ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా స్ఫూర్తిని, యువతలో సానుకూలతను పెంచే లక్ష్యంతో చామల ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఎలైట్ క్రికెట్ లీగ్ (ECL) సీజన్-2 జెర్సీలను రాష్ట్ర క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. 2026 ఫిబ్రవరి 21, 22 తేదీలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ టోర్నమెంట్ విశాఖపట్నం వేదికగా జరగనుంది. గతంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ లీగ్ మొదటి సీజన్‌కు విశేష స్పందన లభించగా, ఆ ప్రైజ్ మనీని అమర జవాన్ల కుటుంబాలకు అందించినట్లు నిర్వాహకులు గుర్తు చేశారు.
జెర్సీ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, చామల ఫౌండేషన్ సామాజిక సేవలను ప్రశంసించారు. ముఖ్యంగా, యువతలో డ్రగ్స్ వ్యసనాన్ని తగ్గించే అవగాహన కార్యక్రమాలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవానుల కుటుంబాలకు చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. ఇలాంటి సమాజోపయోగ కార్యక్రమాలకు క్రీడలను అనుసంధానించడం చైర్మన్ ఉదయ్ చందర్ రెడ్డి దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ టోర్నమెంట్ రాష్ట్ర క్రీడా రంగానికి కొత్త ఊపునిస్తుందనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ECL సీజన్-2లో టాలీవుడ్ థండర్స్, బుల్లితెర రేంజర్స్, ఆంధ్ర పొలిటికల్ కింగ్స్, వైరల్ చీతాస్, పోలీస్ లైన్స్, మీడియా మాస్టర్స్, సిరి కార్పొరేట్ మిస్సైల్స్ అనే ఏడు టీములు పాల్గొననున్నాయి. క్రీడల ద్వారా యువతను సరైన మార్గంలో నడిపించడమే తమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.


