
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ‘బాహుబలి ది బిగినింగ్’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మే 31న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈలోగా ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఉత్తేజాన్ని పెంచడానికి సినిమాలో కీలక పాత్రల్లో కనిపించిన వారి పోస్టర్లను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
ఈ క్రమంలోనే బాహుబలి ఫస్ట్‌లుక్ పోస్టర్, శివుడు పాత్రలో నటించిన ప్రభాస్ పోస్టర్, దేవసాన పాత్రలో నటించిన అనుష్క పోస్టర్, శివగామిగా నటించిన రమ్యకృష్ణ పోస్టర్, కాళకేయగా నటించిన ప్రభాకర్ పోస్టర్, బిజ్జలదేవగా నటించిన నాజర్ పోస్టర్, కట్టప్పగా నటించిన సత్యరాజ్ పోస్టర్, అస్లామ్ ఖాన్‌గా నటించిన సుధీప్ పోస్టర్ ఇలా ఒక్కో పోస్టర్‌తో సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ వరుసలో అవంతిక, భల్లాల దేవ, బాహుబలి మూడు పోస్టర్‌లు మాత్రమే మిగిలాయ్!
ఇందులో అవంతికగా నటించిన తమన్నా పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. “ఆమె అందం ఓ రహస్యం చేత కప్పబడి ఉంది” అన్న అర్థం వచ్చేలా ఈ ఫోటోను రాజమౌళి పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌లో ఇంతకుముందెన్నడూ కనిపించనంత అందంగా, అతిలోక సుందరి వలె కనిపిస్తూ కట్టిపడేస్తోంది తమన్నా. ఈ పోస్టర్ విడుదలైన కాసేపటికే ఎప్పట్లానే ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది. ఇక మిగిలిన రెండు పోస్టర్లు రానా, ప్రభాస్‌లవి కావడంతో పోస్టర్లపై మరింత ఆసక్తి పెరుగుతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు.

