మాస్ మహారాజా రవితేజ ఈ సంక్రాంతికి మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి హైప్‌ను తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. “భర్త మహాశయులకు విజ్ఞప్తి పూర్తిగా ఎంటర్‌టైన్మెంట్ మీద నడిచే సినిమా. సంక్రాంతి పండగకు కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లి హాయిగా చూడొచ్చు. రవితేజ గారితో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలనే ఆలోచనతోనే ఈ కథ పుట్టింది. ఆయన మార్క్ ఎనర్జీ, ఫన్ ఉండేలా, అదే సమయంలో పాత్రకు కొత్తదనం కనిపించేలా సినిమాను తీశాం. నిజ జీవితంలో చూసే మనుషుల్లా పాత్రలు ఉంటాయి. అందుకే ఆడియెన్స్‌కు చాలా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది, ఎంజాయ్ చేయిస్తుంది” అన్నారు.
నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ, “జనవరి 13న మా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ప్యాకేజ్. సంక్రాంతి సీజన్‌లో ఇలాంటి సినిమాలే బాగా ఆడతాయనే నమ్మకంతో ఈ సినిమాను ప్లాన్ చేశాం. మాతో పాటు విడుదలయ్యే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని, ఇండస్ట్రీకి మంచి సంవత్సరం రావాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ, “టైటిల్ వినగానే ఆసక్తి కలిగించే సినిమా ఇది. కిషోర్ తిరుమల గారు చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ఆయనతో పని చేయడం నాకు చాలా మంచి అనుభవం. ఇందులో నా పాత్ర పేరు బాలామణి. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. భోగి రోజున రిలీజ్ అవుతున్న ఈ సినిమా నా మొదటి సంక్రాంతి సినిమా కావడం చాలా స్పెషల్” అని చెప్పారు.
ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ, “ఈ సినిమా టైటిల్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఇది ఫన్‌తో పాటు రిలేషన్‌షిప్స్‌ను సెన్సిబుల్‌గా చూపించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నేను మానస శెట్టి అనే మోడర్న్, కాన్ఫిడెంట్ పాత్రలో కనిపిస్తాను. రవితేజ గారు సెట్లో ఎప్పుడూ ఎనర్జీతో ఉంటారు. ఆయనతో పని చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా చూస్తుంటే నిజంగా ఒక పండగ వాతావరణం ఫీలవుతుంది. సంక్రాంతికి ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అలరిస్తుంది” అని అన్నారు.


