
వినూత్న చిత్రాల ద్వారా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శక నటుడు.. రవిబాబు. ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాలు కొత్తదనంతో ఆకట్టుకోవడమే కాక మంచి విజయాలుగానూ నిలిచాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం.. ‘అవును 2’. రవిబాబు దర్శకత్వం వహించగా హర్షవర్ధన్ రానే, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించగా 2012లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘అవును’ సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా రూపొందింది. ఈనెల 6నే అవును 2 సినిమాను విడుదల చేయాలనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా వేశారు.
తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న విడుదల చేయనున్నట్లు సినిమాను పంపిణీ చేయనున్న ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. అవును సినిమా సాధించిన విజయం గురించి అందరికీ తెలిసిందే. రవిబాబు గత చిత్రం లడ్డూబాబు అంతగా ఆకట్టుకోకపోయినా, అవును సినిమాతో పాటు రవిబాబు ట్రాక్ రికార్డ్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక సన్నాఫ్ సత్యమూర్తి ఏప్రిల్ 2న విడుదలయ్యే సూచనలు కనిపించకపోవడంతో అవును 2 విడుదలకు సరైన సమయం చిక్కిందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

