‘బాహుబలి’ నిర్మాతల్ని బ్లాక్ మెయిల్ చేసి అరెస్టయ్యారు !


‘బాహుబలి-2’ చిత్రం సాధించిన సక్సెస్ అంతా ఇంతా కాదు. సినీ ప్రేక్షకులంతా ఈ సినిమాకు నీరాజనాలు పడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి, అది సాధించిన సక్సెస్ గురించి తెలీని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఈ చిత్రానికి అడపాదడపా పైరసీ దాడులు తప్పడంలేదు. కొన్ని రోజుల క్రితమే ఒక పైరసీ ముఠాని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో 6 సభ్యుల గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. అది కూడా హైదరాబాద్లో కావడం కాస్త కలవరానికి గురిచేస్తోంది.

సదరు గ్యాంగ్ తమ టీమ్ లో సభ్యుడైన దివాకర్ కుమార్ కు బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లలో ఉన్న థియేటర్ ద్వారా హై క్వాలిటీ ప్రింట్ ను పైరసీ చేసి నిర్మాత కరణ్ జోహార్, ఇతర నిర్మాతల్ని సంప్రదించి తమ వద్ద ఉన్న పైరసీ కాపీలోని శాంపిల్ వీడియోను చూపి రూ. 15 లక్షలు ఇవ్వకుంటే సినిమాను ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.

దాంతో నిర్మాతాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను కనుగొని ఆరుగుర్ని అరెస్ట్ చేసి, పైరసీ సీడిలను, ఇతర పరికరాల్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.