరూ చేయలేదని తెలిసి పక్కన పెట్టారు. కొంత సమయం తర్వాత వచ్చిన డెలివరీ బాయ్, ఉచితంగా వస్తే ఏదైనా తీసేసుకుంటారా అంటూ మా అమ్మను అసభ్య పదజాలంతో దూషించాడు. మా కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. ఒక కొడుకుగా మా అమ్మను తిడితే చూస్తూ ఊరుకోలేక, పద్ధతిగా ప్రవర్తించమని అతడిని హెచ్చరించాను. దాంతో అతడు ఈ వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించాడు” అని చెప్పుకొచ్చాడు.

నిజానిజాలు తెలియకుండా చాలా మంది తనను విమర్శిస్తున్నారని అఖిల్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మీ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరు ఊరుకుంటారా? అయితే నేను కొంచెం పరిణతితో ఆలోచించి ఈ విషయాన్ని పోలీసుల వరకు తీసుకెళ్లాల్సింది, కానీ మా అమ్మను దూషించడంతో సహనం కోల్పోయాను. నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినవాడినే, గతంలో డెలివరీ బాయ్‌గా కూడా పనిచేశాను. మా సినిమాలో కూడా ఆత్మగౌరవం గురించే మాట్లాడాం. అలాంటిది నేనెందుకు కావాలని గొడవ పడతాను? దీని వల్ల నాకు వచ్చే లాభం ఏంటి?’ అంటూ అఖిల్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు.

తాజా వార్తలు