బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. భారీ డిజాస్టర్‌గా మిగిలిన ‘వార్ 2’ తర్వాత ఆయన మరింత సెలెక్టివ్‌గా మారాడు. ప్రస్తుతం ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘క్రిష్ 4’ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండడమే కాకుండా, వచ్చే ఏడాది ఈ చిత్రానికి స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తనను సంప్రదించిన పలువురు ప్రముఖ దర్శకుల కథలను కూడా హృతిక్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, టాలీవుడ్ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో హృతిక్ రోషన్ ఒక సినిమా చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేశాయి. పరశురామ్ గత చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన పలువురు తెలుగు, తమిళ హీరోలను ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ ఏ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.
నిజానికి, పరశురామ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. కానీ పలు చర్చల తర్వాత ఆ ప్రయత్నాలు ఫలించలేదు. మరి హృతిక్ రోషన్‌తో సినిమా చేయబోతున్నాడనే వార్తలపై పరశురామ్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.


