అల్లు అర్జున్ గత చిత్రం ‘ఆలా వైకుంఠపురములో’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా, ఈ 2020లో టాలీవుడ్ చూసిన అతిపెద్ద విజయంగా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ రన్లోనే కాదు ఓటీటీలో కూడ దుమ్మురేపింది. నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదలైన ఈ చిత్రం లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకులను బాగా అలరించింది. థియేటర్లలో చాలా రోజులే రన్ అయినప్పటికీ ఓటీటీలో కూడ ప్రేక్షకులు విపరీతంగా సినిమాను వీక్షించారు.
ఎంతలా అంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన దక్షిణాది సినిమాల జాబితాలో టాప్ పొజిషన్లో ఉంది చిత్రం. లాక్ డౌన్ పడగానే సౌత్ నుండి చాలా చిన్న, ఒక మోస్తరు సినిమాలు చాలానే రిలీజయ్యాయి నెట్‌ఫ్లిక్స్‌లో. వాటన్నింటినీ దాటుకుని ‘ఆలా వైకుంఠపురములో’ ఈ ఫీట్ సాధించింది. ఒకరకంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల రీరిలీజ్ అనే అనుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలో కూడ బన్నీకి మంచి ఫాలోయింగ్, క్రేజ్ ఉండటం మూలాన ఈ ఫీట్ సాధ్యమైంది. ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఇందులో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటించింది.


