ఒక రకంగా ఈ వార్త తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులకు సంతోషం కలిగించే అంశమే. హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మి బదిలీ అయ్యారు. సోమవారం నుండి కొత్త అధికారి విధులకు హాజరవుతారు. ఆమె స్థానంలో గతంలో సెన్సార్ ఆఫీసర్ గా పనిచేసిన విజయ్ కుమార్ అనే వ్యక్తిని నియమించినట్టు సమాచారం.
ధనలక్ష్మి ప్రవర్తనపై కొంత కాలంగా ఇండస్ట్రీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. సినిమాల సెన్సార్ విషయంలో పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఒకానొక దశలో మంచు మోహన్ బాబు & ఫ్యామిలీ, రామ్ గోపాల్ వర్మలు ఆమెపై ప్రత్యక్షంగా పోరాటం చేశారు. ఆంధ్రప్రదేశ్ సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో ధనలక్ష్మి 14 ఏళ్ళ నుండి విధులు నిర్వర్తిస్తున్నారు. భాష రాకపోయినా ఆమెను ఎలా కొనసాగిస్తారు అంటూ మొదట విమర్శలు వచ్చాయి. తర్వాత ఆమె తెలుగు నేర్చుకున్నారనుకోండి. మొత్తానికి ఆమెను బదిలీ చేయడంతో దర్శకనిర్మాతలు, హీరోలు సంతోషంగా ఉంటారు.


