దానికి ప్రభాస్ పూర్తి అర్హుడు – అల్లు అర్జున్

Published on Jan 28, 2020 9:33 am IST

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటిరోజు నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తూ అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను నమోదు చేసిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. కాగా చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బన్నీ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ‘‘బాహుబలి గురించి రాజమౌళిగారికి పర్సనల్‌గా చెప్పాను కానీ, ఇప్పటివరకు అందరికీ చెప్పే అవకాశం రాలేదు. బాహుబలితో ప్రభాస్‌ కు ఎంత పేరు వచ్చినా ఆ పేరుకు తను పూర్తి అర్హుడు. ‘మిర్చి’ లాంటి సినిమా తర్వాత ఒక ఐదు సంవత్సరాలు ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లో సంపాదించుకుని ఉండొచ్చు. అయిదేళ్లలో ఒకటిన్నర సంవత్సరం మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి. మిగతా మూడున్నర సంవత్సరాలు ఖాళీగా ఉంటాయి. అంతకాలం ఒక విషయం నమ్మి కూర్చున్నదానికి, అతను శాక్రిఫైజ్ చేసినదానికి ఎంత వచ్చినా కూడా దానికి అతను అర్హుడే. మేడమ్ టుస్సాడ్స్‌లో అతని స్టాచ్యూ పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ప్రభాస్‌కు అంత పెద్ద హిట్ వచ్చినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ అని చెప్పుకొచ్చారు.

బన్నీ ఇంకా మాట్లాడుతూ.. రికార్డ్స్ అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇవాళ మనం కొట్టవచ్చు, ఆర్నెల్ల తర్వాత ఇంకొకరు కొట్టొచ్చు. అయితే ప్రజల మనసుల్లో ఒక సినిమా ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూశారా అది ఫరెవర్. దాన్నెవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు’’ అని తెలిపారు. ఇక బన్నీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ప్రస్తుతం సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఐతే ఈ సినిమాలో బన్నీ రఫ్ లుక్ లో ఒక లారీ డ్రైవర్‌ గా ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :