ఇంటర్వ్యూ : హను రాఘవపూడి – నితిన్, అర్జున్ పాత్రలు ఎక్కువ హైలెట్ అవుతాయి !
Published on Aug 9, 2017 3:41 pm IST


గతేడాది ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఈ సంవత్సరం నితిన్ హీరోగా చేసిన సినిమా ‘లై’. సరికొత్త తరహాలో రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్బంగా హను మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) అసలు ‘లై’ అంటే ఏమిటి ?
జ) ఈ సినిమాలో నరేషన్ కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ అబద్దాలాడే ఒక కుర్రాడు చెప్పిన ఒక అబద్దం అతన్ని ఒక పెద్ద సమస్యలోకి తీసుకెళ్లి పడేస్తుంది. అప్పుడు కథ పూర్తిగా యూ టర్న్ తీసుకుంటుంది. కథలో మంచి మలుపులుంటాయి.

ప్ర) నితిన్ పాత్ర ఎలా ఉటుంది ?
జ) అతనెప్పుడూ అబద్ధాలకు దగ్గరగా బ్రతుకుతుంటాడు. ఈజీ మనీ కోసం ట్రై చేస్తుంటాడు. పాత బస్తీలోని అతని కథ ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, దాని వెనుక ఎవరున్నారు అనేదే సినిమా.

ప్ర) విలన్ గా అర్జున్ గారిని ఎందుకు తీసుకున్నారు ?
జ) ఇందులో విలన్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. అసలు మూడేళ్ళ క్రితం ఆయన పాత్రతోనే ఈ కథ మొదలైంది. పాత వాళ్ళు చేస్తే అందులో వైబ్రేషన్ పోతుంది పైగా కొత్తగా ఉండాలి. అందుకే ఆయన్ను ఎంచుకున్నాను. అసలు ఆయనకు కథ చెప్పడానికి భయమేసింది. చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారు.

ప్ర) నెక్స్ట్ ఎవరితో చేస్తున్నారు ?
జ) నాని, నితిన్ తో సినిమాలున్నాయి. నాని సినిమాను ఇప్పుడే చేయలేం. ఎందుకంటే అది ఆర్మీ బేస్డ్ సినిమా. మే తర్వాతే చేయగలం. పర్మిషన్ ఇబ్బందులున్నాయి.

ప్ర) శుక్రవారం మూడు సినిమాలొస్తున్నాయి. ఏమైనా ఇబ్బంది ఉంటుందా ?
జ) అదేం లేదు. సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పుడే ఆగష్టు 11ని టార్గెట్ పెట్టుకుని పనిచేశాం. కానీ అనుకోకుండా ఇంకో రెండు సినిమాలొస్తున్నాయి. ఏదైనా సినిమా బాగుంటేనే ఆడుతుంది. అన్ని సినిమాలు ఆడాలని కోరుకుందాం.

ప్ర) మేఘా ఆకాష్ ఎలా చేసింది ?
జ) బాగా చేసింది. ఆమె నటించదు బిహేవ్ చేస్తుంది. రాని భావాన్ని తీసుకొచ్చి ముఖంలో పెట్టుకోదు. అలా బిహేవ్ చేసి వెళ్ళిపోతుంది. అదే ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్. సినిమాలో చూస్తే ఆమెకిది మొదటి సినిమా అని అనుకోరు.

ప్ర) ఈ సినిమాలో ఏ సన్నివేశాలు ఎక్కువగా హైలెట్ అవుతాయి ?
జ) ఇందులో 90 శాతం సన్నివేశాలు చాలా బాగుంటాయి. మిగతా 10 శాతం కనెక్టింగ్ సీన్స్ ఉంటాయి. అవే కథను కలుపుతుంటాయి. మంచి ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి. అర్జున్, నితిన్ పాత్రలు సినిమాలో ఎక్కువ హైలెట్ అవుతాయి.

ప్ర) ఇందులో కామెడీ కోసం ప్రత్యేకంగా ఏమైనా చేశారా ?
జ) సపరేట్ కామెడీ అంటూ ఏం లేదు. ఫన్ కథలోనే ఉంటుంది. మొదటి సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథలో ఇలానే ఫోర్స్డ్ కామెడీ పెట్టాను. ఇందులో అలా లేదు. నాకసలు కథతో సంబంధంలేని కామెడీని సినిమాలో ఎలా పెట్టాలో తెలీదు.

ప్ర) ‘అ..ఆ’ తరవాత ఈ కథలో ఏమైనా చేంజెస్ చేశారా ?
జ) లేదు. ‘అ..ఆ’ తర్వాతే నేను నితిన్ ను కలిసి కథ చెప్పాను. అంతకంటే ముందే నితిన్ నాకు బాగా తెలుసు.

ప్ర) ఆడియో రెస్పాన్స్ ఎలా ఉంది ?
జ) ఇంతకు ముందు నా రెండు సినిమాలకి కొత్త సంగీత దర్శకులతోనే చేశాను. కానీ ఈసారి కావాలనే మణిశర్మగారిని ఎంచుకున్నాను. ఆయన చాలా కష్టపడ్డారు. మంచి మ్యూజిక్ ఇచ్చారు. కొత్తగా చేయాలని ఈ సంగీతం ఇచ్చారు. బిజిఎం అయితే చాలా బాగుంటుంది.

 
Like us on Facebook