‘బాహుబలి’ టీమ్‌ను కలవరపెడుతున్నది ఏంటి?
Published on Nov 28, 2016 9:48 am IST

Vijayendra-Prasad1

దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన ప్రభంజనమైన ‘బాహుబలి’ గతేడాది ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక ప్రాంతీయ సినిమా ఊహకు కూడా అందని రీతిలో బాహుబలి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఆ సినిమా చివర్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నను దేశం మొత్తం ఆలోచించేలా చేసి సస్పెన్స్‌లో పెట్టిన రాజమౌళి, అందుకు సంబంధించిన సస్పెన్స్‌ను రెండో భాగమైన బాహుబలి 2లో చెప్పనున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న బాహుబలి 2, సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుపుకుంటోంది.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో వందల మంది పాల్గొంటూ ఉండగా, కొద్దిరోజుల క్రితం ఒకరు అత్యుత్సాహంతో కొంత ఫుటేజ్‌ను విడుదల చేయడం సంచలనం రేపింది. మొదట్నుంచీ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నా ఇలా జరగడం బాహుబలి టీమ్‌ను కలవరపెడుతోంది. ముఖ్యంగా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “కథలోని అసలు ట్విస్ట్‌ను బయటకు రాకుండా ఇన్నాళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్నాం, మా అదృష్టం కొద్దీ ఆ సన్నివేశాలు లీక్ అవ్వలేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఈ చర్యలు ఆగడం లేదు.” అన్నారు. ఇక ఈ లీక్ ఉదంతంతో ‘బాహుబలి 2’ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్‌ను చాలా జాగ్రత్తగా చేస్తోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Like us on Facebook