
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా విడుదల ఇప్పట్లో లేకపోవడంతో సినిమాపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా, మరింత పెంచేలా బాహుబలి టీమ్ కొత్త ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ ప్రకారం మే 31న ‘బాహుబలి’ మొదటి భాగం ట్రైలర్‌ను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. దీనికోసం ఇప్పట్నుంచే ప్రచారం మొదలుపెట్టేశారు. ముందే చెప్పినట్టుగా మే 1న, మే 4న సినిమా పోస్టర్లను విడుదల చేశారు. తాజాగా ఈ వరుసలో మూడో పోస్టర్ నేడు విడుదలైంది.
మూడో పోస్టర్‌లో దేవసేన పాత్రలో కొద్దిసేపు కనిపించనున్న అనుష్క పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. ‘కొన్నేళ్ళ పాటు హింసించబడి, బంధీగా ఉన్న ఆమె నిప్పులే శ్వాసగా బయటకొచ్చింది’ అన్న అర్థం వచ్చేలా రిలీజ్ చేసిన పోస్టర్‌లో డిఫరెంట్ అనుష్కను చూడొచ్చు. నిజానికి అనుష్క పాత్ర బాహుబలి రెండో భాగంలో ఎక్కువగా ఉంటుందని, మొదటి భాగంలో ఆమెది చిన్న పార్ట్ మాత్రమేనని, ఈ పాత్రలో ఆమె సరికొత్తగా కనిపించి మెప్పిస్తారని రాజమౌళి తెలిపారు. ఆ కనిపించే కొద్దిసేపే ఆమె పాత్ర ఏ రేంజ్‌లో అలరించనుందనేది పోస్టర్ ద్వారే తెలిసిపోయింది. వరుసగా మూడు పోస్టర్లకు కూడా అనుకున్న దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా యూనిట్ హ్యాపీగా ఉంది.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి ది బిగినింగ్’గా పిలవబడుతున్న మొదటి భాగం జూలై 10న విడుదల కానుంది.

